Jul 30,2023 21:55

ప్రజాశక్తి - ఉండి
             మణిపూర్‌ మారణహోమానికి కారకులను కఠినంగా శిక్షించాలని సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఉండి గోరింతోట ప్రాంతంలో మణిపూర్‌ మారణహోమంపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ధనికొండ శ్రీని వాస్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై అకృత్యా లు అత్యంత దారుణమన్నారు. శాంతిభద్రతల పరిరక్ష ణలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమ ర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి బీరేన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ ఘటనపై ప్రపంచ దేశాలు సైతం స్పందిస్తున్నా మన రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన స్పందించకపోవడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో అన్నవరం, రామకూరి వెంకటరత్నం, మునకాల రాజు, కొల్లి రత్నకుమారి, మేడిది రత్నకుమారి, బొడ్డు మేరీ తదితరులు పాల్గొన్నారు.
కాళ్ల: మణిపూర్‌లో శాంతిభద్రతలు పరిరక్షించి, మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని రాష్ట్ర క్రిస్టియన్‌ సెల్‌ మైనారిటీ అధ్యక్షులు మేడిది జాన్సన్‌ అన్నారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులకు నిరసనగా జక్కరం నుంచి కాళ్ల పోలీస్‌ స్టేషన్‌ వరకు కాళ్ల మండల క్రిస్టియన్‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. జక్కరంలో మేడిది జాన్సన్‌ శాంతి కపోతాలను ఎగురవేశారు. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని పలు సంఘాలు డిమాండ్‌ చేశాయి. కాళ్లలో పలు ప్రాంతాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో లూధరన్‌ సంఘాలు, మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌, ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌, సిబిసిఎన్‌సి, సిఎస్‌ఐ, పెంతుకోస్తు తదితర క్రైస్తవ సంఘాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమానికి చిలకపాటి సుందర్‌, దొండపాటి రవిచంద్రన్‌, జిడి.కరుణాకర్‌, గుర్రం బెన్హర్‌, అశోక్‌, సత్యం, శేఖర్‌, ఆర్‌ఎస్‌.రాజు, ఎం.ఇజ్రాయిల్‌, సిరింగి బాల నేతృత్వం వహించారు. ర్యాలీ అనంతరం కాళ్ల ఎస్‌ఐ ఎజిఎస్‌.మూర్తికి వినతిపత్రం అందజేశారు.
పాలకోడేరు: విస్సాకోడేరు దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మణిపూర్‌ హింసకాండను నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెన్నాడ అగ్రహారం చినపేట నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 216 జాతీయ రహదారి గుండా గొరగనమూడి, విస్సాకోడేరు మీదుగా గోపీకృష్ణ థియేటర్‌ వరకు సాగింది. ఈ ర్యాలీలో పాస్టర్లు, దళిత క్రైస్తవులు, క్రైస్తవ సోదరులు, మహిళలు వందలాదిమంది పాల్గొని మణిపూర్‌ ఘటనకు కారకులను శిక్షించాలని, మోడీ గద్దె దిగాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత ముఖ్య నేతలు దుండి అశోక్‌బాబు, పొన్నమండ బాలకృష్ణ మాట్లాడుతూ మణిపూర్‌ మారణహోమం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనకు కారణమైన బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు.