Jul 31,2023 20:28

ర్యాలీ నిర్వహిస్తున్న క్రైస్తవులు

ప్రజాశక్తి - ఆదోని
మణిపూర్‌ రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులను అరికట్టాలని ఆదోని క్రైస్తవ ఐక్యవేదిక పాస్టర్లు ఆనంద్‌ రాజు, బెనర్జీ రాజు, రెవరెండ్‌ పాస్టర్‌ భాస్కర్‌ బాబు, రెవరెండ్‌ డేనియల్‌ ప్రేమ్‌ కుమార్‌, ఫాదర్‌ కోలా విజయరాజు, ఎంఎస్‌.రావు, ఎజ్రా శ్రీధర్‌, జోసెఫ్‌ విక్లీఫ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆదోనిలో క్రైస్తవులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీ నాయకులతో కలిసి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్తబస్టాండ్‌ రహదారిలోని ఆర్‌సిఎం చర్చి నుంచి జాతీయ జెండాలు చేత పట్టుకొని మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలంటూ 160 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. అక్కడి నుంచి వైఎంజి సర్కిల్‌, భీమాస్‌ సర్కిల్‌ మీదుగా రైల్వే స్టేషన్‌ రోడ్డు నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతదేశం మహిళలను గౌరవించే దేశమని, కొందరు మతోన్మాదులు మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన గిరిజన మహిళలపై అత్యాచారం చేసి నగంగా ఊరేగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వేల చర్చిలను తగులబెట్టి, ఇళ్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 రోజులుగా అక్కడ మారణహోమాన్ని తలపిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వ ప్రోద్బలంతోనే అక్కడ గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. వెంటనే బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అక్కడ శాంతిని నెలకొల్పి వారికి భద్రత కల్పించాలని కోరారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వైసిపి నాయకులు జయమనోజ్‌ రెడ్డి, చంద్రకాంత్‌ రెడ్డి, సన్నీ, రఘునాథ్‌ రెడ్డి, ఈరన్న, టిడిపి నాయకులు అయ్యన్న, మల్లికార్జున, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దేవిశెట్టి ప్రకాష్‌, సిపిఐ నాయకులు అజరు బాబు, వీరేష్‌, సిపిఎం నాయకులు లక్ష్మన్న, లింగన్న, గోపాల్‌, వీరారెడ్డి, జనసేన నాయకులు తాహెర్‌ వలీ, మైనార్టీ నాయకులు నూర్‌ అహ్మద్‌, బీఎస్పీ నాయకులు శాంత కుమార్‌, బిఆర్‌ఎస్‌ నాయకులు ఫయాజ్‌, డేవిడ్‌, రాయనగర్‌ రమేష్‌, కపటి డేవిడ్‌ మరి కొంతమంది క్రైస్తవుల ర్యాలీకి మద్దతు తెలిపారు. నాయకులు సునీల్‌ రాజ్‌ కుమార్‌, అమల్‌నాథ్‌, సుధాకర్‌, లూర్థయ, థామస్‌, చెన్నయ్య, పాస్టర్లు ఆశీర్వాదం, నీలాంబరం, శాంతన్న, బర్న బాస్‌, నీలాంబరం, తిమోతి, మహిళ నాయకులు సుజ్ఞానమ్మ, శ్రీలక్ష్మి, శివమ్మ, సంగటి విజయకుమారి, వెంకటమ్మ పాల్గొన్నారు.