Jul 25,2023 20:46

- నిరసన తెలుపుతున్న సిఐటియు, ఐద్వా, యుటిఎఫ్‌ నాయకులు

రాయచోటి టౌన్‌ : ప్రజల మధ్య చిచ్చు పెట్టిన మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్‌ సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌, వైఎస్సార్‌ సర్కిల్‌ మీదుగా బంగ్లా సెంటర్‌ వరకు సాగింది. ప్రదర్శనలో 'అత్యాచార దుండగులను శిక్షించాలి..మతోన్మాదాన్ని తరిమికొడదాం.. మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ మణిపూర్‌ హింసను అదుపుచేయడంలో అక్కడున్న బిజెపి ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను బయటకు రానీయడం లేదనీ, ప్రభుత్వం స్పందించి దానిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అయినా దాన్ని పరిష్కరించాలనే దిశగా కేంద్రంలోని హోమ్‌ మంత్రి ఏమీ చేయడం లేదని వాపోయారు. మణిపూర్‌ హింస గురించి పార్లమెంటులో అడిగినప్పటికీ ప్రధాని ఏమాత్రం స్పందించలేదని, పైగా పార్లమెంటు బయట అన్యాయం జరిగిపోయింది.. ఘోరం జరిగిపోయింది అంటూ సామాన్య ప్రజలు అన్నట్లు ప్రధాని చెప్పడం శోచనీయమన్నారు. మరి అన్యాయం-ఘోరం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. 56 ఇంచులు మందమైన చర్మం ఉన్న ఆయనకి మహిళలపై జరుగుతున్న దారుణాలను తెలుసుకోవడానికి 72 గంటలు పట్టిందా? అని ప్రస్తుతం అంతర్జాలంలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయని వివరించారు. మణిపూర్‌లోని హింసకు ప్రధాన కారణం బిజెపినేనన్నారు. వారి రాజకీయ అవసరాల కోసం తెగల మధ్య తగాదాలు పెట్టారని, ఆ అగ్గి రాజుకొని దేశమంతా ఆ మంటలు వ్యాపించాయని వివరించారు. మణిపూర్‌ ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన కూడా మణిపూర్‌ అల్లర్లపై పెదవి విప్పకపోవడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.జాబీర్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపురం రామచంద్ర, సిఐటియు జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు మాట్లాడుతూ 85 రోజులుగా మణిపూర్లో దమనకాండ కొనసాగుతోందని, హత్యలు, అత్యాచారాలు, దారుణంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల మాన, ప్రాణాలను కాపాడలేని మణిపూర్‌ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. అక్కడి పరిస్థితిని గమనించి కూడా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మణిపూర్‌లో విఫలమయ్యాయని వాపోయారు. ఇప్పటికైనా శాంతి భద్రతలు నెలకొనేలా ప్రధాని చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిద్దమ్మ, నాగమణి, విజయమ్మ, రైతు సంఘం నాయకులు రమణారెడ్డి, హరిప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాబు, గుర్రప్ప పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన్‌: మణిపూర్‌లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని, ఆదివాసి మహిళలను నగంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ట్యాక్సీ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సుందరయ్య సర్కిల్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షులు షేక్‌వహాబ్‌, ఉపాధ్యక్షులు రమణ నాయుడు, సహాయ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్‌ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇద్దరి మహిళలను నగంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుందరం, కమిటీ సభ్యులు భాస్కర్‌, ఎం.మధుబాబు, జోహార్‌బాష పాల్గొన్నారు.