Jul 31,2023 22:16

ప్రజాశక్తి - ముదినేపల్లి
        మణిపూర్‌లో మారణ హోమానికి నిరసనగా ముదినేపల్లిలో పాస్టర్లు సోమవారం శాంతిర్యాలీ నిర్వహించారు. మండల పాస్టర్స్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకూ పాస్టర్లు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ క్రైస్తవులపై జరిగే దాడులను తిప్పి కొట్టేందుకు పాస్టర్లు ఐక్యంగా ఉండాలన్నారు. రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు శేవా నాగజగన్‌బాబూరావు మాట్లాడుతూ మణిపూర్‌లో క్రైస్తవులను దారుణంగా చంపడం, ఆడపిల్లలను నగంగా ఊరేగించడం, అత్యాచారాలు చేయడం, చర్చిలను తగలపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోర రాష్ట్ర నాయకులు ఏసుపోగు దానియేలు, పాస్టర్లు సుధాకర్‌, క్రైస్తవులు పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌ : మణిపూర్‌లో అరాచకాలపై క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైసిపి క్రిస్టియన్‌ మైనారిటీ అధ్యక్షులు పిల్లా చరణ్‌ మాట్లాడుతూ విచక్షణారహితంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను సమైక్యంగా ఖండించాలన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిని అందించారు.
ఉంగుటూరు : మణిపూర్‌లో క్రైస్తవులపై మారణకాండకు సంఘీభావంగా ఆలిండియా క్రిష్టియన్‌ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా క్రిష్టియన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షలు బిషప్‌ ఎం.డేవిడ్‌లివింగ్‌ స్టన్‌, సిడబ్ల్యూసి మండల అధ్యక్షులు రెవ టి.కోర్ణేలు, నాయకులు రెవ.ఎం.సాల్మన్‌, మండల ప్రెసిడెంట్‌ బిషప్‌ విజయకుమార్‌, రెవ.డి.రాజు, ఉంగుటూరు, నిడమర్రు, బీమడోలు మండలాల పాస్టర్లు, విశ్వాసకులు పాల్గొన్నారు.