Apr 04,2021 07:02

''దీప్తి ప్రచురణ సంస్థ'' అన్న అక్షరాలు బయట బోర్డుపై గర్వంతో మెరుస్తుండగా చూస్తూ నా ఆఫీసులోకి అడుగుపెట్టాను. లోపలికి వస్తూనే తలుపు దగ్గర ఉన్న డస్ట్‌బిన్‌లో నలిపి పడేసిన ఒక టైప్‌ చేయబడిన కొత్త కాగితం నా దృష్టిని ఆకర్షించింది. రోజూ నేను వచ్చేసరికి ఆఫీసు అంతా శుభ్రంగా ఉండి డస్ట్‌బిన్‌ ఖాళీగా కనిపించేది. కుతూహలం కొద్దీ తీసి చూశాను ఆ కాగితం ఏంటా అని. అది నిన్న నేను రామ్మూర్తికి టైప్‌ చెయ్యమని చెప్పి డిక్టేట్‌ చేసిన ఉత్తరం. అక్షర దోషాలేమీ లేవు. అంతా బాగానే వుంది! మరి ఇంత కష్టపడి టైప్‌ చేసి ఎందుకు పడేశాడబ్బా అని ఆలోచించడం మొదలుపెట్టాను. చూస్తే రామ్మూర్తి సీట్‌లో లేడు. వెంటనే తనకి ఫోన్‌ చేశాను. నిన్న నేను చెప్పిన లెటర్‌ టైప్‌ చేశావా అని అడిగాను. ''నేను ఇంకా ఆ పని పూర్తి చేయలేదు మేడం. మన క్లయింట్స్‌కి పంపాల్సిన కొన్ని పుస్తకాలు తీసుకుని కొరియర్‌ ఆఫీసుకి వచ్చాను. రాగానే మొదలుపెడతాను'' అని సమాధానం. ఏమాత్రం తప్పుల్లేకుండా టైప్‌ చేసినప్పుడే ఇది రామ్మూర్తి పని కాదని అనిపించింది. రామ్మూర్తి తెలుగు టైపింగ్‌లో చేసే తప్పులు చూస్తే నవ్వొస్తుంది. ప్రతిసారీ కరెక్షన్స్‌ చెప్పాల్సిందే. తను టైప్‌ చెయ్యకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? క్యాషియర్‌ అఫ్జల్‌కి టైప్‌ చెయ్యడం రాదు. మిగిలిన స్టాఫ్‌ అంతా ప్రెస్‌ లోపల ప్రింటింగ్‌ పనులు చేసేవారే. ఇకపోతే ఆఫీసు ఊడ్చే నాంచారమ్మ తప్ప ఇంక ఎవరూ లేరు. క్యాషియర్‌ అఫ్జల్‌ని ఎప్పటి నుండో నేను ప్రోత్సహిస్తున్నా టైపింగ్‌ నేర్చుకోమని. ''జరూర్‌ సునందా మేడం'' అంటాడే కానీ నేర్చుకోడు. ఇలాంటి చిన్న సంస్థల్లో అన్ని పనులూ చెయ్యగలవారు ఉంటేనే మనుగడ సాగించగలం అని వీళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోరు. ఎన్నో రోజుల నుంచి ఉన్న అనుబంధం కొద్దీ వారిని అలానే కొనసాగిస్తున్నాను. అయినా వారికి నేను తప్ప ఎవరున్నారు అనే పిచ్చి భ్రమ నాది. ఇంతలో ఆఫీసులోకి వస్తున్న అఫ్జల్‌ని చూసి ''అఫ్జల్‌ నువ్వేమైనా ఇది టైప్‌ చేశావా?'' అని పేపర్‌ చూపిస్తూ అనుమానంగా అడిగాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా... ''నహీ మేడం'' అని సమాధానం వచ్చింది.
