మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండ, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బుధవారం పలుచోట్ల నిరసనలు చేపట్టారు. పెద్దాపురంలో సాహితీ స్రవంతి, యుటిఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వివిధ మతాలు, తెగల మధ్య విద్వేష పూరిత హింసాకాండ చెలరేగుతోందన్నారు. ఈ హింసాకాండలో భాగంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. వెంటనే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జోస్యుల కృష్ణబాబు, పట్టణ కార్యదర్శి కొత్త శివ, ఉప్పటి రవికుమార్, యుటిఎఫ్ నాయకులు అనంతరావు, సూరిబాబు, ఎం.నాగేశ్వరరావు, శివశంకర్, వెంకటరావు, గోవిందరాజులు, అజరు కుమార్, రత్నాంజరు, కాపుగంటి కోటి తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు తాళ్ళరేవు, యానాం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లరేవు సంతపేట సెంటర్ నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు జోరు వానలో క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ చేశారు. పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్ మాట్లాడారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.సాల్మన్ రాజు, బి.జార్జి ముల్లర్, పి.జాన్ విక్టర్, కె.జయానంద కుమార్, డి.పురుషోత్తం, పి.ప్రతాప్, ఉంగరాల బూరిబాబు, పెద్ద ఎత్తున మహిళలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాజులూరులో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి ఎంపిడిఒ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, సత్తిరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్, యానిమేటర్స్, ఆశ వర్కర్స్, మిడ్డే మీల్స్, కౌలు రైతులు పాల్గొన్నారు.










