ప్రజాశక్తి-సాలూరు : మణిపూర్‌లో మారణ హోమానికి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానిదే బాధ్యతని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవా ధ్యక్షులు సీదరపు అప్పారావు చెప్పారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమో దించిన నూతన అటవీ విధానంతో దేశంలో ఉన్న గిరిజన తెగలకు తీరని నష్టమన్నారు. గిరిజనుల అనుమతి లేకుండా కార్పొరేట్‌లకు అడవులను అప్పగించడానికి అవకాశం కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం చేపట్టే మన్యం బంద్ విజయవంతం చేయాలని కోరారు.
మణిపూర్‌లో గడచిన మూడు నెలలుగా కుకీ, నాగా గిరిజన తెగలపై స్థానిక బిజెపి ప్రభుత్వం అండతో జరుగుతున్న హింసాకాండ దారుణమన్నారు. గిరిజన మహిళలను నగంగా ఊరేగింపు మొదలుకొని ఎంతోమంది గిరిజనులను కిరాతకంగా హత్య చేసిన సంఘటనలు ఆ రాష్ట్రంలో జరిగాయని చెప్పారు. హింసాకాండకు బాధ్యుడిని చేస్తూ మణిపూర్ సిఎం బీరేంద్ర సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు వంతల సుందరరావు, కార్యదర్శి గెమ్మెల జానకీరావు పాల్గొన్నారు.
కురుపాం : మన్యం బంద్‌కు సహకరించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి పి.తిరుపతిరావు కోరారు. బుధవారం కురుపాంలో దుకాణాల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ బంద్‌కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు పి.మోహనరావు, కె.సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.










