ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: మణిపూర్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని దళిత, గిరిజన, బిసి, మైనార్టీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మణిపూర్‌లో మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యాన నగరంలోని అంబేద్కర్ కూడలి నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. మణిపూర్‌లో మారణకాండను అరికట్టాలని, క్రైస్తవులు, చర్చిలపై దాడులను నివారించాలని, మహిళలను నగంగా ఊరేగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనీ, మోడీ-షా సర్కార్ మౌనం వీడి తమ అభిప్రాయాన్ని ప్రకటించాలని ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రచయిత, కవి అట్టాడ అప్పలనాయుడు, నల్లి ధర్మారావు, సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ తరతరాలుగా కలసిమెలసి జీవిస్తున్న మైతేయి, కుకీ, నాగాల మధ్య మత చిచ్చు రగిలించి, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న కేంద్రం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు మారణహోమానికి ప్రధాన ముద్దాయిలు అని అన్నారు. మైనార్టీలపై హత్యలు, అత్యాచారాలు, దమనకాండలపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టాలని, మహిళలను నగంగా ఊరేగించి, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ పర్వత ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలన్న దురుద్దేశంతో బిజెపి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ చర్యలను తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు మంటగలుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. మైతేయి తెగ ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, భజరంగ్‌దళ్ సాగిస్తున్న మతోన్మాద దాడులను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వీటిని నివారించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె.రాంగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, కెఎన్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిస్క కృష్ణయ్య, పలు సంఘాల నాయకులు పి.చంద్రపతిరావు, షానో, ఎజ్రా, పోతాల దుర్గారావు, తాండ్ర ప్రకాష్, వి.జి.కె మూర్తి, జి.సింహాచలం, టి.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యాన...
స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యాన నగరంలోని ఎన్‌జిఒ హోం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్‌జిఒ హోంలో సంఘటన జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ అధ్యక్షతన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి, రైతుకూలీ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు వర్మ, జనసాహితి జిల్లా కార్యదర్శి పి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.










