Aug 02,2023 22:53

  • ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు
  • వాయిస్‌ ఆఫ్‌ యూత్‌ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

ప్రజాశక్తి-విజయవాడ: మణిపూర్‌లో శాంతి భద్రతలను కాపాడాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ బుధవారం బిఆర్‌టిఎస్‌ రోడ్డులోని మధురానగర్‌ జంక్షను నుండి ఫుట్‌ జంక్షన్‌ వరకు వాయిస్‌ ఆఫ్‌ యూత్‌ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఇతర ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ మణిపూర్‌లో మూడు మాసాలుగా జరుగుతున్న మారణకాండను నివారించడంలో కేంద్రం-రాష్ట్రంలోని బిజెపి డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రెండు తెగల మధ్య శాంతిని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే కదిలి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఘర్షణలను నివారించడంలో ఘోరంగా విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్షణమే బర్త్‌రఫ్‌ చేయాలని కోరారు. అక్కడ ప్రజల హక్కులు ఉల్లంఘించబడ్డాయని, శాంతి భద్రతలను పరిరక్షించకపోతే సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తోందని చెప్పడాన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. ఈ ఘర్షణలలో అనేక మంది మరణించారని, పదులు సంఖ్యలో మహిళలు అత్యాచారానికి గురయ్యారని, వందల సంఖ్యలో గృహాలు కాలి బూడిద అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కె.శ్రీదేవి మాట్లాడుతూ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించటమేనా దేశభక్తి అని బిజెపి ప్రశ్నించారు. మహిళలపై అత్యంత హేయంగా దాడులు చేస్తూ, వారిని అన్ని విధాలుగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ మణిపూర్‌ ఘటనలను నివారించడంలో ఘోరంగా విఫలమయిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా అందరూ ఏకమైన మణిపూర్‌ ఘటనలను నివారించి, శాంతిని నెలకొల్పేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మతాల, తెగల మధ్య చిచ్చు పెట్టి, దానిలో రాజకీయలబ్ది పొందాలని మతోన్మాద బిజెప ిచూస్తుందని, దీనిని ప్రతి పౌరుడు తిప్పికొట్టాల్సి ఉందని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ మాట్లాడుతూ కులం,మతం పేరుతో గిరిజనులపై దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అద్యక్షులు కె సరోజ, నాయకులు ఝాన్సీ, షకీల, ఆషా, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం సోమేశ్వరరావు, సిహెచ్‌ వెంకటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌కె నిజామ్‌ తదితరులు పాల్గొన్నారు.