Jul 24,2023 21:14

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
         జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన అరాచకవాదుల చర్యలు నిరసిస్తూ సోమవారం స్థానిక కొత్త బస్టాండ్‌ సెంటర్‌ వద్ద నిరసన చేపట్టారు. కార్యక్రమానికి ఒవి.ధనుంజయరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ఎన్‌.రమేష్‌ మాట్లాడుతూ మణిపూర్‌ ఘటనలను ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలన్నారు. మణిపూర్‌లోని సహజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లను ప్రోత్సహించి జాతుల ఘర్షణగా చిత్రీకరించడానికి ప్రయత్నించిందని విమర్శించారు. ఇటువంటి ఘటనలు వందల కొద్దీ జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని, చేతగానితమని అన్నారు. జెవివి నాయకురాలు దుర్గాంబ మాట్లాడుతూ ఈ దేశంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవి.సుధాకర్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీ 78 రోజుల వరకు ఈ సంఘటనపై నోరు మెదపలేదని, ఈ వీడియో కనుక బయటికి రాకుండా ఉండుంటే ఏమాత్రం స్పందించేవారు కాదని విమర్శించారు. కార్యక్రమంలో బోడెం శ్రీనివాస్‌, మోహన్‌రావు, దేవేంద్ర, కృష్ణారావు, సుభాషిణి, రామాంజనేయులు, నారాయణరావు, గంగాధర్‌రావు, సాయిరమేష్‌, కాకర్ల రాజేంద్రప్రసాద్‌, సుందరయ్య, మావూరి శ్రీనివాస్‌, దొర, విజయలక్ష్మి, పద్మావతి, రామ్మోహన్‌ పాల్గొన్నారు.
చింతలపూడి: మణిపూర్‌ ఘటనలకు బాధ్యత వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామాలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌విఎస్‌.నారాయణ, ఐద్వా జిల్లా నేత ఎం.లక్ష్మీదేవి డిమాండ్‌ చేశారు. పట్టణంలో సిఐటియు, ఐద్వా ఆధ్వర్యంలో ప్రదర్శన, నిరసన చేపట్టారు. తొలుత ప్రజాసంఘాల కార్యాలయం నుండి బోస్‌ బొమ్మ సెంటర్‌ వరకూ ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు ఎం.బాలరాజు, కె.అనురాధ, ఎస్‌డి.జఫ్రుల్లా, డి.సత్తిబాబు, పి.పాండురంగారావు పాల్గొన్నారు.
మణిపూర్‌ ఘటనలకు నిరసిస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో చింతలపూడి పోలీసులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌కె.ఆజాద్‌ మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యాచారాలు హేయమైన చర్యని అన్నారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు ఎస్‌కె.అమీర్‌పాషా, జిన్నా, కిషోర్‌, అజరు, ముత్తేశ్వరరావు, రజిని, కృపావరం, లక్ష్మణ్‌, ప్రతాప్‌, సురేష్‌, సంజరు, అశోక్‌ వర్ధన్‌, దాసు పాల్గొన్నారు.
ముసునూరు:మణిపూర్‌ ఘటనలు అత్యంత బాధాకరమని సిపిఐ (ఎంఎల్‌) మండల కార్యదర్శి వేమల బక్కయ్య అన్నారు. సోమవారం రమణక్కపేటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో నందిపాము చిట్టిమ్మ, దారా బేబిషాలిని, గంటాంటి లహారిక, ఆముదాల పుష్పలత, ఉయ్యూరు విజయలక్ష్మి, ఆముదాల పార్వతి పాల్గొన్నారు.
ఏలూరు టౌన్‌: మణిపూర్‌ ఘటనలకు కారకులపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ పాస్టర్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రెటరీ రెవరెండ్‌ ఫాదర్‌ పి.జీవన్‌ కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఇండియన్‌ దళిత క్రిస్టియన్‌ రైట్స్‌ అధ్యక్షులు పేరికె వరప్రసాద్‌ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాలక ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు మున్నుల జాన్‌ గురునాథ్‌, రాష్ట్ర దళిత జెఎసి కన్వీనర్‌ పొలిమేర హరికృష్ణ, ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ విజిలెన్స్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ సభ్యులు అబ్రహం మాట్లాడారు. అనంతరం శాంతి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌లో డిఆర్‌ఒకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పాస్టర్లు రత్న ప్రసాద్‌, ఎన్‌ఎల్‌.పాల్‌, సభ్యులు పాల్గొన్నారు.