Aug 02,2023 00:14

తహశీల్దార్‌ అంకారావుకు వినతిపత్రం ఇస్తున్న వివిధ సంఘాల నాయకులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మణిపూర్‌ ఘటనలను నిరసిస్తూ మండల కేంద్రం రొంపిచర్లలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శన చేశారు. చెరువు కట్ట సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు సిఐటియు నాయకులు ఎస్‌.వెంకటశ్వరరాజు అధ్యక్షత వహించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ మణిపూర్‌లో మూణ్ణెల్లుగా జరుగుతున్నా అఘాయిత్యాలు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సృష్టించినవేనని మండిపడ్డారు. 200 మందికి పైగా చనిపోయారని, వందల మంది క్షతగాత్రులయ్యారని, వందల గ్రామాలు తగలబెట్టారని, 200 పైగా క్రైస్తవ చర్చీలు తగులబెట్టారని విమర్శించారు. మహిళలను అత్యాచారం చేసి నగంగా ఊరేగించడం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. అయినా వీటిపై పార్లమెంట్‌లో చర్చించడానికి బిజెపి సిద్ధంగా లేదన్నారు. ఈ ఘటనలపై ప్రధాని మోడీ నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రొంపిచర్ల మండల పాస్టర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ప్రభుదాసు, వడ్లమూడి వారి పాలెం చర్చి పాస్టర్‌ వేముల శామ్యూల్‌, వైసిపి యువజన విభాగం జిల్లా నాయకులు పడాల శివారెడ్డి, సిఐటియు జిల్లా నాయకురాలు డి.శివకుమారి, రొంపిచర్ల చర్చి పాస్టర్‌ జాన్‌ వెస్లీ, బీఎస్పీ జిల్లా నాయకులు భూదాల బాబురావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, రైతు సంఘం జిల్లా నాయకులు బి.నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.బాలకో టయ్య, పౌలురాజ్‌ పాస్టర్‌ పాల్గొన్నారు.