Sep 25,2023 23:39

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కుటీర పరిశ్రమగా మొదలైన కోళ్ల పెంపకం అనంతరం కాలంలో పౌల్ట్రీపరిశ్రమగా ఎదిగి లక్షలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. కార్పొరేట్‌ రంగమూ ఈ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కోళ్ల ఫారాల్లో కూలీలు మొదలు కోళ్లను రవాణా చేసే కార్మికులు, రవాణా వాహనాల్లో పనిచేసేవారు, చికెన్‌ దుకాణాలు, వాటిల్లో పనిచేసేవారు, చికెన్‌ ఆధారిత తినుబండారాలు తయారీదార్లు, వాటి విక్రేతలు, ఆయా షాపుల్లో పనిచేసే వారు ఇలా ఎన్నో లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. ఇలాంటి పరిశ్రమ కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతింది. అనంతరం పుంజుకుని గాడిన పడుతున్నట్లు కనిపిస్తున్నా అడపాదడపా వివిధ రకాల పుకార్లతో, వాతావరణ పరిస్థితులతో అప్పుడప్పుడూ నష్టాలను చవి చూస్తోంది.
గుంటూరు జిల్లాలో 30 లక్షల బాయిలర్‌ కోళ్లు, పల్నాడు జిల్లాలో 15 లక్షల బాయిలర్‌ కోళ్లను పెంచే ఫారాలు ఉన్నాయి. ఇవి కాకుండా గుంటూరు జిల్లాలో 23 లక్షల లేయర్స్‌ (గుడ్లు పెట్టే కోళ్లు), పల్నాడు జిల్లాలో 6 లక్షలకు పైగా లేయర్స్‌ కోళ్లను రైతులు పెంచుతున్నారు. ఈ పౌల్ట్రీల్లో సుమారు 2 వేల మందికి పైగా కూలీలు పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో వారానికి 14 నుండి 16 వేల టన్నుల కోళ్ల క్రయవిక్రయాలు జరుగుతుంది. ఈ టర్నోవర్‌ ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.4 కోట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలు చేయనున్న విధానాలతో ఏకంగా దేశీయ పౌల్ట్రీ రంగమే ప్రమాదంలోకి వెళ్లనుంది.
అమెరికాలో నిషేధించిన బ్రాయిలర్‌ కోడి శరీర బాగాలైన కాలేయం (లివర్‌), తొడబాగం (లెగ్‌ పీస్‌) వంటి పదార్థాలకు దేశంలోకి దిగుమతి చేరుకునేలా ఇండియా-అమెరికా మధ్య జి20 సదస్సులో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో ఫలితంగా అమెరికా నుండి చికెన్‌ లివర్‌, లెగ్‌పీస్‌లు భారీగా ఇండియాకు దిగుమతి కానున్నాయి. వీటిపై సుంకాన్నీ బాగా తగ్గించారు. దీనివల్ల దేశీయంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. పైగా అమెరికా నుండి దిగుమతి చేసుకునే పదార్థాలను ఆ దేశంలో నిషేధించారని చెబుతున్నారు.
అమెరికాలో బ్రాయిలర్‌ కోళ్లు పెంచే విధానం
అమెరికాలో కోళ్ల పెంపకంలో భాగంగా పంది, గేదె మాంసాన్ని బ్రాయిలర్‌ కోళ్లకు ఆహారంగా ఇస్తారు. ఈ ఆహారం ప్రభావం కోడి శరీరంలోని కాలేయం, తొడ భాగంలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కోళ్ల మాంసం తింటే ఆనారోగ్యమని అమెరికాలో వైద్య నిపుణుల హెచ్చరికతో అక్కడ వాటి విక్రయాలను నిషేధించారని తెలిసింది. వాటినే ఇండియాలో విక్రయించడానికి తాజాగా ఒప్పందం కుదిరింది.
ఇండియాలో పెంచే విధానం..
మన దేశంలో బ్రాయిలర్‌ కోడికి ఆహారంగా సోయా 90 శాతం, మిగతా 10 శాతం మొక్కజొన్న, జొన్న, ధాన్యం నూక, గోధుమలు, రాగులును ఉడికించి ఆహారంగా ఇస్తారు. వీటిల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉండడంతోపాటు ప్రత్యేకంగా ప్రాసెస్‌ చేసిన కారణంగా వీటిని ఆహారంగా తీసుకున్న కోళ్లు తక్కువ కాలంలోనే అధిక బరువుతో పెరుగుతాయి. సోయాలో పీచు పదార్థాలు, మొక్కజొన్నలోని లినోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ ఇ, బి1, బి6, నియాసిన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, రైబోఫ్లోవింగ్‌, తదితర విటమిన్లు పుష్కలంగా ఉన్న మొక్కజొన్నను దాణాగా ఇస్తారు. కోడి ఆరోగ్య సంరక్షణకు వినియోగించే ఔషధాల్లోనూ మనుషులు వినియోగించే ఔషధాలు ఉన్నాయని పౌల్ట్రీల నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రమాదకర ఒప్పందం
గుంటూరు విజరుకుమార్‌, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి.

