Jul 22,2023 21:07

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
       మణిపూర్‌ అల్లర్లలో మహిళలను నగంగా ఊరేగించి అమానుషంగా ప్రవర్తించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమావతి, నేత జె.హరీషాదుర్గ మాట్లాడుతూ అందరూ తలదించుకునేలా అత్యంత పాశవికంగా మణిపూర్‌లో మతోన్మాద మూకలు మహిళలను నగంగా ఊరేగించడాన్ని తీవ్రంగా ఖండించారు. 78 రోజులుగా ఆ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతుంటే కేంద్రం, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా ఉండేలా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు గాళ్ల శారద, బి.జయలక్ష్మి, టి.రజిని, టి.సుకన్య, స్వర్ణలత, హేమ, ఆంథోనమ్మ, వెంకమ్మ, సిఐటియు నాయకులు పి.కిషోర్‌, ఎం.శ్రీనివాసరావు, బి.జగన్నాధరావు, జి.సురేష్‌ పాల్గొన్నారు.
నూజివీడు : మణిపూర్‌లో ఘోరకలిని నిరసిస్తూ స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌ లో సిఐటియు, ఐద్వా, యుటిఎఫ్‌, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు జి.రాజు, ఎన్‌ఆర్‌.హనుమనులు, ఐద్వా నేతలు నండూరి పద్మాంజలి, పుట్టి కమల, యుటిఎఫ్‌ నాయకులు జి.వెంకటేశ్వరరావు, మార్ష, ప్రజాసంఘాల నేతలు దుర్గారావు, నాగమణి, రాధాకుమారి, నాగలక్ష్మి, పావని, కుమారి, అనూరాధ, రమ, విజయ, వసంతరావు, శోభనాద్రి, రామకృష్ణ పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : మణిపూర్‌లో హింసాత్మక ఘటనలకు నిరసనగా సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యాన నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ సెంటర్లో ఎఐకెఎంఎస్‌ జిల్లా నాయకులు కారం రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోరండ్ల శ్రీనివాస్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర కోశాధికారి కెవి.రమణ, రాష్ట్ర నాయకులు ఎస్‌.రామ్మోహన్‌, ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు వెట్టి సుబ్బన్న, పిఒడబ్ల్యు జిల్లా నాయకులు వెట్టి భారతి, కారం లక్ష్మి, పివైఎల్‌ నాయకులు తగరం బాబురావు, కె.పోతురెడ్డి, పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాషా శ్యాంబాబు, పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్‌ మాట్లాడారు.
పోలవరం : మణిపూర్‌ ఘటనలకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ గిరిజన సంఘం, ఎపి రైతు కూలీ సంఘం ఆధ్వర్యాన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏటిగట్టు సెంటర్‌ వద్ద నిరసన ర్యాలీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నేతలు కుంజం రామారావు, షేక్‌ భాషా, మాట్లాడగా సవలం రాంబాబు, మిడియం రవి దొర నాయకత్వం వహించారు.