- రాష్ట్రపతి పాలనకు 'అరసం' డిమాండ్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: మణిపూర్ సంక్షోభం అకస్మాత్తుగా తలెత్తింది కాదని, అక్కడి ఖనిజ సంపద దోపిడీకి కార్పొరేట్‌శక్తుల కోసం రూపొందించిన ముందస్తు కుట్ర అని కవులు, రచయితలు, కళాకారులు, పలు సాంస్కృతిక, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు అధ్యక్షతన నగరంలోని క్రాంతి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశం మణిపూర్ సంక్షోభాన్ని ముందస్తు కుట్రగా పేర్కొంది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ అక్కడి ఆదివాసీ తెగలను విభజించి, పాలించే ప్రక్రియకు బ్రిటిష్ వారు బీజాలు వేశారని చెప్పారు. అందమైన ఆ ప్రాంతానికి చాలా కాలం రాష్ట్ర హోదా రాలేదని, స్వతంత్ర భారత ప్రభుత్వాలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడి తెగల మధ్య చిచ్చు పెడుతున్నాయని విమర్శించారు. ఆ రాష్ట్రంలో అమూల్యమైన ఖనిజ సంపద ఉందని, కార్పొరేట్‌శక్తులకు దాన్ని కట్టబెట్టడానికి తాజా సంక్షోభాన్ని సృష్టించారని చెప్పారు. దీని వెనుక బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ కీలకపాత్ర పోషిస్తోందని విమర్శించారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి మాట్లాడుతూ అటవీ భూములు, ఖనిజ సంపద గల పర్వతాలను ఆక్రమించడానికి ఈ సంక్షోభం సృష్టి వెనుక కారణమన్నారు. మెజారిటీ తెగ మొయితీలకు యుద్ధంలో వాడే ఆయుధాలను ప్రభుత్వమే సరఫరా చేస్తోందని చెప్పారు. ఈ కుట్రకు మతం ముసుగు వేసి, ప్రశ్నించే వారిపై కేంద్ర ప్రభుత్వ అనుకూల శక్తులు ఎదురుదాడి చేస్తున్నాయన్నారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాసు మాట్లాడుతూ మణిపూర్ సంక్షోభంలో మహిళలు, పిల్లలే తొలి బాధితులు కావడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతటి పెను సంక్షోభం ఏనాడు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై కేసులు, దాడులు, నాన్ బెయిలబుల్ అరెస్టులతో కేంద్రం వేధిస్తోందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మిస్కా కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లో సల్వాజుడుం సంస్థలా మణిపూర్‌లో కొన్ని తీవ్రవాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం రహస్య అవగాహన చేసుకుందని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కె.వి జగన్నాథరావు విమర్శించారు. సోషల్ మీడియాలో పౌర స్పందన తగినంత స్థాయిలో లేదని డిటిఎఫ్ అధ్యక్షులు కోత ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంఫ్‌ు పరివార శక్తులు వాస్తవాలను వక్రీకరిస్తూ, ఇంటర్నెట్‌ను గుప్పెట్లో పెట్టుకుని లౌకిక విలువలను ధ్వంసం చేస్తోందన్నారు. సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రాంగోపాల్, జిల్లా అధ్యక్షులు డి గణేష్, ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి సనపల నరసింహులు, జర్నలిస్టు సంఘం నాయకులు ఎం.ఈశ్వరరావు మాట్లాడారు. పత్తి సుమతి, తంగి ఎర్రమ్మ, కంచారాన భుజంగరావు, చింతాడ తిరుమలరావు, బొడ్డేపల్లి భూపతిరావు, కలమట దాసుబాబు మణిపూర్ పరిణామాలపై కవితలను చదివి వినిపించారు. సమావేశంలో సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.వి మల్లేశ్వరరావు, ఇస్కఫ్ జిల్లా కార్యదర్శి జి.వి నాగభూషణ్, విశాలాంధ్ర బుకహేౌస్ మేనేజర్ రవి, కుటుంబ సంక్షేమ, హక్కుల సంఘం కన్వీనర్ ఎం.కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.










