Jul 31,2023 21:56

కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : మణిపూర్‌ రాష్ట్రంలో గత మూడు నెలలగా సాగుతున్న మారణ హోమాన్ని ఆపాలని సిపిఎం నాయకులు కోరారు. పుట్టపర్తి ప్రశాంతి గ్రామ్‌లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం ఇంతియాజ్‌ రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్‌ దిల్షాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మణిపూర్‌ ఘటనకు సంబంధించిన లక్ష కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఓబులు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో సాగుతున్న మారణకాండలో 145 మంది బలి అయ్యారని వేల మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని అన్నారు. ఐదువేలకు పైగా ఇళ్లు కాలి బూడిద అయ్యాయని, 60వేల సొంత రాష్ట్రంలోనే శరణార్థులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన కుకీ మహిళలను పోలీసులు సమక్షంలోనే మతోన్మాదులు నగంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసేందుకు సిపిఎం కరపత్రాలను ముద్రించి ప్రజల్లోకి తీసుకు వెళుతూందని చెప్పారు. మణిపూర్లో బిజెపి కొన్ని వర్గాల మధ్య చిచ్చు లేపి, జాతుల మధ్య వైరం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి మతోన్మాద చర్యలకు చమర గీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతి గ్రామ్‌, మామిల్లకుంట క్రాస్‌, యనమలపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రవీణ్‌ కుమార్‌, సిద్దు, రామచంద్ర, సిఐటియు నాయకులు బాబావలి, గంగాధర్‌, అంజి, ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.