Mar 21,2022 07:52

ఉదయం 9 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో విమానం ఆగింది.
శ్రీధర్‌, అపర్ణ, వాళ్ల మూడేళ్ల పిల్ల శ్రీవిద్య దిగారు. అరగంట తరువాత సామాన్లతో బయటపడ్డారు.
బయట టాక్సీ వాళ్ల కోసం ఎదురు చూస్తోంది.
నలభై గంటల నుంచి గాల్లోనే ప్రయాణించడం వల్ల శ్రీధర్‌కి చిరాగ్గా ఉంది. నిన్న మధ్యాహ్నం అమెరికా నుంచి బయలుదేరి, ఇప్పుడు విశాఖ చేరుకున్నారు.
కొద్దిసేపటికి కారు విజయనగరం బయలుదేరింది.
'ఏవండోరు! మీ నాన్నగారిని చూడగానే జావగారిపోతారు.. మీవన్నీ బయట ప్రగల్భాలే.. తండ్రి ముందు మాట పెగల్దు.. ఈసారి గట్టిగా అడగండి లేకపోతే పెద్దాయన పైసా విదల్చడు' అంది.
'తెలుసు అపర్ణా.. ఎన్నిసార్లు చెబుతావు.. అందరు కొడుకులూ తండ్రితో అలాగే ఉంటారు. తండ్రి దగ్గర భయభక్తులు లేకపోతే ఎలా?' అన్నాడు.
శ్రీధర్‌ తండ్రి సుబ్బారావు. 35 ఏళ్ల పాటు సొంత ఊళ్లోని హైస్కూల్లో పనిచేసి, ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసి విజయనగరంలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. భార్య రాజ్యలక్ష్మి.. అతనికి శ్రీధర్‌, సులోచన ఇద్దరు పిల్లలు - శ్రీధర్‌ నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లి చదువు పూర్తవ్వగానే ఉద్యోగం రావటంతో అక్కడే స్థిరపడిపోయాడు. తరువాత అక్కడ స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన అపర్ణని పెళ్లి చేసుకున్నాడు. కూతురు సులోచన హైదరాబాద్‌లో ఉంటోంది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తుడు..
పల్లెలో అతనికి ఇల్లు, పొలం ఉన్నా పట్నంలో ఉంటే వైద్య సదుపాయాలు ఉంటాయనీ విజయనగరంలో ఇల్లు కట్టుకున్నాడు..
వారం రోజుల క్రితం కొడుకు శ్రీధర్‌ కుటుంబంతో వస్తున్నాననీ ఫోన్లో చెప్పాడు. అప్పట్నుంచీ రాజ్యలక్ష్మి కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తోంది..
కొడుకు వెళ్లిపోయి నాలుగేళ్లైంది. కనీసం పెళ్లికి కూడా పిలవలేదు.. మనవరాలు పుట్టినా కోడల్ని చూడని దౌర్భాగ్యం..
అమెరికా వెళ్లి కొడుకుని చూద్దామనీ ఎన్నిసార్లు చెప్పినా సుబ్బారావు ఆమె మాట వినలేదు. 'తల్లి తండ్రులను చూడాలనుకుంటే వాడే వస్తాడు. వాడికి లేనిది మనకెందుకు' అని భార్యకు చెప్పాడు.
గంట తరువాత శ్రీధర్‌ కుటుంబం విజయనగరంలోని ఇంటికి చేరుకుంది.
కొడుకుని, కోడల్ని ముఖ్యంగా మనవరాలిని చూడగానే రాజ్యలక్ష్మికి చాలా ఆనందం కలిగింది.
మనవరాల్ని ఎత్తుకొని, ముద్దులతో ముంచెత్తింది. మనవరాలి స్పర్శ ఆమెలోని నాన్నమ్మను మేల్కొలిపింది.
'ఏరా! ఇప్పటికి నీకు వీలు కలిగిందా?' అని అడిగాడు సుబ్బారావు కొడుకుని..
అతనికి కొడుకు మీద చాలా కోపంగా ఉంది. తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా 20 లక్షలు అప్పు చేసి, కొడుకుని అమెరికా పంపాడు. ముందు అమెరికా వెళ్లొద్దు, ఇక్కడే చదవమని చెబితే శ్రీధర్‌ వినలేదు. నానా గొడవా చేశాడు. నాలుగురోజులు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయి ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌ చేశాడు. రాజ్యలక్ష్మి భయంతో యాగీ చెయ్యడంతో చివరకు కొంత పొలం అమ్మి ఆ డబ్బుని ఇష్టం లేకపోయినా కొడుక్కి ఇచ్చాడు.
