Jul 24,2023 21:52

ఫొటో : నిరసన చేపడుతున్న సిపిఎం నాయకులు

మణిపూర్‌ సిఎం రాజీనామా చెయ్యాలి : సిపిఎం
ప్రజాశక్తి-కావలి : మణిపూర్‌ రాష్ట్రంలో గిరిజన మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాలకి నిరసనగా ఆ రాష్ట్ర సిఎం రాజీనామా చేయాలని సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌ అంబేద్కర్‌ బొమ్మ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగంగా తిప్పడం ఒక మహిళపై అత్యాచారం చేయడం జరిగిన ఘటనపై సభ్య సమాజం తలదించుకునే లాగా ఉందని విమర్శించారు. జరిగిన ఘటనకు ఆందోళనలు చేస్తుంటే అక్కడి ముఖ్యమంత్రి ఇదేనా ఇంకా చాలా ఘటనలు జరిగి ఉన్నాయని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు.
జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. దానిని ప్రధానమంత్రి మోడీ సీరియస్‌గా తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోతుందని, అత్యాచారాలకు పాల్పడిన వారికి తగిన రీతిలో శిక్షలు పడడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రజాస్వామికవాదులు ప్రజలు ముఖ్యంగా మహిళలు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు జి.మధుసూదన్‌ రావు, పెంచల నరసింహ, నాయకులు కె జాన్‌, గౌరీ శంకర్‌, చెన్నయ్య, అన్వర్‌, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.