ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : మణిపూర్‌లో మహిళలకు రక్షణ కరువైందని ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్.రాజు అన్నారు. మణిపూర్‌లో ఘటనలకు బాధ్యులను శిక్షించాలని, శాంతిని నెలకొల్పాలని శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యంత హేయమైనవన్నారు. మూడు నెలలుగా అక్కడ ఘర్షణలు జరగుతున్నా, వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. మణిపూర్‌లో ఆదివాసీ మహిళపై దాడి జరిగిన మరుసటి రోజే డేరాబాబా, బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు బెయిల్ ఇచ్చి ఊరట కల్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. నిత్యం దేశభక్తి జపం చేస్తున్న బిజెపి ప్రభుత్వం, మహిళలపై జరుగుతున్న దాడులపై మాట్లాడడం లేదని విమర్శించారు. ప్రపంచ దేశాలు మణిపూర్ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా, బిజెపి మహిళా ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నగర కన్వీనర్ శ్రీదేవి పాణిగ్రహి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్, నాయకులు ఎం.లలిత, స్వర్ణ, స్వాతి, పావని, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ
మణిపూర్‌లో మారణకాండను అరికట్టాలని, మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరుతూ ఎపి మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యాన మున్సిపల్ కార్మికులు నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం మాట్లాడుతూ 80 రోజులుగా విధ్వంసాలు, మారణకాండతో మణిపూర్ ప్రజలు భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. మహిళలను నగంగా ఊరేగించి లైంగికంగా దాడి చేసి కొట్టి చంపిన దుండగులను శిక్షించడంలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. కుకీ తెగకు చెందిన మహిళలను నగంగా ఊరేగించడంతో పాటు వారి కుటుంబాలను హతమారుస్తున్నా చలనం లేకపోవడం దారుణమన్నారు. మణిపూర్ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత ఘర్షణలు, దళితులపై, మైనార్టీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరిగాయన్నారు. కార్యక్రమంలో ఎ.గణేష్, ఎ.శంకర్, డి.గణేష్, ఎ.లక్ష్మి, ఇ.గంగ, ఎ.ఆదమ్మ తదితరులు పాల్గొన్నారు.