ఒక పక్క ఈ చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటూనే ''నాంచారమ్మా''.. అని పిలిచేసరికి నాంచారమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ కాగితం డస్ట్‌బిన్‌లో ఎవరు పడేశారో తెలుసా? అని అడిగాను. బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయిన నాంచారమ్మని చూస్తూ ''నిన్నేనే'' అని మళ్ళీ కొంచెం గట్టిగా అడిగాను. ''నే.. నే అమ్మగారు'' చిన్నగా చెప్పింది. ఏదైనా కాగితం పడేసేటప్పుడు నన్ను అడిగి పడెయ్యి.. సరేనా అని అడిగేసరికి ''సరే అమ్మగారు'' అని మాట్లాడకుండానే తల ఊపింది. ''ఇంతకీ ఇది ఎక్కడ నుండి తీశావు?...'' అసలు ఎవరు టైప్‌ చేశారో అనే ప్రశ్న మదిని తొలుస్తుండగా అడిగాను. మళ్ళీ ''నేనే అమ్మగారు'' అని సమాధానం. నేను అడిగిన ప్రశ్న దానికి అర్థం కాలేదని మళ్ళీ అడిగాను ''అది డస్ట్‌బిన్‌లో పడేసింది నువ్వేనే. కానీ అది ఎక్కడి నుండి తీసి డస్ట్‌బిన్‌లో పడేశావు అని అడుగుతున్నా'' అన్నాను.
''అది టైప్‌ చేసింది నేనే అమ్మగారు'' తప్పు చేసిన దానిలా తల వంచుకుని చెప్పింది నాంచారమ్మ. జోక్‌ చేస్తుందేమో అనిపించి దానివైపు తీక్షణంగా చూస్తే నిజమే అన్నట్లు తలూపింది. ''నీకు టైప్‌ చెయ్యడం వచ్చా? నువ్వు ఏమి చదువుకున్నావు?'' ఉత్సుకత మరింత పెరిగి అడిగాను. నవ్వుతూ అడిగేసరికి నాంచారమ్మకి కూడా ధైర్యం వచ్చినట్లు ఉంది. మెల్లగా చెప్పసాగింది.
'నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం అమ్మగారు. కానీ మా తండాలో ఎక్కువ చదివితే పెళ్ళికాదని మా అమ్మ పది తర్వాత చదువు మాన్పించింది. పెళ్ళి అయ్యేదాకా పని చెయ్యమని నన్ను మండలంలో ఉన్న టైపు రైటరు షాపులో గదులు శుభ్రంచేసే పనిలో పెట్టింది. అక్కడ ఓనరన్న చాలా మంచాయన. నేను రోజూ ఒక గంట ముందే వస్తే టైపు నేర్పుతా అన్నాడు. నేను అలాగే టైపు నేర్చుకున్నా. తర్వాత అక్కడ కంప్యూటర్‌ కూడా వచ్చింది. అందులో కూడా తెలుగు టైపు చెయ్యటం నేర్చుకున్నా. నేను టైపు ఉద్యోగాలకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఓనరన్న చెప్పాడు. మా అమ్మకి ఉద్యోగం చేస్తానని చెప్తే అంతెత్తున లేచింది. మగోనికంటే ఎక్కువ సంపాదిస్తే సంసారం నిలవదని చెప్పి వెంటనే పెళ్ళి చేసింది. ఇప్పుడు నాకొక బిడ్డ. నా ప్రాణాలన్నీ దానిమీదనే. దాన్ని బాగా పై చదువులు చదివించాలి? కంటి పొరలను నీటి తెరలు కమ్మేయగా బేలగా చెప్పింది.
నాంచారమ్మ కథ విన్న నా మనసు ఒక్కసారిగా నన్ను రెండు దశాబ్దాల వెనక్కు లాక్కెళ్ళింది.
******
ఎన్నో ఆశలతో నా ఆలోచనలను అర్థం చేసుకునే మంచి భర్త రవీంద్ర రూపంలో దొరికినందుకు సంతోషించాను. కాలేజీ రోజుల్లో మేము చదివే కోర్సులు వేరయినా ఒకరికి ఒకరం పోటాపోటీగా కథలు, కవిత్వాలు రాస్తూ బహుమతులు పొందుతూ ఎంతో అన్యోన్యమైన స్నేహితుల్లా ఉండేవాళ్ళం. స్త్రీ జీవితం మీద అద్భుతంగా రాసే రవీంద్ర అంటే నాకు అభిమానమే కాదు గౌరవం కూడా. రవీంద్ర రాసిన కథలు చదివినప్పుడు నేను కూడా ఆడవారి జీవితాల్ని అంత గొప్పగా అర్థం చేసుకోలేనేమో అని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది. నేను రాసే కథలు తనకెంతో నచ్చుతాయని, అవి చాలా యధార్థంగా ఉంటాయని రవీంద్ర కూడా నన్ను ఎంతో ప్రోత్సహించేవాడు. అలా మా స్నేహం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.
