
పెరటిలోని నిమ్మచెట్టు పక్కన నవ్వారు మంచం వేసుకుని కూర్చున్నారు వెంకట్రామయ్య. అరవై ఏళ్ళు మీద పడుతున్నా స్వయంగా పొలం పనులను పర్యవేక్షించడం ఆయన అలవాటు. రోజంతా పంట చేలో అలసిపోయిన ఆయనకు పక్కనే ఉన్న అరటిచెట్టు వీనలు వీస్తూంది. వెంకట్రామయ్య భార్య వైదేహి ఇంటి ఆవరణలో చిన్నసైజు తోటే పెంచుతోంది. ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన ప్రాంగణంలో కూరగాయల నుండి పూలమొక్కలు, చెట్లు కూడా పెంచుతుంది. ఆమె వాత్సల్యంలో ఆ మొక్కలు కళకళలాడుతుంటాయి. వెన్నెల విస్తరిస్తున్న సమయానికి పెరట్లో కూర్చొని రేడియో కార్యక్రమాలు వినడం వెంకట్రామయ్య అలవాటు. మీదున్న కండువా సరి చేసుకుంటూ, రేడియోలో వస్తున్న నాటకం వింటున్నారు. నాటకంలో సన్నివేశం భార్యాభర్తల మధ్య నడుస్తూంది. భర్త హెచ్చు స్వరంతో పరుషంగా మాట్లాడుతున్నాడు. మనసుకు కఠినంగా తోచడంతో రేడియో కట్టేశారు వెంకట్రామయ్య. అదే సమయంలో కొంత దూరం నుండి పెద్దగా అరుపులు, దీన స్వరంలో ఒక ఆడగొంతు వినిపించాయి. ఆ స్వరాలు తమ ఇంటికి రెండిళ్ల ఆవల నివసించే శంకరం, మల్లివి. అలాగే కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయారు వెంకట్రామయ్య.
ఆ ఊర్లో వెంకట్రామయ్య సలహా తీసుకోని గడప ఉండదు. మంచి, చెడు రెండింటికి ఆయనను సంప్రదిస్తారు. శంకర్ కుటుంబం కూడా వెంకటరామయ్య పెద్దరికాన్ని ఆమోదించిందే. తన కళ్ళ ముందు ఎదిగిన వాడే శంకరం. అతడు ఏ కోర్సు చదవాలి దగ్గర నుండి ఉద్యోగం, పెళ్లి అన్ని విషయాలు వెంకట్రామయ్య సూచనల మేరకే జరిగాయి. మల్లిది పక్క ఊరు కావడం.. శంకర్ కుటుంబం పట్టుబట్టడంతో, వాళ్ళతోబాటు పెళ్లి చూపులకు వెళ్లారు వెంకట్రామయ్య. తను దగ్గరుండి పెళ్లి చేయించిన దంపతులు ఈ పరిస్థితుల్లో ఉండడం అతని హృదయాన్ని కలచి వేస్తోంది. పెళ్లయిన కొత్తలో వాళ్లను చూసి ఆ కాలనీ వాళ్లంతా ముచ్చటైన జంట అనుకునేవాళ్ళు. శంకర్ చూపే అభిమానంతో మల్లి ఎప్పుడూ నవ్వుతూ.. విరిసిన సిరిమల్లెలా ఉండేది. పెళ్లయిన నెల నుంచే మల్లి ఎప్పుడు నెల తప్పుతుందా.. అని ఎదురుచూసేది శంకరం వాళ్ళ అమ్మ. వీధి కుళాయిల దగ్గర, కూరగాయల బండి దగ్గర శంకరం తల్లిని వాళ్లంతా 'నీ కోడలికి ఏదైనా విశేషమా?' అని అడిగేవాళ్ళు. ఆ అసహనం అంతా ఆమె మల్లి మీద చూపించడం మొదలుపెట్టింది.