అలా వెళ్లిపోయినవాడు ఇన్నాళ్లకి మళ్లీ వచ్చాడు. ఈలోగా తాను మంచి సంబంధం చూసినా వినకుండా అక్కడి పిల్లనే తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. పోనీ మనవరాలు పుట్టిన తరువాతైనా తమని చూడటానికి రాలేదు.. అందుకే అంత కోపంగా ఉన్నాడు. అయితే ఆ కోపం కొద్దిసేపే... ఆ తరువాత శాంతించాడు.
ఎలాగైతేనేం ఇన్నాళ్లకి వచ్చిన కొడుకు కుటుంబాన్ని చూసి, లోలోపల సంతోషించాడు సుబ్బారావు.
మనవరాలిని ఎత్తుకొని ముద్దాడేడు. కొడుకు ఇక్కడే చదివి ఉద్యోగం చేస్తే అతని దగ్గరే మనవలతో ఆడుకుంటూ జీవితాన్ని గడిపెయ్యాలనీ ఎన్నో కలలు కన్నాడు. కానీ వాటిని కల్లలు చేస్తూ వాడు నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడు. ఉద్యోగ విరమణ తరువాత అందునా వానప్రస్థంలో పిల్లలకి దూరంగా బతుకుని వెళ్లదీయడం ఎంతో బాధాకరమైన స్థితి.. తన తల్లిదండ్రుల్ని వాళ్లు కన్నుమూసే దాకా తన దగ్గరే ఉంచుకొని సేవలు చేశాడు సుబ్బారావు.. కానీ తనకా అదృష్టం లేనందుకు బాధపడసాగేడు సుబ్బారావు.
ఆ రాత్రి భోజనాల దగ్గర శ్రీధర్‌ తను వచ్చిన విషయాన్ని చెప్పాడు.
'నాన్నగారూ! అమెరికాలో నేనుంటున్న ప్రాంతంలో అద్దెలు బాగా ఎక్కువ. జీతంలో సగం అద్దెకీ, దాని నిర్వహణకే పోతోంది. అందుకనీ ఓ ఇల్లు కొందామనీ అనుకుంటున్నాను. అందుకు మీ సహాయం కావాలి. మొన్న మీ ఉద్యోగ విరమణ తరువాత మీకు కోటి రూపాయలు దాకా డబ్బు వచ్చి ఉంటుంది. అందులో కొంత నాకిస్తే మరికొంత లోను పెట్టి, కొంటాను. ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చాను' అన్నాడు శ్రీధర్‌.
'ఇన్నాళ్ల తరువాత వస్తే తల్లిదండ్రుల్ని చూడటానికి, నీ భార్యనీ, పిల్లనీ మాకు చూపించేందుకు వచ్చావనీ అనుకున్నాను. కానీ నువ్వు వచ్చింది అందుకు కాదన్నమాట. కేవలం డబ్బు కోసమే అయితే ఇంత దూరం ఎందుకురా రావడం.. ఒక్క ఫోన్‌ చేస్తే సరిపోయేది కదా?' అన్నాడు సుబ్బారావు కోపంగా.
'శ్రీధర్‌! భోజనాలప్పుడు ఆ విషయాలెందుకురా? తరవాత మాట్లాడుకోవచ్చు.. ముందు భోజనం చెయ్యండి..' అంది రాజ్యలక్ష్మి.
'నాన్నగారూ! మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని చూడటానికే వచ్చాము. ఎలాగూ వచ్చాం కాబట్టి ఈ విషయం కదిపాను' అన్నాడు శ్రీధర్‌.
'అయినా నీ ఇంటి కోసం డబ్బులిస్తే మేమెలారా బతకాలి? న్యాయంగా అయితే తల్లితండ్రుల బాధ్యత కొడుకు తీసుకోవాలి. అదెలాగూ లేదు పైగా నాకొచ్చిన డబ్బుని అడుగుతున్నావు. నాకు ప్రభుత్వం శేషజీవితాన్ని ఏ సమస్యలూ లేకుండా బతకమనే ఆ డబ్బు ఇచ్చింది. ఇన్నాళ్లూ బోలెడు జీతం వచ్చేది. రెండు నెలల నుంచీ ఆగిపోయింది కదా.. ఈ ఇంటి మీద అప్పు తీర్చాను. మిగతా దాంట్లో నీకిస్తే మాకు చాలా ఇబ్బందవుతుంది.. ఆలోచించు' అన్నాడు సుబ్బారావు.
