ప్రజాశక్తి -ఎస్.రాయవరం:మణిపూర్ రాష్ట్రంలో మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలని సిఐటియు గౌరవ అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు కోరారు. శనివారం సాయంత్రం యస్ రాయవరం మండలం తిమ్మాపురం శ్రీ నూకాలమ్మ ఆలయం వద్ద జరిగిన ఐదు మండలాల ఐకెపి సిబ్బంది సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఐకెపి సభ్యులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ, మణిపూర్‌లో గడచిన మూడు నెలలుగా హింసాకాండ జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఐకెపి రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి, జిల్లా నాయకుడు రాజేష్, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు యమ్ సత్యన్నారాయణ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్: మణిపూర్‌లో ఘటనలకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం పట్టణంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశం బిఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్టా నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ, మణిపూర్ దుర్మార్గాన్ని ఖండిస్తూ బాధితులకు సంఘీభావంగా నిరసన తెలిపారు. మణిపూర్‌లో రెండు నెలలకు పైగా జరుగుతున్న హింసకాండను అక్కడి బీజేపీ ప్రభుత్వమే నడిపిస్తుందని విమర్శించారు. భూమి, వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురి చేయడానికి బిజెపి ప్రభుత్వం నడిపిస్తున్న నాటకం అనితెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీసాల సుబ్బన్న, సిపిఐ నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, సిపిఎం నాయకులు ఆడిగర్ల రాజు, ప్రజా బంధు పార్టీ నాయకులు ప్రసాదు, బహుజన ఐక్యవేదిక నాయకులు కొల్లి గంగాధర, ఐద్వా సభ్యులు గౌరీ, కెవి సూర్యప్రభ, త్రిమూర్తులరెడ్డి, గురు బాబు, సాపిరెడ్డి నారాయణమూర్తి, విధసం నాయకులు ఎల్లాజీ,. రమణ, రాధాకష్ణ, మైనార్టీస్ సంఘాల నాయకులు సువర్ణ రాజు, సూరిబాబు, పాపారావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : మణిపూర్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న సంఘం విద్రోహ శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం మండలంలోని పెదముషిడివాడ గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకులు రమణి మాట్లాడుతూ మే 4న మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి, నగంగా తీసుకెళ్లి, సామూహిక అత్యాచారాలు చేసి, హత్య చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకులు అక్కమ్మ, లక్ష్మి, భూలక్ష్మి, పార్వతి, కనక, రత్నమాల, దేవి పాల్గొన్నారు
చోడవరం : మణిపూర్ మారణకాండకు నిరసనగా చోడవరం మండల క్రిస్టియన్లు చర్చిల ఆధ్వర్యంలో శనివారం చోడవరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మణిపూర్‌లో ఎస్టి గిరిజన జాతులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిషప్ జీవన్ పాల్, అనంతకుమర్, అబ్రహం, మహిళలు పాల్గొన్నారు.
తగరపువలస : సిపిఐ భీమిలి ఏరియా సమితి ఆధ్వర్యాన స్థానిక ప్రయివేట్ మార్కెట్ వద్ద శనివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి కానూరి రాంబాబు, అల్లు బాబూరావు, మోర అప్పలరాజు, మావూరి వీర్రాజు, నూలు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు చిట్టివలస వెల్ఫేర్ సెంటర్ నుంచి ప్రైవేట్ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు
పెందుర్తి : మణిపూర్‌లో తక్షణమే శాంతి నెలకొల్పాలంటూ సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్ న్యూ డెమోక్రసీ) పెందుర్తి ఏరియా కమిటీల ఆధ్వర్యాన చినముషిడి వాడ జంక్షన్ నుంచి సుజాతనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.రమణి, ఆర్ శ్రీనివాస్, నిర్మల, వై.రాంబాబు, అసిరి నాయుడు, అన్నపూర్ణ, అప్పలనాయుడు, రజిని, రూప, వరలక్ష్మి వామపక్షాల కార్యకర్తలు పాల్గొన్నారు.










