Sep 18,2023 00:05

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న అల్లర్లను, దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని సిఐటియు రాష్ర్ట నాయకులు వై సిద్దయ్య పిలుపు నిచ్చారు. మండలంలోని గంగవరం శ్రీమంచాల రంగయ్య, రమణమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తుందన్నారు. అక్కడున్న క్రైస్తవులు, గిరిజనులపై దాడులు చేసి అక్కడి నుండి తరిమేస్తే అక్కడున్న ఖనిజ సంపద కార్పోరేటర్లకు కట్టబెట్టేందుకు కేంద్రం పన్నాగం పన్నిందన్నారు. ఈ పాటికే అందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారని అన్నారు. రైతు  సంఘం రాష్ర్ట అధ్యక్షులు వలేటి కృష్ణయ్య మాట్లాడుతూ మణిపూర్‌లో దారుణ హింసకు పాల్పడిన బిజెపికి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దాడులు, అల్లర్లు చెలరేపేందుకు బిజెపి పన్నాగం పన్నిందన్నారు. భారత దేశంలో అందరూ సమానంగా జీవించే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిందన్న సంగతి గుర్తు చేశారు. సమావేశానికి రైతు సంఘం నాయకులు కందిమళ్ళ రామకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో అంజిరెడ్డి, ప్రసాద్‌, మార్కు, లింఖన్‌, అంజయ్య, రవి, ప్రేమ్‌చంద్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాసు, కొర్నేలు, సుబ్బారావు, హనుమంతరావు పాల్గొన్నారు.