Jul 26,2023 21:47

సాలూరులో నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి - సాలూరు : మణిపూర్‌ జరుగుతున్న హింసా కాండను, అక్కడ మహిళలపై జరిగే దాడులను వెంటనే ఆపాలని సాలూరు రూరల్‌ అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఐసిడిఎస్‌ రూరల్‌ కార్యక్రమంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం గల ఈశాన్య భారతదేశంలో ఎప్పుడూ చూడని విధంగా నేడు మత పరమైన విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడి ప్రజలు మధ్య కులాలు, మతాలు, తెగలుగా విడదీసి అమాయకులైన ప్రజల మాన, ప్రాణ భయంతో బ్రతుకుతున్నారని అన్నారు. ఇటువంటి నీచమైన పనులను చేస్తున్న వారిని కాపాడుతున్న ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని, అక్కడ మహిళలపై దాడులను ఆపి, మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు ఆరిక నారాయణమ్మ, పార్వతి, ఉత్తరమ్మ, జానకి, సుభద్ర, ఇందిరా,రాజమ్మ, శాంతి పాల్గొన్నారు.
సీతానగరం :మణిపూర్‌ దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వర డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతోన్మాద శక్తులు గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టి మత ఘర్షణలు రేపుతున్నాయని విమర్శించారు. మహిళలపై అత్యాచారం, హత్య చేసిన దోషులను శిక్షించాలని, ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జి వెంకటరమణ, వి.ఈశ్వరరావు, గౌరి తదితరులు పాల్గొన్నారు.