'అయితే నేను ఇల్లు కొనుక్కోవాలనీ మీకు లేదా? కొడుకు ఎదగాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు.. కానీ మీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి.. మీకే బాధ్యతా లేనట్లు మాట్లాడుతున్నారు?' అన్నాడు లేస్తూ.
'నేను ఏ బాధ్యతా వహించకుండానే నువ్వింత వాడివయ్యావా? నేను డబ్బు పెట్టకుండానే అమెరికా వెళ్లి ఇంత వాడివయ్యావా చెప్పు? నువ్వు ఎంతసేపూ నీవైపు నుంచే మాట్లాడుతున్నావు. మా వైపు నుంచి కూడా ఆలోచించు.. నువ్వొక్కడివే కాదు నీకో చెల్లెలున్న విషయాన్ని మరిచిపోకు.. నీ బాధ్యత గురించి ఆలోచించకుండా నా బాధ్యత గురించి మాట్లాడుతున్నావు.. ఇది సహేతుకమా ఆలోచించు?' అన్నాడు తనూ లేస్తూ సుబ్బారావు.
'అంతేలెండి... మీకు నేనంటే ఎప్పుడూ కోపమే.. అయినా మీరా డబ్బుని మీక్కావలసిన వాళ్లకిచ్చేశారనీ నాకు తెలిసింది. కానీ నేను నమ్మలేదు.. ఇప్పుడు మీ మాటల వల్ల అది నిజం అని తేలింది. ఊరు వారిపాటి కూడా నేను చెయ్యనా? తండ్రిగా ఆ వచ్చిన డబ్బుని ఏం చేశారో చెప్పే బాధ్యత మీకు లేదా? అందరూ మీలాగే చేస్తున్నారా చెప్పండి?' అన్నాడు ఆవేశంగా.
'ఓహో! ఇవన్నీ అందరితోనూ మాట్లాడే వచ్చావన్న మాట. మన కుటుంబ విషయాలను ఇతరులతో చర్చించటం తప్పు కాదా? నీకేదైనా అనుమానం ఉంటే నన్ను అడగాలి.. ఊరివాళ్లను అడిగితే మరిన్ని తగువులు పెడతారు తప్పా, నిజాలు చెబుతారా? ఇలాంటి పనులు ఎందుకు చేశావు?' అన్నాడు కోపంగా సుబ్బారావు.
'మీరు ఊరివాళ్లకీ, మీక్కావలసిన వాళ్లకీ డబ్బిచ్చారా లేదా అన్నదే ప్రశ్న.. ఎవరి ద్వారా తెలిస్తే ఏమిటి? కొడుకు కన్నా వాళ్లే ఎక్కువయ్యారు మీకు. పోనీ మంచిదే.. మీ డబ్బు మీ ఇష్టం.. కొడుకు ఎలా పోతే మీకేం.. సరే.. అలాగే ఉండండి' అంటూ విసవిసా తన గదిలోకి వెళ్లిపోయాడు.
కొద్ది క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం.. ఫ్యాను గాలి తప్పా ఏమీ వినిపించనంతటి నిశ్శబ్దం.

                                                                               ***

ఉదయాన్నే డైనింగ్‌ టేబుల్‌ దగ్గర టిఫిన్‌ తింటున్నాడు సుబ్బారావు..
'శ్రీధర్‌ని పిలువు' అన్నాడు..
'వాడింకా లేవలేదు... కోడలూ, పిల్లా లేచారు.. అయినా వాడున్న రెండురోజులూ గొడవలెందుకు.. ఆ డబ్బేదో వాడికిస్తే వాడేదో ఇల్లు కొనుక్కుంటాడు.. ఆ మిగిలిందే మనది..' అంది రాజ్యలక్ష్మి.
ఇంతలో శ్రీధర్‌ బయటకొచ్చి 'మేము రేపు వెళ్లిపోతున్నాం..' అన్నాడు కోపంగా.
సుబ్బారావు అతనివైపు చూస్తూ 'నీ నిర్ణయం అదే అయితే సరే.. తల్లిదండ్రులకీ పిల్లలకీ మధ్య డబ్బొక్కటే సంబంధమైతే అలాగే వెళ్లు. కానీ ఇప్పుడు కారు వస్తోంది నాతో రా.. మన ఊరు వెళదాం.. నీకు కొన్ని విషయాలు తెలియాలి' అన్నాడు. శ్రీధర్‌ అతనివైపు ఆశ్చర్యంగా చూశాడ..
