ప్రజాశక్తి -కలెక్టరేట్ : మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగంగా ఊరేగించి, అత్యాచారం చేసి చంపి వేసిన వారిని వెంటనే శిక్షించాలని, మణిపూర్‌లోనూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి హింసకు కారణం కాబట్టి వెంటనే మణిపూర్ సిఎం. బీరెన్‌సింగ్‌ను బర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టాయి. మణిపూర్ మారణహోమానికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బెలగాం వరకు వెళ్లి తిరిగి అంబేద్కర్ బొమ్మ వరకు వచ్చి నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన ర్యాలీలో సిపిఎం, సిపిఐ ఎంఎల్, లిబరేషన్ న్యూ డెమోక్రసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ మణిపూర్‌లో కుకి తెగ ఆదివాసి గిరిజనులుగా జీవిస్తుండగా, బిజెపి ప్రభుత్వం అభివృద్ధి చెందిన మెజార్టీ కులమైన మైతే తెగను ఎస్టీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకోవడంతో అక్కడ హింస చెలరేగిందని అన్నారు. కుకీ, నాగ తెగలను కొండలు నుంచి తరిమేసి విలువైన అటవీ సంపద, ఖనిజాలు, గనులను కార్పొరేట్లకు అప్ప చెప్పడంలో భాగమేనని విమర్శించారు. బిజెపి దేశ వ్యాప్తంగా తను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులకు, గిరిజనులకు, ముస్లిం, క్రిష్టియన్లకు, మహిళలకు రక్షణ లేదన్నారు. ఇంత దుర్మార్గం జరుగుతున్నా మనరాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి వంత పాడడం తప్ప మణిపూర్ ఘటనను ఖండించడంలేదన్నారు. ఇప్పటికైనా మణిపూర్ హింసపై పార్లమెంటులో అన్ని పార్టీలు చర్చించి హింసను కేంద్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ చర్యను ప్రజలంతా ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఇందిర, ఆర్.శ్రీదేవి, యమ్మల మన్మధరావు, పాకల సన్యాసిరావు, బంటు దాసు, రాము, జి.వెంకటరమణ, ఉమా, సిపిఐ ఎంఎల్ నాయకులు భాస్కరరావు, కృష్ణవేణి, న్యూ డెమోక్రసీ నాయకులు పి రమణ, బొచ్చ నర్సింగరావు, లిబరేషన్ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సంఘం, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్డివానివలసలో కొవ్వొత్తుల ప్రదర్శన
సీతానగరం : మణిపూర్‌లో మహిళలపై జరిగిన దాడులకు నిరసనగా మండలంలోని రెడ్డివానివలసలో సిపిఎం ఆధ్వర్యాన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మతఘర్షణలు సృష్టించి గిరిజనులను, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు ఆర్.లక్ష్మి, ఆర్.మణి తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : మణిపూర్ మారణహౌమం ఆపాలని, శాంతిని నెలకొల్పాలని, మహిళల్ని నగంగా ఊరేగించిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు గద్దె దించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన సంఘం కార్యాలయంలో నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు నాయకులు ఎం.తిరుపతిరావు, మండల అధ్యక్ష కార్యదర్శులు జె.శ్రీరాములు, బి.సాయి, సీనియర్ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: మణిపూర్‌లో మహిళలు పైన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, మానభంగాలును పాల్పడుతున్న సంఘవిద్రోహ శక్తులు పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పాలకొండలో సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు బి.అమరవేణి మాట్లాడారు. మణిపూర్‌లో మహిళలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ,లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కాదా రాము, అర్థమూడి లక్ష్మణరావు, మజ్జి వీరంనాయుడు, పి.లక్ష్మీ, చిట్టెమ్మ, చింతల సంజీవి, వేణు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.










