ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం: మణిపూర్‌లో గిరిజనులపై జరుగుతున్న దాడికి నిరసనగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోలక అవినాష్ మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరి గిరిజన మహిళలను అర్ధనగంగా ఊరేగించి చంపడం చాలా బాధాకరమన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మత ఘర్షణలు సృష్టిస్తూ గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. మరోవైపు గిరిజనేతరులను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి బిజెపి ప్రధాన కుట్ర చేస్తుందన్నారు. మణిపూర్‌లో ఉన్న భూ ఖనిజాలు కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిం చేందుకు గిరిజనులను అక్కడ నుంచి వెళ్లగొట్టించేందుకు బిజెపి అల్లర్లు సృష్టిస్తుం దన్నారు. బిజెపి నిరంకుశ వైఖరిని ప్రజలంతా ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండంగి రమణ, నాయకులు ఎం సన్యాసిరావు, ఇండియా, సుబ్బారావు తదితరులు ఉన్నారు.
కొవ్వొత్తులతో ప్రదర్శన
మణిపూర్‌లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసీ టీచర్ అసోసియేషన్, ట్రైబల్ రైట్స్ ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటన పునరావృతమైతే రాష్ట్ర స్థాయి నుంచి దేశం మొత్తం ఆదివాసీలమంతా ఏకమై మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు నిరసనగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్తంభింప చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రోబ్బా లోవరాజు, మన్యం జిల్లా అధ్యక్షులు ఐ.రామకష్ణ, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు యడ్ల సూర్యనారాయణ, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ తాడంగి సత్యనారాయణ, గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండగి రమణ, ఆదివాసి టీచర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సెక్రటరీ భగవన్, బిడ్డిక గైయిమి,మెల్లక ప్రమీల, భారతి, ప్రభావతి పాల్గొన్నారు.
పాచిపెంట : మణిపూర్ జరుగుతున్న హింస హత్యాకాండను నిరసిస్తూ పాచిపెంట మండల కేంద్రం గాంధీ బొమ్మ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియ మండల నాయకులు చింత పోలిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు పడాల తమ్మయ్య మాట్లాడుతూ మణిపూర్ హత్యాకాండకు మోడీ విధానాలే కారణమన్నారు. ఇప్పటికైనా ఈన దుర్మార్గానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించి గిరిజనులకు రక్షణ కల్పించాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు స్వయారి, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలోని పూతికివలస ప్రాంతంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన దాడికి నిరసన తెలిపారు. ఆదివాసీలపై అఘత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట: మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ సిఐటియు మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు మాట్లాడుతూ మణిపూర్‌లో విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనే కుట్ర ఉందని, మానవత్వంలేని ప్రధానిగా మోడీ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. తక్షణం అల్లర్లకు పాల్పడే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుని, మాణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. మేధావులు, అభ్యుదయవాదులు, యువకులు ప్రజాస్వామికవాదులు, దేశ సమైక్యతను కోరుకునేవారు తక్షణం మోడీ ప్రభుత్వ మతోన్మాద చర్యలను ఖండించాలని, లేకపోతే మాణిపూర్ ప్రయోగం దేశవ్యాప్తంగా బిజెపి, ఆరెస్సెస్ అమలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు లక్ష్మి, భానుమూర్తి, జ్యోతిలక్ష్మి, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్ : మణిపూర్‌లో జరుగుతున్న అరాచకానికి ముగింపు పలకాలని, ఇటీవల జరిగిన సంఘటన ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని సిఐటియు ఆధ్వర్యంలో మహిళలతో కలిసి నిరసన చేపట్టారు. రెండు, మూడు నెలల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నా ప్రధానమంత్రి కళ్లు మూసుకుని పరిపాలన చేస్తున్నారా అని సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ, ఉపాధ్యక్షులు వి.ఇందిర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో మణిపూర్‌లో జరుగుతున్న అరాచకానికి ముగింపు పలకాలని ప్రజాతంత్ర వాదులు. లౌకికవాదులు ఈ దుర్మార్గాన్ని ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు శాంతి, చంద్ర, లక్ష్మి, ఆటో యూనియన్ కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.
