Jul 24,2023 18:58

నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై జరిగిన అమానుష ఘటనపై ప్రజా సంఘాల నాయకులు భగ్గుమన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్‌ మాదిగ, డిబిఎస్‌ జిల్లా అధ్యక్షులు టి.లోకేష్‌, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు జయరాజు, సిపిఐ నాయకులు భాస్కర్‌ యాదవ్‌, నవ్యాంధ్ర తాలూకా అధ్యక్షులు సన్నేక్కి కరెన్న, ఆర్‌ఎవిఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షులు మోహన్‌, వైహెచ్‌పిఎస్‌ నాయకులు వీరేశ్‌ మాట్లాడారు. మణిపూర్‌లో సుమారు 80 రోజుల నుంచి కుకీ తెగలపై ఉన్నత వర్గాలైన మెయితీ కులం వారు దాడి చేస్తూ ఉంటే బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అగ్రకులాలైన మెయితీలకు వత్తాసు పలుకుతూ మానభంగాలు చేయిస్తూ, హత్యలు చేయిస్తూ మారణకాండలకు పాల్పడుతూ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కుకీ తెగలకు సంపూర్ణంగా న్యాయం చేయాలని కోరారు. మహిళలను వివస్త్రను చేసి మానభంగం చేసి పైశాచిక ఆనందం పొందిన మానవ మృగాలను ప్రజలందరూ చూస్తుండగానే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజాసంఘాల ఐక్యతతో రాష్ట్రంలోనే కాకుండా, కేంద్రంలో కూడా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ తాలూకా ఇన్‌ఛార్జీ దేవపుత్ర, పెద్దకడబూరు మండల అధ్యక్షులు పెద్ద తాయన్న, చిలకలడోన గ్రామ నాయకులు మహానంది, మామిడి రాజు, మనోహర్‌, కిరణ్‌ కుమార్‌, మంత్రాలయం నాయకులు పేతురు, శివ, రవి, ఆంధ్రయ పాల్గొన్నారు.