Nov 08,2023 21:47

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఎంఇఒ రాజ్‌కుమార్‌

ప్రజాశక్తి-సాలూరురూరల్‌ : 'మీ మనస్సు నొప్పించి ఉంటే మన్నించండి. మీ పాఠశాలకు మంజూరైన ముగ్గురు ఉపాధ్యాయులను అక్కడే ఉంచుతాం' అని ఎంఇఒ రాజ్‌కుమార్‌.. విద్యార్థుల తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. మండలంలో గంగన్నదొరవలస చెందిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం సాలూరు ఎంఇఒ రాజ్‌కుమార్‌కు తమ గ్రామంలోని పాఠశాల, ఉపాధ్యాయుల సమస్యలను వివరించడానికి వెళ్లారు. ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో తల్లిదండ్రులు మనస్తాపానికి గురై బుధవారం పాఠశాలకు ఏ విద్యార్థినీ పంపించలేదు. ఈ విషయాన్ని అక్కడి ఉపాధ్యాయులు ఎంఇఒ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన గంగన్నదొరవలస పాఠశాలకు చేరుకుని, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కావాలనే ఎవరినీ కించ పర చలేదని, అందుకు తనను మన్నించాలని కోరారు. గ్రామంలో 42 మంది విద్యా ర్థులు ఉన్నారని, వారికి ఇద్దరు ఉపాధ్యాయులుంటే సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఇంకొక ఉపాధ్యాయుడిని పక్కనున్న దండిగాం పాఠశాలకు డెప్యుటేషన్‌పై పంపించామని తెలిపారు. ఇక్కడున్న పిల్లలకు మూడు ఇళ్లల్లోని వరండాలలో పాఠాలు చెబుతున్నారని, ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా ముగ్గురు ఉపాధ్యాయుల అవసరం ఉందని అర్థమైందని చెప్పారు. మూడో ఉపాధ్యాయుడిని కూడా ఇక్కడి పాఠశాలలోనే ఉంచేందుకు నిర్ణయించామన్నారు. మీ పాఠశాల పూర్తయ్యే వరకు ఉంటారని, వీరిని ఎక్కడికి తరలించబోమని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని తల్లిదండ్రులు పాఠశాల నిర్మాణం విషయాన్ని ప్రశ్నించారు. ఇళ్లల్లో గడపలలో విద్యార్థులను కూర్చోబెట్టి ఎన్నాళ్లు పాఠాలు చెబుతారని, తరగతి గదులు ఎప్పటికి పూర్తవుతాయని ఎంఇఒను ప్రశ్నించారు. పాఠశాలకు నిధులు ప్రస్తుతం లేవని, వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్తులకు ఆయన సూచించారు.