Jul 28,2023 20:25

మదనపల్లె : నిరసన తెలుపుతున్న నాయకులు

మదనపల్లె అర్బన్‌ : మూడు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న ఘోరమైన దారుణాలకు అక్కడి ప్రభుత్వమే కారణమని, కావున వెంటనే మణిపూర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని, అక్కడ శాంతిని నెలకొల్పాలని విడుదలై చిరుతైగల్‌ కట్చి (విసికె పార్టీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట విసికె పార్టీ, బాస్‌ సంయుక్తంగా ఆందోళన చేపట్టాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్‌ కొండల్లో నిక్షిప్తమై వున్న విలువైన లోహాలు, ఖనిజాలు కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకే మంటలు రాజే శారని చెప్పారు. కార్యక్రమంలో విసికె పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముత్యాల మోహన్‌, బాస్‌ కేంద్ర కమిటీ ప్రతినిధులు పోతబోలు రెడ్డెప్ప, బురుజు లక్ష్మీనారాయణ లతోపాటు వీసీకే మరియు బాస్‌ నాయకులు గిన్నెల మనోహర్‌ రెడ్డి, రాయల్‌ సూర్య తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకిపురం : మణిపూర్‌లో శాంతిని ప్రసాదించాలని జామియా మసీదు వద్ద శుక్రవారం ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. జుమా నమాజ్‌ అనంతరం ముస్లింలు మసీదు వెలుపల నిలబడి మణిపూర్‌లో నెలకొన్న అశాంతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మాటలలో కూడా చెప్పలేని విధంగా అక్కడి మహిళలపై జరిగిన దాష్టీకాలు, క్రౌర్య చర్యలు మానవత్వాన్ని మంట గలిపాయని, రెండు జాతుల మధ్య నెలకొన్న గొడవలు సమాజంలో మారణ కాండను ప్రేరేపించడం శోచనీయమని పేర్కొన్నారు. మే 4న జరిగిన ఒక సంఘటనకు యావత్తు సమాజం కుమిలిపోయిందని, కించబడి పోయిందని, క్రోధంతో రగిలిపోయిందని, ఈ సంఘటన మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌, ఉపముతవల్లి జవాద్‌ హుస్సేన్‌ సాహెబ్‌, మండల కో-ఆప్షన్స్‌ సభ్యుడు మహబూబ్‌ బాషా, మైనారిటీ నాయకులు, పాల్గొన్నారు.