పుట్టపర్తి అర్బన్ : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ జాతుల మధ్య విద్వేషాలు పెంచడం వల్లనే మణిపూర్‌లో మారణకాండ రగులుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ తెలిపారు. మాణిపూర్‌లో జరుగుతున్న మారణకాండ, మహిళలపై అకృత్యాలను ఆపాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు కారును సిపిఎం నాయకులు దిగ్బంధించారు. మంగళవారం ఉదయం పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట కలెక్టర్ కారును అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎం.ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా తయారవుతున్న మణిపూర్ హింసను ఆపేలా కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లేలా కలెక్టర్ రాతపూర్వకంగా లేఖ రాయాలని కోరారు. అక్కడ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచక శక్తులపై అక్కడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలల నుంచి మణిపూర్‌లో రెండు జాతుల మధ్య జరుగుతున్న వైరం అనేక మంది ప్రాణాలను బలితీసుకుందన్నారు. దాదాపు 150 మంది హత్యగావింపబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలూ జరుగుతున్నాయని చెప్పారు. సభ్యసమాజం తలదించుకునేలా మహిళలను వివస్త్రలను చేసి ఊరేగిస్తున్నారని చెప్పాపు. కుకి గిరిజన తెగకు సంబంధించి నాలుగు వేల గృహాలను తగలబెట్టారని చెప్పారు. దాదాపు 60వేల మందికిపైగా గ్రామాల వదిలి వెళ్లారంటే అక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. గిరిజనుల భూములు కార్పొరేట్లకు అప్పగించే దిశగా అక్కడి బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హింసకు ఆజ్యం పోసినట్లు అయ్యిందన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ మణిపూర్ హింసను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రధాని దేశ చరిత్రలో చరిత్రహీనుడుగా మిగులుతారని హెచ్చరించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు స్పందించి మణిపూర్ హింసను ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలు పంపాలని కోరారు. కలెక్టర్ వాహనం ఎదుట ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులతో సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్.వెంకటేష్, నాయకులు రామకృష్ణ, బ్యాళ్ల అంజి, పైపల్లి గంగాధర్, పెడపల్లి బాబా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.