అందరిలాగే పెళ్ళైన కొత్తలో మా జీవితం కూడా ఎంతో సాఫీగా సాగింది. రవీంద్రకి తొందరగానే మంచి ఉద్యోగం వచ్చింది. నేను ఒక పార్ట్‌ టైం టీచరుగా చేస్తూ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఇంతలో మా ఇద్దరి జీవితాల్లో వెన్నెల కురిపిస్తూ పాపాయి రూపంలో దీప్తి వచ్చేసింది. ''సునందా.. నేను బాగానే సంపాదిస్తున్నాను కదా.. ఇద్దరం ఉద్యోగం చేస్తుంటే పాపకు తగినంత సమయం కేటాయించలేమేమో'' అని రవీంద్ర అనడంతో నేను ఇంక ఉద్యోగ ప్రయత్నాలు మానేసి, దీప్తి ఆలనా పాలనలో గడిపేయడం మొదలుపెట్టాను.
తీరిక సమయాల్లో కథలు రాస్తూ పోటీలకు పంపించడం మొదలుపెట్టాను. అయితే పంపిన ప్రతిసారీ తిరుగు టపాలో వచ్చేసేవి నా కథలు. ఒకప్పుడు ఎన్నో బహుమతులు సాధించిన నాకు ఇది మింగుడుపడలేదు. మారుతున్న కాలానికి నా ఆలోచనలు సరిపడటం లేదా? లోపం ఎక్కడ వుంది? ఎందుకు నా కథలు ఒక్కటి కూడా బహుమతికి అర్హత పొందటం లేదు? కనీసం ప్రచురణకు కూడా నోచుకోవడం లేదు? అని ఆలోచిస్తూ ఎంతో మధనపడేదాన్ని. ''నువ్వు రాసే కథలు అర్థంచేసుకునే స్థాయి ఆ పత్రికలకు లేదు'' అని రవీంద్ర నన్ను అనునయించేవాడు.
ఒకరోజు పక్కింటి లక్ష్మి గారు ఒక ఉత్తరం తీసుకువచ్చి ''మీ కోసం ఏదో ఉత్తరం వచ్చింది... పోస్ట్‌మేన్‌ పొరపాటున మా ఇంట్లో వేసి వెళ్ళాడు'' అని నా చేతికి ఉత్తరం అందించింది. ఎక్కడి నుండా ఈ ఉత్తరం అని చూస్తే అది ఇటీవలే నేను ఒక పోటీకి కథని పంపిన పత్రిక నుండి. ఉత్తరం చింపి, చదవటం మొదలుపెట్టాను. అది నా కథను తిరిగి పంపిస్తూ ఆ పత్రిక సంపాదకుడు నాకు రాసిన ఉత్తరం. ''సునంద గారు, నా అనుమానం నిజం అయితే మీరు ఎస్వీ యూనివర్సిటీలో చదివిన సునంద గారే కదా? కొన్నేళ్ళ క్రితం మీ కథలు చదివాను. మీ శైలి నాకు బాగా నచ్చడంతో అలా మదిలో నిలిచిపోయింది మీ పేరు. మీరు వేరే సునంద అయితే క్షమించగలరు. ఇక విషయంలోకి వస్తే .. మీరు గత రెండు మూడు సార్లుగా మా పత్రికకు పంపిన కథలు చదివాను. మొదలు మరియు చివర్లలో ఎంతో అద్భుతంగా ఉన్నా.. మధ్యలో ఎక్కడో ఏదో లోపించినట్లుగా అనిపించేది.. ఒకటికి రెండుసార్లు తరచి చూస్తే అది మీ టైపింగ్‌లో లోపమా లేక మధ్యలో ఎక్కడో కొన్ని పంక్తులు పొరపాటున తప్పిపోయాయా అన్న అనుమానం కలిగింది. ఈసారి పంపిన కథలో సైతం అదే అనిపించింది. ఒకసారి గమనించగలరు. మీ రచనలను అభిమానించే వాడిగా మాత్రమే ఈ సలహా ఇస్తున్నాను. అన్యదా భావించవద్దు''.
