Jul 27,2023 23:34

సమావేశంలో మాట్లాడుతున్న గద్దె చలమయ్య

ప్రజాశక్తి-సత్తెనపల్లి : మణిపూర్‌లో స్త్రీలను నగంగా ఊరేగించడాన్ని ప్రజలంతా తీవ్రంగా ఖండించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య పిలుపునిచ్చారు. స్థానిక పుతుంబాక భవన్‌లో గురువారం జరిగిన సిపిఎం పట్టణ కమిటీ సమావేశానికి కట్ట శివదుర్గరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చలమయ్య మాట్లాడుతూ మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లకు బిజెపియే బాధ్యత వహించాలన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకే ఏకరూప పౌరస్మృతి బిల్లును తెస్తోందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇది సరైనది కాదని, దేశ సమైక్యతకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. దీనికి బదులుగా దేశంలో పేదరికం నిర్మూలించేందుకు, మహిళలకు సమానమైన హక్కులు కల్పించేందుకు, ఆర్థిక, సామాజిక, మహిళా సమానత్వాన్ని సాధించేందుకు ప్రయత్నం చేయాలని హితవు పలికారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ సత్తెనపల్లి బైపాస్‌ రోడ్డు నిర్మాణం భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్రస్తుతం జరుగుతున్న వాస్తవమైన కొనుగోలు అమ్మకాలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రేట్లు తీవ్ర అన్యాయంగా ఉన్నాయని, కలెక్టరు రైతులను ప్రత్యక్షంగా సంప్రదించి రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయ నాయక్‌, పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు ఎ.వీరబ్రహ్మం, ప్రభాకర్‌, బి.భాస్కరరావు, జె.రాజ్‌కుమార్‌,షేక్‌ సైదులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మణిపూర్‌ ఘటనపై మండల కేంద్రమైన రొంపిచర్లలోని చెరువుకట్ట సెంటర్లో గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎస్‌.తిమ్మరాజు మాట్లాడుతూ మహిళలను నగంగా ఊరేగించిన ఘటనకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆ రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. కార్యక్రమంలో ఎం.వెంకటేశ్వరరావు, అంజయ్య, చౌడయ్య, పి.రామిరెడ్డి పాల్గొన్నారు.