గంట తరువాత తండ్రీ కొడుకులిద్దరూ బయలుదేరారు..
విజయనగరానికి ఆ ఊరు రెండు గంటల ప్రయాణం. అది కొండ చాటున, ఏటి పక్కన ఉండే చిన్నపల్లె. వాళ్లు చేరుకొనేసరికి మధ్యాహ్నం పన్నెండైంది.
వాళ్లను చూడగానే రైతు సత్యం వచ్చి, ఇంటి తాళం తీశాడు. అతని కుటుంబమే వాళ్ల పొలాలను తరతరాల నుంచి పండిస్తూ వస్తున్నారు. కష్టం వచ్చినా సుఖమొచ్చినా అన్నింటికీ అండగా ఉంటుంది ఆ కుటుంబం.. అతనికి ఇద్దరు కొడుకులు.. ముగ్గురు కూతుళ్లు..
ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిన్నారిద్దరూ..
'మామా వాళ్ల కుటుంబం లేదా? ఊళ్లో చాలా ఇళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి' అని అడిగాడు శ్రీధర్‌.
'పల్లెలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. వ్యవసాయాన్ని మీ తరం వాళ్లు ఇష్టపడటం లేదు. అందరూ పనుల కోసం పట్నాలు వెళ్లిపోతున్నారు' అన్నాడు.
భోజనాల తరువాత సుబ్బారావు కొడుకుని సత్యం ఇంటికి తీసికెళ్లాడు.
ఒక ఇరుకైన వీధిలో చిన్న పాకలో ఉంటోంది సత్యం కుటుంబం..
అసలు అక్కడికి చేరుకోవడానికే ఎంతో ఇబ్బంది పడ్డాడు శ్రీధర్‌..
అసలు వాళ్లు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారో అనిపించింది.
చుట్టూ పశువుల పాకలతో కుళ్లు నీళ్లతో దుర్గంధం కొడుతోంది.
ఇంటి ముందర చెట్టు కింద ఒక కుర్రవాడు మంచం మీద పడుకొని ఉన్నాడు. అతనికి కాళ్లు లేవు.
అతన్ని చూడగానే శ్రీధర్‌కి ఎక్కడో చూసినట్లు అనిపించింది.. వాళ్లని చూడగానే సత్యం పరుగున వచ్చి వరండాలో మంచం వేశాడు.. కొద్దిసేపు అతని కుటుంబ సభ్యులతో సుబ్బారావు మాట్లాడాడు. ఆ తరువాత అతనికి కొంత డబ్బిచ్చి, ఇంటికి తిరిగొచ్చారు.
'ఆ మంచం మీద కాళ్లు లేకుండా పడుకున్నవాడు సత్యం పెద్దకొడుకు ప్రకాశం. 'నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు మోటార్‌ సైకిల్‌ నేర్చుకుంటూ వాడిని గుద్దేశావు. అదృష్టవశాత్తూ వాడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు నుజ్జు నుజ్జు కావడంతో రెండింటినీ తీసివేశారు.. పోలీసులకి తెలిసి కేసు పెడతామంటే సత్యం తన కొడుకుదే తప్పని వాంగ్మూలం ఇచ్చి, నిన్ను కాపాడాడు. లేకపోతే నువ్వు అమెరికా వెళ్లే పరిస్థితి ఉండేదికాదు.. జైలుకి వెళ్లేవాడివి. నీకు ఆ విషయాలన్నీ తెలిస్తే నీ చదువు పాడవుతుందనీ అప్పట్లో చెప్పలేదు. నీ అమెరికా చదువు కోసం పదిహేను లక్షలు అవసరం పడి పొలాన్ని సర్పంచ్‌కి అమ్మేస్తే దాన్నే నమ్ముకున్న సత్యం కుటుంబం వీధిన పడింది. నిజానికి మనకి ఆ కుటుంబం ఎంతో సేవ చేసింది . ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే అప్పట్నుంచీ నెలనెలా వాళ్లకి సహాయం చేస్తున్నాను. ఈ మధ్యనే వాళ్లు రెండెకరాల పొలం కొనుక్కున్నారు' అన్నాడు కొడుకుతో..
మరో గంట తరువాత వాళ్లు అక్కడి నుంచి బయలుదేరి దార్లో బొబ్బిలిలో ఆగారు. కారు ఒక వృద్ధాశ్రమం ముందు ఆగడంతో శ్రీధర్‌ ఆశ్చర్యపోయాడు.
