Jul 27,2023 21:14

మణిపూర్‌' సిఎంను బర్తరఫ్‌ చేయాలి- ప్రజా సంఘాల ధర్నాలో నాయకులు

మదనపల్లె అర్బన్‌ : మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అమానుష అత్యాచారాలను ఖండిస్తూ ఐద్వా, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం మొదలగు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా గురువారం మదనపల్లె పట్టణం లో ఆందోళనలు చేపట్టారు. మోడీ మౌనం వీడాలి, దోషులను కఠినంగా శిక్షించాలి, మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని నినాదాలు చేశారు. ఆంద్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ బిజెపి అధికారంలో ఉంటే మున్ముందు మణిపూర్‌ లాంటి ఘటనలు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందని తెలిపారు. అత్యంత క్రూరమైన ఘటనలు మణిపూర్లో జరిగాయని, బిజెపి ప్రభుత్వం వాటిని నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. జరిగిన తీరును బట్టి చూస్తే ప్రభుత్వమే దగ్గరుండి ఘర్షణలు రెచ్చగొట్టినట్లు కనిపిస్తోందని తెలిపారు. అక్కడి వీడియోలను చూస్తుంటే హిట్లర్‌ యూదులను చంపినట్లు ఉందని అన్నారు. మణిపూర్‌ ఘటనలో దీరెకాలిక కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. మెజారిటీ వర్గమైన మెయితీలను ఎస్‌సి, ఎస్‌టిల్లో చేర్చడానికి బిజెపి మేనిఫెస్టోలో పెట్టిందా? అని ప్రశ్నించారు. 55కు పైగా టెర్రిరిస్టు గ్రూపులు ఉన్న ప్రాంతాల్లో అత్యంత సున్నితమైన నిర?యం తీసుకోబోయే సమయంలో ఆయుధ ఎఫ్‌ఎస్‌పిఎ చట్టాన్ని తీసేయడం ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. బలమైన వ్యవహారంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇవ్వడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వమే మైనార్టీ తెగమీద ఉద్దేశపూర్వక లక్ష్యంతో పనిచేసినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఓట్లకోసం మైనార్టీలను లక్ష్యంగా వాడుకుంటున్నారని తెలిపారు. గోద్రా అల్లర్లు కూడా ఇదే తరహాలో చేశారని, అక్కడ మతాలను విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారని విమర్శించారు. దేశ ప్రధాని కాశ్మీర్‌ఫైల్స్‌, కేరళ ఫైల్స్‌ చూడండని చెప్పడం సరైంది కాదని విమర్శించారు. తెగల మధ్య గొడవని, మతాల మధ్య గొడవగా చూపించడం అత్యంత నీచమని పేర్కొన్నారు. పార్టీలు మతాన్నో, వర్గాన్నో నెత్తినపె ట్టుకుని పనిచేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి యం.భాగ్యమ్మ మాట్లాడుతూ మానవ సమాజం సిగ్గు పడేలా మణిపూర్‌లో దారుణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, హింస పెరిగిపోతోందని, దీనిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వరి మాట్లాడుతూ మణిపూర్‌లో గత మూడు నెలలుగా మారణకాండ జరుగుతున్నా శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రధాని మోడీ మౌనం వహించడం దుర్మార్గమన్నారు. వెంటనే మణిపూర్‌లో ప్రశాంత వాతావరణం కల్పించాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ మదనపల్లె ప్రాజెక్టు అధ్యక్షురాలు మధురవాణి, సిఐటియు నాయకులు సురేంద్ర, రిటైర్డ్‌ ఆర్జెడి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.నిరసన తెలుపుతున్న మహిళలు, ప్రజా సంఘాల నాయకులు