పనిచేసే చోట సహోద్యోగులు, స్నేహితుల పరాచికాలు కూడా శంకర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాయి. నలుగురు టీ తాగి, 'పిల్లా.. పీచా.. డబ్బులు ఏం చేసుకుంటావురా?' అంటూ అతడి చేత ఖర్చు పెట్టించేవాళ్ళు. అలా శంకర్‌కు తాగుడు కూడా అలవాటైంది. మల్లి ఏదైనా మాట్లాడితే 'నువ్వు గొడ్రాలివైనందుకే నాకిన్ని బాధలు' అంటూ ఈసడించు కోవటం, నెపం ఆమె మీదికి నెట్టెయ్యడమూ శంకర్‌కు అలవాటైంది. కాలం గడిచేకొద్దీ మల్లి ముఖంలో నవ్వు మాయమైంది. యాంత్రికంగా పనులు చేసుకుపోతోంది. ఎవరితోనూ మనసువిప్పి మాట్లాడటం లేదు. అప్పుడప్పుడూ వైదేహి దగ్గరకు వచ్చి, ఆమెకు పనిలో సాయం చేసి వెళ్ళేది. వెంకట్రామయ్య సలహా మీద శంకర్, మల్లి డాక్టర్ను కూడా సంప్రదించారు. ఆమె అన్ని పరీక్షలూ చేసి, ఏ లోపమూ లేదని, కొంతకాలం వేచి చూడమని సలహా ఇచ్చింది. క్రమంగా మల్లి పట్ల నిర్లక్ష్యం ఎక్కువైంది శంకర్‌కు. చుట్టుపక్కల వాళ్ళ మాటలకి అతను తేలికగా లొంగిపోయాడు. తాగుడు కూడా అతడు విచక్షణను కోల్పోవడానికి కారణమైంది. ఒకటి రెండుసార్లు వెంకట్రామయ్య జోక్యం చేసుకొని శంకర్‌ని మందలించడానికి చూశారు. కానీ తాను పెద్దరికాన్ని పోగొట్టుకోవడం తప్ప లాభం లేదని గ్రహించారు.
×××
వెంకట్రామయ్య దీర్ఘాలోచనలో పడటం వంటింటి కిటికీ నుండి వైదేహి గమనించింది. శంకరం మల్లిల స్వరాలు ఆమె కూడా వింది. కాఫీ కలుపుకుని వెంకట్రామయ్య వద్దకు వచ్చింది. భర్తకు కాఫీ కప్పు అందిస్తూ 'ఏం ఫరవాలేదు. మీ మాట శంకరం వింటాడు. అయితే ఇనుము వేడి మీద ఉండగానే కదా దెబ్బ పడాలి. సమయం రావాలి అంతే. మనం ఉన్నాం కదా.. చూస్తూ అలా వాళ్లను వదిలేస్తామా?' అంది. నిజమే అన్నట్లు తలూపారు వెంకట్రామయ్య.
అలవాటు ప్రకారం తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు వెంకట్రామయ్య. ముంగిట్లోకి వచ్చిన ఆయనకు తన మనవరాలు కనబడింది. తన చిట్టి చేతులతో ఒక పూల కుండీలో మట్టి నింపుతోంది.
'ఏం చేస్తున్నావ్ చిట్టి తల్లి?' ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి అడిగారు.
'పూలమొక్క నాటుతున్నా తాతయ్యా!' కళ్ళు పెద్దవి చేసి చెప్పింది.
'ఎందుకనో?' అడిగారు.
'మా టీచర్ చెప్పారు తాతయ్య... మన భూమి అంతా వేడెక్కిపోయి ఉంది అట. కొన్ని సంవత్సరాలకు భగభగ మండిపోతుందట. అలాకాకుండా ఉండాలంటే మొక్కలు నాటాలట!' చేతులు తిప్పుతూ చెప్తోంది చిట్టితల్లి.
'ఎందుకట?'
'ఎందుకంటే .. మొక్కలు మనకు ఆక్సిజన్ అనే మంచిగాలిని ఇస్తాయట. గాలిలో ఉండే చెడును తగ్గిస్తాయట. మంచి వర్షాలు రావడానికి సహాయం చేస్తాయట.'
'నిజమేనా?' అనుమానం నటిస్తూ అన్నారాయన.
'ఒట్టు తాతయ్యా! మా టీచర్ చెప్పారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కో మొక్కను నాటాలని. నేను నిన్న సాయంత్రమే అమ్మకు చెప్పి, తెప్పించుకున్నాను. మా ఫ్రెండ్స్ చిన్ని, పింకీ ఉన్నారు కదా! మేము అనుకున్నాం... బంతిపూల మొక్కలు నాటాలని'.
'చాలా మంచిది. చక్కటి పూలమొక్క.. నాటమ్మా! ఇదిగో అంత మట్టి వేయకు. మధ్యలో కొంచెం ఖాళీ ఉంచు. మొక్కని ఉంచాలి కదా! నాటేశావా? మెల్లగా నీళ్ళు పొయ్యి... ఆకులపై కూడా..' దగ్గరుండి మరీ మొక్క నాటించారాయన. చిట్టితల్లి నవ్వుల్ని ఆనందంగా చూసుకుంటూ..
