Jul 25,2023 21:36

పార్వతీపురంలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - గరుగుబిల్లి : మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యాన గురుగుబిల్లిలో మంళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వై.మన్మధరావు, వి.ఇందిర, బివి రమణ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మణిపూర్‌ ఘటనేనని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మెజారిటీ మైతీ, మైనార్టీ కుకీల మధ్య బిజెపి కులఘర్షణలకు పురిగొల్పిందని విమర్శించారు. మతాన్ని, కులాన్ని రాజకీయాలకు వినియోగించుకొనే నీచపు సంస్కృతి బిజెపి వల్లే పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌ లో జరుగుతున్న మారణ హౌమాన్ని ఆపేందుకు కేంద్రం, రాష్ట్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మణిపూర్‌ సంఘటనను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎం.సావిత్రి, స్వాతి, కృష్ణవేణి, మాలతి, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : మణిపూర్‌లో కుకి తెగకు చెందిన గిరిజన మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేసి ఒక మహిళను చంపిన వారిని వెంటనే శిక్షించాలని, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి హింసకు కారణం కాబట్టి వెంటనే మణిపూర్‌ సిఎం బీరెన్‌ సింగ్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలంలో టేఖరఖండిలో గిరిజనులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు రాము మాట్లాడుతూ బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులకు, గిరిజనులకు, ముస్లిం, క్రిస్టియన్లకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మణిపూర్‌లో హింసను కేంద్ర ప్రభుత్వం ఆపాలని, మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయుకులు మురళి, రాజు , తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: మణిపూర్‌లో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు కోరారు. పట్టణంలోని గాంధీనగర్‌లో మణిపూర్‌లో మారణహౌమానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యాన సోమవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాట్లాడుతూ గడిచిన మూడు నెలలుగా మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెచ్చరిల్లిపోతున్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. రాష్ట్రంలోని కుకీ,మైతీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని చెప్పారు. మూడు నెలలుగా జరుగుతున్న మారణహౌమాన్ని అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన స్థానిక సిఎం, కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్లమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్వైనాయుడు, పట్టణ నాయకులు టి.రవి, టి.ఇందు, టి.శంకరరావు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ :మణిపుర్లో మహిళలపై అత్యాచారాలు చేసి, హత్యలను చేయడాన్ని ఖండిస్తూ యుటిఎఫ్‌ జిల్లా శాఖ ఆద్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు మాట్లాడుతూ అదికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటనలు జరిగాయన్నారు. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని అను కుంటున్నారన్నారు. జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రధాని ఈ విషయమై మౌనం వహించడమంటే అత్యాచారాలను ప్రోత్సహించడమేనని అన్నారు. జిల్లా: సహధ్యక్షులు వి.జ్యోతి మాట్లాడుతూ ఈ ఆచారాలు దేహంపై జరిగే అత్యాచారాలు కావని, దేశం మీద జరిగేవని అన్నారు. ఈ సంఘటనలను దేశం యావత్తు ఖండించాలని అన్నారు. ఈ ర్యాలీ స్థానిక డిఇఒ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి మురళి, జిల్లా కార్యదర్శులు భాస్కరరావు, శ్రీనివాసరావు, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.