శ్రమతో సిరులు పండించి
జీతం/కూలితో బతికే అల్ప సంతోషులం
మన శ్రమ వాటా మిగుళ్లు మింగి
వాళ్లు పెట్టుబడుల కోటలు కట్టారు
కష్టజీవే లేకుంటే పెట్టుబడి
కట్టెబారి కాటి బాట పట్టదా ?
కష్టంతో లాభం పండించే దేశంలో
కులం మతంగా చీలిన దేహాలతో
శ్రమజీవి చీలడం ఎవడికవసరమో
అర్థం... అర్థం కావడం లేదా!!!???
అయినా అల్ప సంఖ్యాకుల పాలనలో
అణగదొక్కబడుతున్న లోకంలో పడున్నాం
మనం మన శక్తి గుర్తెరిగి
ఎగిసి లేచే కెరటాలుగా తిరగబడితే...
ఇక్కడ కష్టజీవులే అధిక సంఖ్యాకులం
అధికారంపై శ్రమ పతాకం
మనం ఎందుకు ఎగరేయలేం?
ఎటొచ్చీ సంఘంగా ఏకమవడం
సంకల్ప బలం పెంచుకోవడమేగా
మన ముందున్న మహత్తర కర్తవ్యం
ఉన్నం వెంకటేశ్వర్లు
87900 68814