కనబడితే ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అన్నట్లు.. గబగబా ఇంటి ముందు నుంచి శంకర్ వెళ్లిపోవడం ఆయన దృష్టిని దాటిపోలేదు. పెద్దగా నిశ్వసిస్తూ ఇంటిలోపలికి వెళ్ళారాయన.
ఓ వారం రోజుల తర్వాత అరుగుమీద దిగాలుగా కూర్చొన్న చిట్టితల్లిని గమనించారు వెంకట్రామయ్య. కంగారుగా దగ్గరికి వెళ్లి 'ఏమైంది చిట్టితల్లి?' అంటూ అనునయంగా అడుగుతుంటే.. అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉన్న దుఃఖం ఆయన పలకరింపుతో ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చింది.
భయపడిపోయారు వెంకట్రా మయ్య. తన పక్కన కూర్చొని, భుజం చుట్టూ చేయి వేసి, లేత బుగ్గలపై జారుతున్న కన్నీటిని తుడిచారు. 'ఏమైంది మా చిట్టితల్లికి? ఎవరు ఇంత కోపం తెప్పించారు? అమ్మానాన్నాగానీ తిట్టారా?'
'లేదన్నట్లు' తల అడ్డంగా ఊపింది.
'స్కూల్లో ఎవరన్నా ఏమన్నా అన్నారా?' మిన్నకుండి పోయింది చిట్టితల్లి.
'స్కూలుకి వెళ్లి నిన్నెందుకు బాధపెట్టారో అడిగేస్తాను పద!' అన్నారాయన.
'లేదు తాతయ్యా.. మనం మొక్క నాటాం కదా! పింకీ మొక్కేమో తెల్లటి రెండు పూలను పూసింది. చిన్ని మొక్కకేమో.. ఒక పచ్చపూవు పూసింది. మరి అన్ను మొక్కకేమో మూడు పింక్ పూలు పూచాయి. నా మొక్క పూలివ్వలేదు తాతయ్యా!' అంటూ మళ్లీ బావురుమంది.
'అవునా.. నీ మొక్కకు పూలు పూ యలేదా?' చిట్టితల్లి సమస్య తెలిసాక మనసు స్థిమితపడినా.. ఆ అమ్మాయి ఆదుర్దా గమనించి, నటిస్తూ అడిగారాయన.
'అవును తాతయ్యా.. నీళ్ళు పోశాను.. ఎరువేశాను.. నా మొక్కెందుకు పూలు పూయదు తాతయ్యా?' ఆవేదనతో అడిగింది చిట్టితల్లి.
అదే సమయంలో శంకర్ వెంకట్రామయ్య ఇంటికి వచ్చాడు. అతనికి వెంకట్రామయ్య వైపు చూసే ధైర్యం లేదు. తప్పు చేస్తున్నాననీ అతనికి తెలుసు. ఇంటా బయట తన కంటే ఎక్కువగా భరిస్తున్నది తన భార్య అనీ తెలుసు. అందుకే అతడికి మొహం చెల్లడం లేదు. ఒకవైపు నిలుచుని వెంకట్రామయ్య ఉండే వైపు పక్కచూపు చూస్తూ, 'నమస్కారం అయ్యా!' అన్నాడు. వెంకట్రామయ్య సాలోచనగా అతడి వైపు చూశారు.
'చిన్న పని ఉండి వచ్చాను' అంటూ ఇంటి లోపలికి తొంగి చూస్తూ, 'అమ్మగారూ..!' అని పిలిచాడు శంకర్.
'వస్తున్నా' అంటూ గుమ్మం వద్దకు వచ్చింది వైదేహి.
'మల్లికి జ్వరంగా ఉంది. నోరు బాలేదంటాన్ది. కొంచెం చింతకాయ పచ్చడి పెట్టమ్మా!' అడిగాడు శంకరం.
'అయ్యో... డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా?' అడిగింది వైదేహి.
'ముక్కితే, మూల్గితే డాక్టర్ కాడికి యాడ తీసుకెళ్ళేదీ? అదే తగ్గిపోద్ది. పైగా నాకు డ్యూటీ టైం అయితాంది.. తగ్గిపోద్దిలేమ్మా!'