పిడిఎస్‌ఒ ఆధ్వర్యాన
బెలగాం :మణిపూర్ సంఘటనకు నిరసనగా పిడిఎస్‌ఒ ఆధ్వర్యాన స్థానిక ఆర్‌టిసికాంప్లెక్స్ నుంచి తహశీల్దార్ కార్యాలయం మీదుగా వైఎస్ విగ్రహం వరకూ నిరసన ర్యాలీ జరిగింది. అనంతరం అక్కడ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పిడిఎస్‌ఒ జిల్లా అధ్యక్షులు కె.సోమేష్ మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఘటన యావత్ భారతదేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిందన్నారు. మహిళలను ఎంతో గౌరవిస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కనీసం ఈ విషయంపై మాట్లాడకపోవడం, స్వయానా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై 30 సెకండ్ల మాత్రమే స్పందించడం ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థం అవుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.రుద్రి, చిరంజీవి, సోమశేఖర,్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : మణిపూర్ లో గిరిజన మహిళలను నగంగా ఊరేగింపు చేయడం పట్ల దళిత, గిరిజన సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. యాలం అంబేద్కర్ జంక్షన్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. మణిపూర్ సంఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని, ప్రధాని భారతదేశానికి ఒక సైతానని వర్ణించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిని మోహన్, డివిజన్ అధ్యక్షులు గురుబిల్లి రవికుమార్, దళిత యువసేన నాయకులు పాల్గొన్నారు.
తిర్లంగి ఉపేందర్, నల్లబారిక సురేష్, కస్పా వీధి దళిత యువసేన, పొట్నూరు రమేష్, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు, దళిత మహిళ సంఘ నాయకురాలు జయభూషణమని, బోనెల సుజాత, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు బత్తిన మన్మధరావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
నోట్: (02) అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న దళిత గిరిజన సంఘ నాయకులు
పాలకొండ :
మణిపూర్ ఘటనను ప్రజలంతా ఖండించాలి
నేడు వామపక్షాల ఆధ్వర్యాన నిరసన
కలెక్టరేట్: మణిపూర్‌లో మైనింగ్ మాఫియా అక్కడ బిజెపి ప్రభుత్వం సహకారంతో సాగిస్తున్న హత్యలు, అత్యాచారాలు, మానభంగాలును సంఘవిద్రోహ చర్యలను ప్రజలంతా ఖండించాలని, ఈనెల 24న తలపెట్టిన నిరసనలో ప్రజలంతా పాల్గొనాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన వామపక్ష నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి వేణు, కె.రామస్వామి (సిపిఎం), కూరంగి మన్మధరావు (సిపిఐ), పి.శ్రీనునాయుడు (సిపిఐ ఎఎంఎల్), బి.నర్సింగరావు (సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ), పి.సంగం (లిబరేషన్ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు), పి.రంజిత్‌కుమార్ (గిరిజన సంక్షేమ సంఘం) మాట్లాడారు. మణిపూర్‌లో బిజెపి ప్రభుత్వం గిరిజన జాతుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ఆ పేరుతో గిరిజనులను, మహిళలపై అత్యాచారాలు, మానభంగాల, నగంగా ఊరేగించడాలు, గృహ దహనాలకు పాల్పడ్డాన్ని ప్రజలంతా ఖండించాలని అన్నారు. దీని వెనుక ఉన్న మైనింగ్ మాఫియా, కార్పొరేట్ కంపెనీల ఈ దుర్మార్గాలకు తెగబడుతున్నాయని, ఈ సంఘ విద్రోహ శక్తులు, వీరికి సహకరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని కోరారు. మహిళలు, గిరిజనులపై బిజెపి రాష్ట్ర ప్రభుత్వం అండతో సాగిస్తున్న దమనకాండని మన రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్షాలు నోరువిప్పకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గాలను ఖండిస్తూ వామపక్షాలు పార్వతీపురంలో సోమవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు.