అమెరికాలో నిషేధించిన వ్యర్థాలను విక్రయించే సొమ్ము చేసుకుందామనే ఆ దేశ కంపెనీలతో మనదేశ పాలకులు చీకటి ఒప్పందం చేసుకోవడం దారుణం. ప్రజల ఆరోగ్యానికి, ఉపాధికి ప్రాధాన్యమేమీ ఇవ్వకుండా దిగుమతులకు అనుమతించడం ప్రమాదకరం. ఈ ఒప్పందం కోళ్ల పరిశ్రమపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవించే వారిపైనే కాకుండా పరోక్షంగా వ్యవసాయ రంగంపైనా పడుతుంది. కోళ్లకు ఆహారంగా ఇచ్చే పంటల విక్రయాలు తగ్గుతాయి. ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమ, వ్యవసాయ రంగాలు ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలను చవి చూస్తున్నాయి. చాలా కోళ్ల ఫారాలు నిర్వహణ కొనసాగించలేక మూత పడ్డాయి. పౌల్ట్రీ పరిశ్రమలకు విద్యుత్‌, దాణాలు రాయితీలపై ఇచ్చి ప్రోత్సహించాలి. తాజా ఒప్పందాన్ని రద్దు చేసుకోకుంటే పౌల్ట్రీ నిర్వాహకులతో కలిసి పోరాడతాం.

10 వేలకు అవకాశం ఉన్నా 5 వేల కోళ్లే పెంచుతున్నాం
దాసరి ఆంజనేయులు, ఇక్కుర్తి, నరసరావుపేట మండలం.

రాష్ట్రంలో కోళ్ల దిగుమతులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పొరుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమలకు అనేక రాయితీలిచ్చి ప్రోత్సహిస్తుండడంతో ఉత్పత్తి వ్యయం తగ్గి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. మాకు 10 వేల కోళ్లను పెంచే షెడ్‌ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల వల్ల 5 వేల కోళ్లనే పెంచుతున్నాను. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం వల్ల మేము దెబ్బతింటున్నాం. అలాంటిది అమెరికాతో ఒప్పందం వల్ల పౌల్ట్రీ రంగమే దయనీయంగా మారే ప్రమదం ఉంది.

మరింత సంక్షోభంలోకి పౌల్ట్రీరంగం
పుచ్చకాయల వేణుగోపాలరావు, లక్ష్మీ చికెన్‌, ఎగ్‌ ట్రేడింగ్‌ సెంటర్‌, నరసరావుపేట.

20 ఏళ్ల క్రితం దేశంలోనే కోళ్ల ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉండగా తమిళనాడు, బెంగాల్‌, ఇతర రాస్ట్రాలకు ఎగుమతి చేసేవాళ్లం. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వల్ల ఇది సాధ్యమైంది. అనంతరం తెలంగాణ, పూణే, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల్లోనూ కోళ్ల పెంపకం పెరిగింది. అక్కడి ప్రభుత్వాలు కోళ్ల పరిశ్రమను వ్యవసాయ రంగంలో చేర్చి రాయితీలిస్తుండడంతో వారు ఎగుమతులు చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. జి20 సదస్సులో అమెరికా నిషేధించిన చికెన్‌ ఉత్పత్తులు 6 నెలల నుండి ఏడాది వరకు నిల్వ ఉండేలా ప్రాసెస్‌ చేసే విధానం సరైంది కాదు. జి20 ఒప్పందానికి ముందే బొంబాయి వంటి మహానగరాల్లో ఇప్పటికే చాటు మాటుగా అమెరికా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. తాజా ఒప్పందంతో భారత పౌల్ట్రీ రంగం మరింత సంక్షోభంలోకి వెళుతుంది.