శంకర్ పెడసరం సమాధానానికి వైదేహికి సర్రున కోపం వచ్చింది. అయితే ఇది సమయం కాదని మౌనంగా లోపలికి నడిచింది, 'జాడి, అటక మీద ఉంది. దింపి తీసుకొస్తా.. ఐదు నిమిషాలు ఆగు' అంటూ.
వెంకట్రామయ్య శంకర్ ఉనికిని పట్టించుకోనట్లుగా చిట్టితల్లితో మాట్లాడసాగాడు.
'నీ కంటే ఎక్కువగా ఆ మొక్కకే పూలివ్వాలని ఉంటుంది చిట్టితల్లి.. మొగ్గలు వేసి, పూలు పూసి, కాయ కాసి, విత్తనమై.. మహావృక్షమై నిలవాలని ఉంటుంది. కాకపోతే ముందూ వెనుకా.. అంతే!' చిట్టితల్లికి అర్థం కాకపోయినా జాగ్రత్తగా వింటోంది. ఓ పక్కగా నిలబడి శంకరం కూడా వింటున్నాడు.
'పోనీ పూలు పూయడం లేదు కదా! నీళ్లు పోయడం ఆపేద్దామా? లేక మొక్క పీకేసి వేరే మొక్క నాటుదామా?'
'ఛీ .. ఇంత మంచిమొక్క ఎలా పీకుతాం తాతయ్యా? పూలు లేకపోతే ఏం? అది నా మొక్క. దాని ఆకులు చూడు ఆకుపచ్చగా మెరుస్తూ.. ఎంత అందంగా ఉన్నాయో!'
'మరి నీ స్నేహితురాళ్లు నీ మొక్క పూలు పూయడం లేదని నవ్వితే?'
'ఒక్కటిచ్చుకుంటాను. నా మొక్క.. దాన్ని చూసి నవ్వుతారేం?!'
ఆ మాటలకు పెద్దగా నవ్వేశారు వెంకట్రామయ్య. చిట్టితల్లీ ఆయన నవ్వుతో శృతి కలిపింది.
తేటబడ్డ ఆ పాప ముఖాన్ని చూస్తూ 'ఇదిగో ఇలా ఉండాలి చిట్టితల్లి అంటే.. ఇలారా.. నీ మొక్క దగ్గరికి వెళ్దాం. ఎందుకు నా చిట్టితల్లి మొక్క పూలు పూయడం లేదో అడుగుదాం. ఏమైందట..? మట్టి బాగో లేదా? నీళ్లు సరిపోలేదా?' అంటూ.. ఆ అమ్మాయి చేయి పట్టుకొని మొక్కవైపు నడిచారు ఆయన.
ఒకవైపుగా ఉన్న శంకర్ వాళ్ళ సంభాషణ అంతా వింటున్నాడు. శంకర్‌కు వాళ్ల ప్రవర్తన విపరీతంగా అనిపిస్తోంది.
'వీళ్లేంది మొక్క గురించి ఇంతసేపు ఆలోచన చేస్తాండారు! ఆ పిల్లేమందీ.. తన మొక్కను చూసి నవ్వితే కొడ్తదా! నేను పక్కనోళ్ళు నవ్వారనే కదా మల్లిని కొట్టింది. అయినా నేను ఎందుకు మల్లిని కొట్టాలి? ఆ పిల్ల పూల్లేకపోతే ఏం? అంటోంది. మల్లికి బిడ్డలు లేకపోతే ఏం? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా.. నేను మా అయ్యకు చేసిందేంది? ఇట్లాంటి కొడుకుల కోసం నేను మల్లిని ఎందుకు కొట్టాలి?'..
''శంకరం...జాడీ అందటం లేదు!'' అంటూ వైదేహి వంటింటి నుండి కేక వేయడంతో.. ఆలోచనల నుండి బయటకు వచ్చి, వంటింటి వైపు నడిచాడు శంకర్. లోనికి వెళ్ళిన శంకర్ స్టూల్ ఎక్కి, పచ్చడి జాడీని దింపి, వైదేహికి అందించాడు. జాడీని కప్పి ఉంచిన తెల్లటి బట్టను నిదానంగా విప్పుతూ మాట్లాడసాగింది వైదేహి.
