Jul 31,2023 20:31

మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
మణిపూర్‌ రాష్ట్రంలో దళిత, క్రైస్తవులపై దాడులను నియంత్రించడంలో విఫలమైన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని మండలంలోని దళిత, క్రైస్తవ, ముస్లిం, మైనార్టీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. మూడు నెలలుగా మణిపూర్‌ రాష్ట్రంలోని కుకీ తెగకు చెందిన దళిత, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరసిస్తూ సోమవారం గోనెగండ్లలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సంత మార్కెట్‌ నుంచి పెద్దకట్ట, గంజిహల్లి రోడ్డు, బస్టాండ్‌, స్టేట్‌ బ్యాంకు మీదుగా తహశీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది. అనంతరం తహశీల్దార్‌ వేణుగోపాల్‌కు, ఎంపిడిఒ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు దేవసహాయం, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, కార్యవర్గ సభ్యులు వై.నగేష్‌, ముస్లిం, మైనారిటీ నాయకులు మాబు వలీ, గాజుల ఉస్మాన్‌, బాష మాట్లాడారు. మణిపూర్‌ రాష్ట్రంలో ఒక తెగకు చెందిన వారిపై మరో తెగవారు అమానుష దాడులు, గృహ దహనాలు, అత్యాచారాలు, చివరకు మహిళలను నగంగా ఊరేగించి హతమార్చే దారుణాలకు ఒడిగట్టుతోందని తెలిపారు. తగిన చర్యలు తీసుకొని నియంత్రించాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరెన్‌ సింగ్‌ చోద్యం చూడడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఆ ఘటనలపై 'సిట్‌' ఏర్పాటు చేసి అల్లరిమూకలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేసి బాధిత కుకి తెగకు చెందిన మహిళల కుటుంబాలకు న్యాయం చేసి వారికి భరోసా కల్పించే విధంగా తగినచర్యలు చేపట్టాలని తెలిపారు. గోనెగండ్ల సర్పంచి హైమావతి, అడ్వకేట్‌ వెంకటేశ్వర్లు, పాస్టర్‌ ప్రసంగి, కెవిపిఎస్‌ నాయకులు కరుణాకర్‌, ముస్లిం, మైనార్టీ నాయకులు హాజీ జలీల్‌, బగిలి రఫీ, మదీన పాల్గొన్నారు.