Aug 04,2023 00:41

గుంటూరులో కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు

ప్రజాశక్తి-గుంటూరు : మణిపూర్‌లో శాంతి భద్రతలను కాపాడాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం శంకర్‌ విలాస్‌ వద్ద క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌ మాట్లాడుతూ మణిపూర్‌ ఘటన దేశంలోని ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. దాదాపు 80 రోజులపాటు జరిగిన హింసకాండ గురించి పార్లమెంటు సైతం చర్చించకపోవడం సిగ్గుచేటన్నారు. దీనికి ప్రధాన మంత్రి బాధ్యత వహించాలని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, మణిపూర్‌ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఆటలో ఆ రాష్ట్ర ప్రజలు, మహిళలు విద్యార్థులు బలిపశువులయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా మణిపూర్‌లో శాంతి భద్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, ఎస్‌.కె.సమీర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు యశ్వంత్‌, భరత్‌, విద్యార్థినులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడికొండ : మణిపూర్‌లో నరమేధం ప్రపంచమంతా తెలిసినా ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి నాయకులకు చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని పిసిసి ప్రధాన కార్యదర్శి చిలకా విజరుకుమార్‌ అన్నారు తాడికొండలో సినిమా హాల్‌ సెంటర్‌ నుండి ట్యూబ్‌లైట్‌ సెంటర్‌ వరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా విజరుకుమార్‌ మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ ఏకతాటి మీదకు వచ్చి ఈ నరమేధాన్ని ఖండించాలన్నారు. పార్లమెంటులో సమాధానం చెప్పలేని మోడీ మన్‌ కి బాత్‌ అంటూ షో చేస్తూ ఉంటారని ఎద్దేవ చేశారు. బిజెపి పతనానికి మణిపూర్‌ నుంచే బీజం పడిందన్నారు. గుజరాత్‌లో బిజెపి చేసిన అల్లర్ల వల్ల లబ్ధి పొందినట్టు 2024 ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలని ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కుట్ర పన్నిందని, వీటిని ప్రజలు జాగ్రత్తగా గమనించాలని కోరారు. కార్యక్రమంలో తాడికొండ మండల అధ్యక్షులు షేక్‌ లియాకత్‌ అలీ, మండల మాజీ అధ్యక్షులు ఎ.శ్రీనివాస్‌, గ్రామ అధ్యక్షులు షేక్‌ రహంతుల్లా, ఎ.సూర్యనారాయణ, షేక్‌ అబ్దుల్‌ అలీ, షేక్‌ రహిమ, షేక్‌ ఆరిఫ్‌, రమేష్‌కుమార్‌, షేక్‌ నాగుల్‌, ఎ.ఆనందరావు పాల్గొన్నారు
తాడేపల్లిలో నేడు ర్యాలీ
మణిపూర్‌లో మారణహోమానికి నిరసనగా క్రైస్తవ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముగ్గు రోడ్డులోని చర్చి నుండి నెహ్రు బొమ్మ సెంటర్‌ వరకు ర్యాలీ ఉంటుందని, అందరూ పాల్గొనాలని కోరారు.