'శంకరా! నాకు పెళ్లయిన పదేళ్లకు మా అబ్బాయి పుట్టాడు. ఈ పది సంవత్సరాలు బంధువులు, చుట్టుపక్కల వాళ్ల ఎత్తిపొడుపు మాటలకు కృంగిపోయేదాన్ని. ఆయనతో చెప్పుకొని ఏడ్చేదాన్ని. నాకు మానసికంగా ఎంతో అండగా నిలబడ్డారు ఆయన. ఓరోజు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను' తలవంచుకుని వింటున్నవాడల్లా.. చివ్వున తలెత్తి చూశాడు శంకరం.
'కృంగిపోయిన నాకు తల్లి, తండ్రి, అన్న అన్నీ ఆయనే అయ్యారు. నాకు అండగా నిలబడ్డారు. ఆయన అలా నాకు ఆసరా అవబట్టే ఇవాళ నీ ముందున్నాను ఇద్దరు పిల్లలతో!' ఒక్క క్షణం ఆగి శంకర్ మొహంలో సూటిగా చూస్తూ అంది వైదేహి. 'శంకరా! మల్లి భరిస్తోంది కాబట్టి నీ హింసలు సాగుతున్నాయి.. ఎవరికీ చెప్పుకోలేక మూగదైపోయింది. ఆలోచించి చూడరా.. నువ్వు నీ భార్యకు ఇపుడే అండగా ఉండాలి. కానీ నీకు అర్హత ఉందా? కాపాడాల్సిన నీవే పొడుచుకు తింటున్నావే! నీ మీద ఆధారపడ్డదను కున్నావేమో! నువ్వు పడేసే నాలుగు మెతుకులు ఆమెకు దొరక్కపోవు. నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా పరిణామం ఏంటో ఆలోచించు. ఇప్పటి ఈ సమాజం నిన్ను ఎలా వేపుకు తింటుందో ఊహించు!' ఏమాలోచించిందో వైదేహి స్వరంలో పెరిగిన తీవ్రతను నెమ్మదిగా తగ్గించుకుని, అనునయంగా మాట్లాడసాగింది. 'ప్రేమించే మనసు దొరకడమే అపురూపం. అది వదులుకోకురా! ప్రేమను పంచే భార్యను వదిలి ఎందుకురా బిడ్డల కోసం ఆరాటం? శంకరా! ఇది నీకు బిడ్డ మీద ప్రేమ కాదు.. నలుగురు నాలుగు మాటలు అంటున్నారన్న ఉక్రోషం' పచ్చడి డబ్బాను, శంకరం చేతికి అందిస్తూ 'వెళ్ళు నీ భార్యకు అన్నం తినిపించు.. మనిషివి అనిపించుకో!'.
ఎప్పుడూ మార్దవంగా 'నాయనా శంకరం!' అని పిలిచే ఆమె ఇప్పుడు ఇంత తీవ్రంగా హెచ్చరిస్తూంటే అన్నపూర్ణ అపరకాళిగా నిల్చున్నట్లనిపించి, చేష్టలుడిగిపోయాడు శంకరం. వంగిపోయిన భుజాలతో ఆమె అందించిన డబ్బా తీసుకొని, అక్కడి నుంచి కదిలాడు.
పెరట్లో వెంకట్రామయ్య, చిట్టితల్లుల మాటలు వినబడుతున్నాయి.
'ఇదిగో చిట్టితల్లి.. ఈ ఆకు మీద మట్టి ఉంది చూడు. ఆ నీళ్లతో తుడువు. నీళ్ళు చెంబుతో అలా గుమ్మరించకు. నెమ్మదిగా నీళ్ళు చిలకరించు!' అంటూ సూచనలు చేస్తున్నాడు వెంకట్రామయ్య.
'తాతయ్యా! ఇదిగో ఈ ఆకు చూడు. దీని రంగు భలేగా ఉంది!' ఒక ఆకుని రెండు చేతుల మధ్య నెమ్మదిగా పొడువుకొని, సుతారంగా చుంబించింది చిట్టితల్లి. కన్నీరు అడ్డుబడుతూంటే చూపు సరిగా ఆనక కళ్ళు చికిలిస్తూ, చిట్టితల్లి వైపు చూస్తున్నాడు శంకరం.
'వాళ్లేమో మొక్కను వ్యక్తిలా చూస్తున్నారు. తానేమో తన భార్యను ఏ భావాలు లేని ఒక మానులా చూస్తున్నాడు' అనుకుంటూ చేతిలో పచ్చడి డబ్బాను జాగ్రత్తగా సరిచూసుకుంటూ ముందుకు నడిచాడు శంకరం.
ఈతకోట సుబ్బారావు
ఎస్‌విఎం నాగగాయత్రి
94405 29785