ప్రజాశక్తి-అరకులోయరూరల్:మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై ఆర్‌ఎస్‌ఎస్, బిజేపి జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర ఏజెన్సీ ప్రాంత బంద్‌కు పిలుపునకు ఆలోచిస్తున్నట్లు ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లోత రామారావు, కిల్లో సురేంద్ర తెలిపారు. ఈ సంద్భంగా వారు శనివారం అరకువేలి ఆదివాసి గిరిజన సంఘం కార్యాల యంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 27న విశాఖలో జరిగిన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ బంద్‌కు మద్దతు ఇచ్చే ఆదివాసీ గిరిజన ప్రజా సంఘలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.మణిపూర్ ఆదివాసీ ప్రాంతంలో 6వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, గ్రామసభ రద్దు చేసి అత్యంత విలువైన ఖనిజ సంపద, మైనింగ్‌ను బడా కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న అపారమైన సహజ వనరులు పెట్టుబడి దారులకు అప్ప జెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అటవీ పర్యావరణ సంరక్షణ చట్టం సవరణ బిల్లును ఆమోదించిందని, దీంతో గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ఆదివాసీలకు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బోయ/వాల్మికిలను గిరిజన జాబితాలో చేర్చి రాష్ట్రంలో ఆదివాసీ తెగల మద్య చిచ్చు పెట్టి మరో మణిపూర్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చూస్తున్నాయన్నారు. వైసీపీ, టీడీపిలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఆదివాసి గిరిజనులకు తీవ్ర ద్రోహం చేస్తున్నామని, దీన్ని ఆదివాసీ గిరిజన సంఘం తిప్పికొడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి పి రామన్న పాల్గోన్నారు.










