Jul 24,2023 23:12

శ్రీకాకుళం అర్బన్‌ : ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- పలాస: మణిపూర్‌ రాష్ట్రంలో కుకీ తెగలకు చెందిన గిరిజన మహిళలను పాశవికంగా, సభ్య సమాజం తలదించుకునేలా ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సిఎం బీరేన్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని ఆల్‌ ఇండియా ప్రొగ్రెస్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఐఫా) జిల్లా కన్వీనర్‌ కోనారి ఈశ్వరమ్మ, రైతు సంఘం నాయకులు మద్దిల రామారావు డిమాండ్‌ చేశారు. మండలంలోని బొడ్డపాడు పంచాయతీ మామిడిపల్లిలో మణిపూర్‌ ఘటనకు నిరసనగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నడుపుతున్న కేంద్రం మణిపూర్‌లో పెట్టిన రిజర్వేషన్లు చిచ్చు వల్ల 140 మందికి పైగా కుకీ గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన ఆస్తులు దగ్ధమైమయ్యాయని ప్రధాని మోడీ ఇప్పటి వరకు మణిపూర్‌ సందర్శించకపోవడం బాధ్యతా రాహిత్యం కాదా? అని ప్రశ్నించారు. ఆటోమొబైల్‌ షాపులో పనిచేస్తున్న మరో ఇద్దరు మహిళలను అత్యాచారం, హత్య చేయటం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. తక్షణమే దోషులను అరెస్టు చేయాలని, మణిపూర్‌లో కుకీ గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కమిటీ సభ్యులు వంకల అప్పయ్య, పోతనపల్లి అప్పారావు, పాపయ్య, శాంతమ్మ, పార్వతి, అరుణ, సుందరమ్మ, తులసమ్మ పాల్గొన్నారు.
మణిపూర్‌ గిరిజన మహిళలను అమానుషంగా నగంగా ఊరేగించిన ఘటనకు ప్రధాని నరేంద్ర మోడీ, మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ బాధ్యత వహించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.రవి, జిల్లా అధ్యక్షుడు గోరు వాసుదేవరావు డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద మణిపూర్‌ ఘటనపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో పవన్‌, మణికంఠ, వెంకటరమణ, గోపాల్‌, మాధవరావు, దిలీప్‌ పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్‌ : మణిపూర్‌ రాష్ట్రంలో 78 రోజులుగా కొనసాగుతున్న హింసాకాండకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఇశ్రా పౌండేషన్‌ ఎడ్ల గౌరునాయుడు డిమాండ్‌ చేశారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఇశ్రా ఫౌండేషన్‌, ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌, మానవ హక్కుల సంఘాలు ఆధ్వర్యాన విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనలపై దేశంలో అత్యున్నత సంస్థలైన నేషనల్‌ ఎస్‌టి కమిషన్‌, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌, నేషనల్‌ వుమెన్‌ కమిషన్లు ఇంత వరకు పర్యటించకపోవడం దారుణమన్నారు. దేశ ప్రధాని ఈ ఘటనలపై నోరు మెదపకుండా మౌనం దాల్చడం సరికాదన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు బైపల్లి రాజేశ్వరి, విద్యార్థి సంఘాల నాయకులు ఇంద్రజ, సునీల్‌, మానవ హక్కుల సంఘాల నుచి జేదీద్య భూషన్‌, కరజాడ ప్రసాద్‌ పాల్గొన్నారు.