Jul 28,2023 23:12

చీడికాడలో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:మణిపూర్‌లో జరిగిన మారణకాండపై భారత విద్యార్థి ఫెడరేషన్‌( ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో శివపురం, ఐదు రోడ్లు జంక్షన్‌ వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. మణిపూర్‌లో మహిళలకు రక్షణ కల్పించాలని, శాంతి భద్రతలు కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్‌ ఎం.రమణ మాట్లాడుతూ, మణిపూర్‌లో శాంతిభద్రత నెల కొల్పడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం అత్యాచారాలు జరుగుతుంటే చూసీచూడనట్టు చూడటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సెక్రెటరీ ఎస్‌.రమణ, డివిజన్‌ సెక్రెటరీ గీతాకృష్ణ, డివిజన్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
చీడికాడ:మణిపూర్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు నేత ఆర్‌.దేముడు నాయుడు డిమాండ్‌ చేశారు. మండలంలోని అప్పలరాజుపురం గ్రామంలో శుక్రవారం నిరసన నిర్వహించారు. ఈ సందరభంగా సిఐటియు నేత దేవుడు నాయుడు, మండల అంగన్వాడి యూనియన్‌ నాయకురాలు మేడపరెడ్డి జానకిలు మాట్లాడుతూ, మణిపూర్‌లో మహిళలపై సామూహిక అత్యాచారాలు, నగ ప్రదర్శన, చంపేయడం వంటి ఘటనలు చాలా దారుణ మన్నారు. యావత్‌ దేశం సిగ్గుతో తలదించుకునే విధంగా ఈ ఘటనలు ఉన్నాయన్నారు.హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘ విద్రోహ శక్తులపై బిజెపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయమన్నారు. దీని వెనుక ఉన్న మైనింగ్‌ మాఫియా, కార్పొరేట్‌ కంపెనీలు ఉన్నాయని తెలిపారు.ఇప్పటికైనా గిరిజన మహిళలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు జానకి రాజులమ్మ, చిన్నమ్మలు, రవణమ్మ, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
తగరపువలస:మణిపూర్‌లో కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న అకృత్యాలను నిరసిస్తూ సిపిఎం భీమిలి జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జంక్షన్‌లో నిరసన చేపట్టారు.పార్టీ జోన్‌ కార్యదర్శి రవ్వ నరసింగరావు మాట్లాడుతూ, మణిపూర్‌లో అల్లర్లు రోజురోజుకూ పెరుగుతుంటే, వాటిని అరికట్టాల్సిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు.కార్యక్రమంలో పలువురు పార్టీ కార్య ర్తలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.