ప్రజాశక్తి -హుకుంపేట:మణిపూర్‌లో బిజెపి హింసాకాండపై అల్లూరి జిల్లా కేంద్రంలో గిరిజన సంఘం, గిరిజన మహిళ సంఘం(ఐద్వా ), సీఐటీయూ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ, మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్థానిక గిరిజనుల పై తీవ్ర దాడులు చేస్తూ ముగ్గురు మహిళలను వివస్త్రను చేయడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వం నిందితులను వేనుకేసుకుని రావడం సరికాదని అన్నారు.మెజారిటీ గిరిజనులు క్రిస్టియన్ మతంలో ఉన్నారనే ఆక్రోశంతో బీజేపీ ప్రభుత్వ ఈ ఘటనలకు పాల్పడుతుందన్నారు. గిరిజనేతరులను ఎస్టీ జాబితాలోకి తెచ్చి ఓట్లు పొందాలని బీజేపీ ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పొద్దు బాల దేవ్ మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై బీజేపీ నాయకుడు మూత్రం పోసిన ఘటన మరువక ముందే, మణిపూర్ లో గిరిజనుల పై ప్రభుత్వం దాడులకు తెగబడిందన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పై ప్రధానమంత్రి స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన మహిళ సంఘం జిల్లా అధ్యక్షులు సొంటేన హైమావతి మాట్లాడుతూ.. బీజేపీ మోడీ ప్రభుత్వం మణిపూర్ లో గిరిజనుల పై జరుగుతున్న దాడులను చోద్యం చూస్తుందన్నారు. ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాలను టార్గెట్ చేస్తూ.. మోడీ ప్రభుత్వం హింసాను ప్రేరేపిస్తుందన్నారు.మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నడి రోడ్డు పై మహిళలకు బట్టలు లేకుండా ఊరేగింపు చేసిన మానవ మృగాలను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని అమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేత ఎల్ సుందర్ రావు, గిరిజన సంఘం, ఐద్వా సంఘం తదితరులు పాల్గొన్నారు.
మణిపూర్ నిందితులను శిక్షించాలి
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మణిపూర్‌లో గిరిజన మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల నేర నిరోధక సంఘం అల్లూరి జిల్లా అధ్యక్షుడు పి ధర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విభిన్న జాతులు, సంస్కతి కలిగిన భారత దేశంలో ఇటువంటి అటవీక ఘటనలు జరగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులకు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అల్లూరి జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










