ప్రజాశక్తి - పల్నాడు జిల్లా: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటనను మరిపించేందుకు బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లును తెరమీదకు తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు తాంతియా కుమారి అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పల్నాడు జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ అధ్యక్షత వహించారు. తాంతియా కుమారి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందన్నారు. బిజెపి చెబుతున్న మహిళ బిల్లు వెనుక ఎన్నో కుట్రలున్నాయని, బిజెపి తన పాలలోని వైఫల్యాలను, మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. మహిళ బిల్లులో ప్రధాన అంశాలు ఏమి ప్రస్తావించకుండా బిల్లు ఎలా ప్రవేశపెడతారని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు ఎంత రిజర్వేషన్ కేటాయించారో చెప్పాలని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు బిజెపి పెద్దలకు కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, యువతకు ఉపాధి, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, సామాజిక పెన్షన్ రూ.4 వేలు ఇస్తామని, చేయూత కింద మహిళలకు ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని, ఉచిత ప్రయాణం తదితర వాగ్దానాలను రాహుల్ గాంధీ ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు. కాంగ్రెస్ పునాదులపై వైసిపి పుట్టిందని, అయితే బిజెపితో అంటకాగుతున్నందుకు ఆ పార్టీ సిగ్గుబడాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని, షర్మిల నాయకత్వాన్ని అధిష్టానం ఆమోదిస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కరీమూన్, విజయలక్ష్మీ, భారతి, కుమారి, రాధాకృష్ణ, యలమందారెడ్డి, చంద్రపాల్, ఎస్.కృష్ణ, రవికిషోర్, ఎస్.శ్రీను, నాగేంద్ర, నాగంజనేయులు, రాములురెడ్డి పాల్గొన్నారు. తొలుత అలెగ్జాండర్ సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ను కట్ చేశారు.










