
ప్రజాశక్తి - ఆచంట
మణిపూర్‌లో కుకీలపై నెలల తరబడి జరుగుతున్న హింసను అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. స్థానిక కచేరీ సెంటర్లో శనివారం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీకి సిపిఎం బృందం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ మణిపూర్‌లో మైనార్టీలుగా ఉన్న కుకీ క్రైస్తవ సోదరి, సోదరులపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావన్నారు. మణిపూర్‌లో హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలకు సిపిఎం, సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయన్నారు. నెలల తరబడి జరుగుతున్న మారణకాండను దేశం మొత్తం ఖండించాలన్నారు. దేశాన్ని ఏలుతున్న పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారే మణిపూర్‌లో కూడా అధికారంలో ఉన్నా రన్నారు. వారి ప్రోత్సాహం, అండదండతోనే క్రైస్తవ కుకీలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. స్త్రీలను వివస్త్రలను చేసి, అత్యాచారం, హత్యచేసి, వారి కుటుంబ సభ్యులను హతమార్చిన సంఘటన ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసిందన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఈ ఘటనల్ని ఖండించాయన్నారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని జరిగే కార్యక్రమాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్, జిల్లా కమిటీ సభ్యులు జె.సత్యనారాయణ, పెనుమంట్ర మండల కార్యదర్శి కె.సుబ్బరాజు, పోడూరు మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్, ఆచంట మండల నాయకులు వద్ధిపర్తి అంజిబాబు, చిర్రా నరసింహమూర్తి, మచ్చా సుబ్బారావు, చొప్పల మోహన్, తలుపూరి బుల్లబ్బాయి, ఎం.బ్రహ్మయ్య, వి.శ్రీను పాల్గొన్నారు.