తండ్రితోపాటు అతను కూడా లోనికి వెళ్లాడు. అక్కడ తన మేనమామనీ, చిన్నాన్ననీ చూసి ఆశ్చర్యపోయాడు.
మేనమామ తనకి చిన్నప్పుడు చదువు చెప్పేవాడు. చిన్నాన్న కుటుంబం తమింటి పక్కనే ఉండేది. మేనమామ పిల్లలు, చిన్నాన్న పిల్లలతో కలిసి అతను చదువుకున్నాడు.
వాళ్లు తనని చూడగానే కళ్లనీళ్లు పెట్టుకున్నారు.
'నా కర్మరా శ్రీధర్‌... పిల్లలు వాళ్లదారి వాళ్లు చూసుకున్నారు. రెండేళ్ల క్రితం మీ అత్త వెళ్లిపోయింది. మీ నాన్నే లేకపోతే నేనెప్పుడో పోయేవాడిని.. అప్పట్నుంచీ మీ నాన్నే ఇక్కడ చేర్పించి, నాకు డబ్బులు కడుతూ నా బాగోగులు చూస్తున్నాడు' అన్నాడు చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ..
చిన్నాన్న శ్రీధర్‌ రెండు చేతులూ పట్టుకొని 'బాగున్నావురా నాయనా.. మీ నాన్న పుణ్యమే మిమ్మల్ని కాపాడుతోంది. నా పిల్లలు స్వార్థపరులు.. ఇద్దరినీ ఎంతో కష్టపడి, నా డబ్బంతా ఊడ్చిపెట్టి చదివించాను. కానీ వాళ్లు మమ్మల్ని చూడటం మానేశారు. అలాంటి మమ్మల్ని మీ నాన్నే ఆదుకున్నాడు. ఆయనే డబ్బు పంపిస్తున్నాడు. మీ పిన్ని మంచం పట్టి సంవత్సరం క్రితం చనిపోయింది. అప్పట్నుంచీ నన్ను ఇందులో చేర్పించాడు నాన్న..' వృద్ధాప్యంలో తల్లితండ్రులను చూడనివాళ్లు బాగుపడిరా... మట్టికొట్టుకుపోతారు... ఇది శాపం కాదు వాస్తవం... జరిగి తీరుతుంది' అన్నాడు ఏడుస్తూ...
శ్రీధర్‌కి ఏం మాట్లాడాలో తోచలేదు.
అరగంట తరువాత అక్కడి నుంచి బయలుదేరారు..
విజయనగరం వచ్చేదాకా ఇద్దరూ మాట్లాడుకోలేదు..

                                                                              ***

రెండు రోజుల తరువాత ఒకరోజు శ్రీధర్‌ తండ్రితో 'నాన్నగారూ... మేము ఎల్లుండి బయలుదేరతాము. వీలైతే మీరు కూడా రండి.. మీరొస్తానంటే వీసా ఏర్పాట్లు చేస్తాను. అవసరం అయితే పదిరోజులు సెలవు పొడిగిస్తాను. ఇక ఇల్లుకొనే ఆలోచన కొన్నేళ్లు వాయిదా వేస్తాను' అన్నాడు శ్రీధర్‌.
'ఈ వయసులో మేము అమెరికా రాలేము. ఇన్నాళ్లూ ఈ గడ్డ మీద పెరిగి, చరమాంకంలో అక్కడ గడపటం కష్టం. ఏదో ఇక్కడే జీవితాలు ముగించేస్తాం.. వీలున్నప్పుడల్లా మీరు వస్తూ ఉంటే మాకదే ఆనందం. నిన్న నీ అకౌంట్‌లో ముప్పై లక్షలు డిపాజిట్‌ చేశాను. ఇల్లు కొనడం ఆపొద్దు. ఇల్లు ప్రతివాళ్లకీ అవసరం. అందులో అమెరికాలో మరీనూ...' అన్నాడు. ఆ మర్నాడు శ్రీధర్‌ కుటుంబంతో బయలుదేరాడు.
'మనిషన్నవాడు చెట్టులా బతకాలి. చెట్లు అవి బతుకుతూ ఇతరులకు ఎంతో సహాయం చేస్తాయి. తన కోసమే కాక ఇతరుల కోసం బతికేవాడే నిజమైన మనిషి..' బయలుదేరే ముందు తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చీ శ్రీధర్‌ కళ్లు చెమ్మగిల్లాయి.

గన్నవరపు నరసింహమూర్తి
9441753974