Apr 22,2021 07:05

మట్టి మీద పుట్టిన మనిషి
మంటినే మరుస్తున్నడు!
మట్టే తన బతుకు ఉనికని
మరిచి పోతున్నడు

----
కాలుకు మట్టంటని బతుకు
బతుకుతున్నడు
వానికి మట్టి వాసనేమి తెలుసు!
మట్టి మహిమేమి తెలుసు!
----
వాసాలు లేని జనావాసాలు
నేటి మనిషి నివాసాలు
అగ్గి పెట్టెల ఆకాశహార్మ్యాల బతుకులు
పౌల్ట్రీ ఫారం జీవుల తలదన్ను!

----
గాస మెట్లా వస్తుందో
మేసే నోటికి తెలియదు!
మట్టి నడిగితే చెబుతుంది!
మట్టంటని మనిషికేమి తెలుసు?

----
మంటి మింటి నడుమల
ఒంటరి బాటసారికి
మట్టిలో కలిసి పోతున్నప్పుడు
మట్టి విలువ తెలుస్తున్నది

---
మట్టే బతుకని మట్టే మెతుకని
మట్టి లేక బతుకు వట్టిదని తెలిసి
మట్టికి మొక్కక వుండలేకపోతున్నడు
మనిషి మట్టి మనిషే!

- పి.బక్కారెడ్డి
సెల్‌: 97053 15250