Aug 23,2023 00:13

పోలీసులకు వినతిపత్రం ఇస్తున్న పలు సంఘాల ప్రతినిధులు

ప్రజాశక్తి - కశింకోట
మణిపూర్‌లో జరిగిన మారణకాండకు నిరసనగా మండల కేంద్రంలో మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అన్ని చర్చిలు, ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ పార్టీలు, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), దళిత సంఘాల ఆధ్వర్యాన ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం కసింకోట పోలీస్‌ స్టేషన్‌లోనూ, తహశీల్దార్‌ కార్యాలయంలోనూ వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో మూడున్నర నెలలుగా సాగుతున్న నరమేధానికి దానికి మూల కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో మత సామరస్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలను నగంగా వూరేగించి, అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమన్నారు. ఇటువంటి దుర్మార్గంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రంలోని బిజెపి సర్కారుగాని, మణిపూర్‌ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంగాని పట్టించుకోలేదన్నారు. మణిపూర్‌లో విధ్వంసానికి గురైన చర్చలను మరల ప్రభుత్వమే పునర్నిర్మాణం చేయాలని, కుకీ గిరిజనులను ఆదుకోవాలని కోరారు. ఈ మారణకాండలో బలైన వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు టి.బెనర్జీ కుమార్‌, కార్యదర్శి కె.ప్రేమ్‌కుమార్‌, సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా నాయకులు ఆర్‌.దొరబాబు పాస్టర్‌ దయానంద్‌, ఐద్వా జిల్లా నాయకురాలు డిడి.వరలక్ష్మి, ఎస్సి సంఘం అధ్యక్షులు పి.కామరాజు తదితరులు పాల్గొన్నారు.