ఆ ఉత్తరంతో పాటు తిరిగొచ్చిన నా కథను మళ్ళీ ఒకసారి చదవటం మొదలు పెట్టాను.. చదవటం పూర్తి చేయగానే నాకు తల మొద్దుబారిపోయింది. అది ఏదో టైపింగ్‌లో దొర్లిన తప్పుగా లేదు. చాలా జాగ్రత్తగా కథ చదివి, అందులో కథకి ఆత్మ, లాంటి వాక్యాలని చాలా జాగ్రత్తగా తీసేసినట్లు కనపడుతుంది. ఒకసారి వెళ్ళి ఇంతకుముందు వెనక్కి తిరిగి పంపబడ్డ నా కథలన్నింటినీ చదవటం మొదలుపెట్టాను. అన్నింటిలోనూ ఇదే పరిస్థితి అని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఆలోచిస్తుంటే మెల్లగా అర్థమవసాగింది. ఉద్యోగం కోసం నా తల్లిదండ్రుల దగ్గర మొహమాటం లేకుండా డబ్బు తీసుకుని లంచం కట్టి రవీంద్ర ఉద్యోగం సంపాదించినప్పుడు నేను అంతగా బాధపడలేదు. నన్ను ఉద్యోగం మానెయ్యమన్నప్పుడూ అంత లోతుగా ఆలోచించలేదు. ''నేను నీట్‌గా టైప్‌ చేయించి పోస్ట్‌ చేస్తాను'' అని నా కథలను తను తీసుకువెళ్తుంటే జరుగుతున్న మోసాన్ని గ్రహించలేదు. కథలు తిరిగి వచ్చినప్పుడు కూడా నాకు చూపించకుండా.. నన్ను సముదాయిస్తున్నట్టు నటించే తనని ఎప్పుడూ అనుమానించలేదు. ఇంటికి రాగానే రవీంద్రని నిలదీశాను. తాను చేసిన తప్పు బయటపడటంతో బుకాయించబోయాడు. ఇక నిజం చెప్పక తప్పదు అనుకున్నాక ''నువ్వు కథలు రాస్తూ ఉంటే దీప్తిని ఎవరు పెంచుతారు? అసలే మనం ఇంకొక బిడ్డ కోసం ప్లాన్‌ చేస్తున్నాం. ఇలాంటి సమయంలో నువ్వు బిజీగా వుంటే సంసారం సవ్యంగా సాగదు'' అని చెప్పి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. స్త్రీజనోద్ధరణ కోసం జన్మించిన వ్యక్తి ముసుగులో తాను రాసిన కథలు కళ్ళ ముందు మెదిలి వికటాట్టహాసం చేశాయి. ఒకప్పుడు శిఖరాయమానంగా కనిపించిన రవీంద్ర వ్యక్తిత్వం ఆ క్షణాన భార్యకి పేరు వస్తే తట్టుకోలేని ఒక మరగుజ్జు మనస్తత్వానికి సాక్ష్యంలా కనిపించింది.
కూతురిని దృష్టిలో పెట్టుకుని బాధ దిగమింగుకున్న నా మనసుని మరో సంఘటన మరింత కుంగదీసింది. నాన్న కాలం చేశాక వచ్చే అరా కొరా పెన్షన్‌ డబ్బులతో తన తల్లి ఎలాగో కాలం వెళ్ళదీస్తుంది. తల్లికి మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్‌ కోసం డబ్బులు తక్కువైన విషయం ఒకరోజు రవీంద్రకి అయిష్టంగానే చెప్పింది తను. ''అసలే మీ అమ్మ షుగర్‌ పేషంట్‌. వయసు పైబడ్డ మీ అమ్మకి ఆపరేషన్‌ ఫెయిల్‌ అయితే చాలా కష్టం. నా ఉద్దేశంలో మిగిలిన రోజులు ఇలా వెళ్ళదీయటం మంచిది అనిపిస్తుంది'' అని నా జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. నేను అచేతనంగా చూస్తూ నిలబడిపోయాను.
