ప్రజాశక్తి-అద్దంకి: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడడం భరతమాతనే అవమానించి నట్లుగా ఉందని విశ్రాంత ఆర్‌జెడి యూ దేవపాలన అన్నారు. మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలకు నిరసనగా మంగళ వారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బంగ్లారోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు, సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, పొనకా రామాంజనేయులు, పి తిరుపతిరెడ్డి, టీవీఎస్ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్జెడి యు దేవపాలన మాట్లాడుతూ స్త్రీలను అవమానించిన ఘటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి దమనకాండలు జరగడం పట్ల ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. త్రిమూర్తు లు మాట్లాడుతూ మణిపూర్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం ఎందుకు నిలువరించ లేకపోతోందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులతోపాటు కళాకారులు కిరణ్, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు పిసిహెచ్ కోటయ్య, హనుమయ్య, బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ పూనూరు ఆరోగ్యం, విద్యార్థులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, మారణ హౌమానికి వ్యతిరేకంగా మంగళ వారం మేదరమెట్లలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక యుటిఎఫ్ ఆఫీసు నుంచి బయలుదేరిన ర్యాలీ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ నిరసన కార్యక్రమాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎం ఆంజనేయులు మాట్లాడుతూ ఇటువంటి దమనకాండను భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదని, ఇటువంటి సంఘటనలను కనీసం ఖండించే స్థితిలో కేంద్ర ప్రభుత్వం కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం గానీ లేవని, పేదలను అలుసుగా చూస్తూ అగ్రవర్ణాలు పేదలపై దాడి చేస్తున్న అంశాన్ని పరోక్షంగా ఆ ప్రభుత్వాలు సమర్ధిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం ఈ సంఘటనలు ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ను కట్ చేయించి, ఆ రాష్ట్ర సీఎం వేరే దేశాలకు వెళ్లినటువంటి సంఘటన మన అందరికీ తెలిసిందే. పేద మహిళలను రక్షించలేని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలని, ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం ముస్లిం మైనారిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, సిఐటియు బాధ్యులు ఎం సత్యమూర్తి, కెవిపిఎస్ బాధ్యులు కంచర్ల సురేష్ బాబు, చావా కోటేశ్వరరావు, చావ జయరావు, వై రవీంద్రబాబు, డి జయమ్మ, డి ప్రసాద్‌రావు, మాజీ సర్పంచ్ జజ్జన ఆనందరావు, పెద్ద సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మద్దిపాడు: మణిపూర్‌లో మహిళలపై అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మద్దిపాడు బస్టాండ్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించి వారిపై అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై మోడీ స్పందించక పోవడం దారుణం అన్నారు. మణిపూర్‌లో మహిళలపై హింస జరుగుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కాని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గాని ఖండించడం పోవడం శోచనీయం అని అన్నారు. సిఐటియు మండల కార్యదర్శి ఆదిలక్ష్మి మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేశారని, అడ్డువచ్చిన కుటుంబ సభ్యులను చంపేశారని అన్నారు. ఎన్ని చట్టాలు చేసినా దేశంలో రోజురోజుకూ మహిళలపై హింస పెరుగుతోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రైతు సంఘం మండల నాయకులు కనపర్తి సుబ్బారావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు, మతోన్మాద దాడులు పెరిగాయని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాశిం, చిన్నా, ఉషా, శ్రీదేవి, రమాదేవి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.










