ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: మణిపూర్‌లో మారణహోమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి విమర్శించారు. మణిపూర్‌లో మారణకాండను అరికట్టాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్‌లోని గిరిజనుల పొత్తిళ్లలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన కుట్రలో భాగమే మారణహోమానికి ఆజ్యం పోసిందన్నారు. మహిళలను నగంగా ఊరేగించడం, అత్యాచారాలు, విధ్వంసాలు, మారణకాండతో మణిపూర్ తగలబడుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. మణిపూర్ మారణకాండపై ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సుమారు 150 మందిని హత్య చేయడం దారుణమన్నారు. మహిళలను నగంగా ఊరేగించి లైంగికంగా దాడి చేసి కొట్టి చంపిన దుండగులను శిక్షించడంలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. మూడు నెలలు కావస్తున్నా మోడీ ఎందుకు పెదవి విప్పలేదో, అందరి అభ్యర్థనలు, విజ్ఞాపనలు అరణ్యరోదనలు ఎందుకయ్యాయో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ప్రధాని నోరు స్పందించలేదన్నారు. మతోన్మాద ఉన్మాదానికి బలైన మణిపూర్ ఘటనకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లే కారణమన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత ఘర్షణలు, దళితులు, మైనార్టీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరిగాయన్నారు. మణిపూర్ మారణహోమాన్ని ఖండించకుండా రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు గోడమీద పిల్లివాటంలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే దేశమంతా మణిపూర్‌లా తగలబడుతుందని, అందువల్ల ప్రతి పౌరుడు బిజెపిని అధికారంలోకి రాకుండా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, జి.సింహాచలం, నాయకులు ఎం.తిరుపతిరావు, పి.తేజేశ్వరరావు కె.నాగమణి, టి.తిరుపరావు, సిర్ల.ప్రసాదరావు, పి.ప్రసాదరావు, సిహెచ్.అమ్మన్నాయుడు, ఎన్.వి.రమణ, ఎ.మహాలక్ష్మి, ఎ.లక్ష్మి, జి.ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
సారవకోటలో కొవ్వొత్తుల ర్యాలీ
మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరి తీయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ కన్వీనర్ వాబ యోగి అన్నారు. సారవకోట మండల కేంద్రంలో గిరిజన బాలికలు సోమవారం భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతపల్లి భాస్కరరావు, మాజీ ఎంపిటిసి కె.వెంకటేష్, నీలయ్య తదితరులు పాల్గొన్నారు.