రోజులు గడుస్తున్న కొద్దీ రవీంద్రలో మానవత్వపు ఛాయలు మరుగున పడుతున్నాయే కానీ ఎటువంటి మార్పూ లేకపోవడంతో నా మీద నాకే అసహ్యం వెయ్యటం మొదలయ్యింది. ''ఎందుకు రవీంద్రా ఇలా మారావు? కాలేజీ రోజుల్లో నువ్వు రాసిన కథలన్నీ, చెప్పిన వేదాలన్నీ నీ మనసులో నుండి వచ్చినవి కావా?'' చివరికి ధైర్యం చేసి ఒకరోజు రవీంద్రని నిలదీశాను. ''కథల్లో రాసేవి పుస్తకాల్లో అచ్చు వెయ్యడానికి మాత్రమే పనికొస్తాయి. అయినా ఇప్పుడు మనకేమైంది సునందా? బాగానే ఉన్నాం కదా? సొంత ఇల్లు ఉంది, డబ్బులు కూడా బానే వస్తున్నాయి. నువ్వు, దీప్తి ఆనందంగా ఉన్నారు..'' ఇంకా ఏదో చెప్తున్న రవీంద్ర మాటలు మనసులోకి ఎక్కడం లేదు. అటు భర్త వద్ద గౌరవం లేక ఇటు ఆర్థిక స్వాతంత్య్రం లేక ఇలాగే ముందుకు సాగితే నేనొక జీవచ్ఛవంలా మారటం ఖాయం అనిపించింది.
మాట పట్టింపు అయితే మర్చిపోవచ్చు. అభిప్రాయ భేదాలు ఉంటే సర్దుకోవచ్చు. ప్రవర్తనలో లోపం ఉంటే సరిదిద్దొచ్చు. కానీ వ్యక్తిత్వంలో విలువలు నశించినప్పుడు కలిసి నడిచినా ప్రయోజనం లేదనిపించింది. తదనంతర పరిణామాలతో రవీంద్ర నుండి విడిపోయి దీప్తితో పాటు ఒంటరి జీవితం మొదలుపెట్టాను. నా అభిరుచికి తగ్గట్లు రచనలు చేస్తూ ''దీప్తి ప్రచురణ సంస్థ''ను ప్రారంభించి, నా కాళ్ళపై నేను నిలబడ్డాను.
******
''క్షమించండి అమ్మగారు'' అన్న నాంచారమ్మ మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను.
''మగోని కంటే ఎక్కువ సంపాదిస్తే సంసారం నిలవదు'' అన్న నాంచారమ్మ మాటలే చెవిలో పదే పదే వినిపిస్తున్నాయి.
''మీ ఆయన నీతో ప్రేమగా ఉంటాడా?'' ఆమె వైపే ఓరకంట చూస్తూ అడిగాను.
''మంచోడే అమ్మగారూ. ఎప్పుడన్నా ఒకసారి తాగి వచ్చినప్పుడు మాట్లాడకుండా నిద్రపోతాడు. మళ్ళీ తెల్లారితే మామూలే. నాకు ప్రతి పెద్ద పండుగకీ చీర తెస్తాడు. మా చంటిది అంటే చాలా ఇష్టం మా ఆయనకి. మా అత్తగారికి కూడా నేనంటే ఇష్టమే'' సిగ్గుపడుతూ చెప్పుకుంటూ పోతుంది.
''మరి ఏదన్నా టైపిస్టు ఉద్యోగం చేస్తా అని చెప్పకపోయావా మీ ఆయనకి? నీ ఇష్టమూ తీరుతుంది అలాగే డబ్బులూ ఎక్కువ వస్తాయి కదా'' అన్నాను.
నేను ఏదో తప్పు మాట్లాడిన దానిలా భయపడి ''వద్దు అమ్మగారు... మా అమ్మ ఏది చెప్పినా కరెక్టుగా ఉంటది. ఆమె ఎన్నో చూసింది కాబట్టే నాకు అలా చెప్పింది. నాకు ఇలానే బాగుంది'' మరో మాటకు తావులేదన్నట్లు ఉన్నాయి ఆమె మాటలు.
ఒక్క క్షణం ఆలోచించాను. నాంచారమ్మ అమాయకత్వంతో సంతోషంగా కాకపోయినా బాధ లేకుండా జీవిస్తుంది. అతని భర్తకి చెడు అలవాట్లు ఉన్నా.. చెడ్డ వ్యక్తిత్వం లేదు. నాంచారమ్మని తన ఆలోచన మార్చుకోమని సలహా ఇవ్వాలని అనిపించలేదు.
నాకు పేరు రావడం తట్టుకోలేని భర్త మీద తిరుగుబాటు చేసి, దీప్తికి తండ్రి ప్రేమను దూరం చేయడం నా తప్పా? లేక మరింత ఉన్నతంగా జీవించగల జ్ఞానం ఉండి కూడా కాపురం కోసం సర్దుకుపోయే నాంచారమ్మ గొప్పా? కొందరికి నేను చేసింది తొందరపాటులా అనిపించవచ్చు. కానీ ఇది కేవలం ఒక మనిషి వ్యథగా చూడకూడదు అని నా అభిప్రాయం. అనాదిగా అణచివేయబడుతున్న స్త్రీ జీవితపు పరిణామక్రమంలో నేను ఒక సామాన్యమైన అబలగా లొంగిపోకుండా నా ధిక్కార స్వరాన్ని వినిపించాను. తద్వారా ఆ పరిణామక్రమాన్ని మరింత మెరుగైన దిశగా ముందుకు తీసుకెళ్ళేందుకు చేయూత నిచ్చాన అని మాత్రమే భావించదలచాను.
అనంతంగా సాగిపోతున్న నా ఆలోచనలకి కళ్ళెం వేసి ఈ లోకంలోకి వస్తూ ''నాంచారమ్మ... రోజూ మీ ఆయన నిన్ను సైకిల్‌ మీద ఆఫీసులో దించుతాడు కదా.. రేపు వచ్చినప్పుడు ఒకసారి నన్ను కలవమని చెప్పు'' అన్నాను.
మరుసటి రోజు నేను వెళ్ళేసరికి నాంచారమ్మ తన భర్తతో పాటు ఎదురు చూస్తుంది నా కోసం. నన్ను చూడగానే ''అమ్మగారూ, మా ఆయన కోటేశ్వరయ్య'' అని తన భర్తని పరిచయం చేసింది. తైల సంస్కారం లేని తలతో ఎదురుగా వున్న అతన్ని చూసి ఇద్దరినీ కూర్చోమని సంజ్ఞ చేసింది. ''చూడు కోటేశ్వరయ్యా, మా సంస్థ తరఫున మీ అమ్మాయికి ఉచితంగా చదువు చెప్పించాలని అనుకుంటున్నాం. అందుకోసం మీ ఆవిడ ఇక్కడ చేసే పనితో పాటు టైపిస్టు పని కూడా చేయాల్సి ఉంటుంది. జీతం మాత్రం ఇప్పుడు ఇచ్చేంతే వస్తుంది. అది నీకు సమ్మతమేనా?'' అని అడిగాను. వాళ్ళు ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుని, మళ్ళీ నా వైపు ఆనందంగా చూశారు తమకి సమ్మతమే అన్నట్లు. ఇందులో మర్మాన్ని అర్థం చేసుకునే తెలివి తన భర్తకి లేకపోవడం నాంచారమ్మ అదృష్టమే. ''మిగిలిన విషయాలు తరువాత మాట్లాడతాను. ఈ విషయం గురించే నిన్ను పిలిచాను'' అని చెప్పగానే ''సరేనమ్మా'' అని కోటేశ్వరయ్య వెళ్ళిపోయాడు. నాంచారమ్మ వైపు తిరిగి ''అక్కడ కనిపిస్తున్న కొత్త కంప్యూటరు, కుర్చీ నీకోసం ఎదురుచూస్తున్నాయి..'' అన్న నా మాటలు పూర్తికాకుండానే నా కాళ్ళమీద పడ్డ ఆమెను పైకిలేపి హృదయానికి హత్తుకున్నాను. నాలాగే నాంచారమ్మకి కూడా తన భర్తని ఎదిరించి, స్వేచ్ఛా గీతాన్ని ఆలపించమని నేను చెప్పొచ్చు. కానీ అందరి బాధలకీ ఒకే మందు పనిచెయ్యదని నాకు తెలుసు. ఈ స్త్రీ-పురుష సమానత్వపు యుద్ధంలో అందరూ సైనికుల పాత్ర పోషించలేరు. అది అందరి వ్యక్తిత్వాలకీ సరిపడదని నా విశ్వాసం.

                                        - చెరుకూరి రాజశేఖర్ / వాట్సాప్ +1 (410)562-1874