వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచుకునే హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఏ పౌరుని వ్యక్తిగత డేటానైనా తెలుసుకోవాలంటే అందుకు చట్టపరమైన ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా సుప్రీం కోర్టు చెప్పింది. కాని మోడీ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత డిజిటల్ గుర్తింపు (ఆధార్, పాన్ నెంబర్ వంటివి) తప్పనిసరిగా అనుసంధానం చేస్తేనే వివిధ ప్రభుత్వ సేవలు గాని, ప్రభుత్వ రంగ సంస్థల సేవలు కాని అందుతాయని షరతులు విధించింది. ఆ విధంగా పౌరుల నుండి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అందజేసి తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోడానికి తోడ్పడుతోంది.
గతంలో ఎన్నడూ లేనంతగా నేడు సంబంధాలు పెరిగి మనుషులు దగ్గరౌతున్నారు. ప్రపంచ జనాభాలో 60 శాతం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయివున్నారు. స్మార్ట్‌ఫోన్లు చౌకగా లభించడం, నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల విస్తీర్ణం పెరగడంతో మన దేశంలో 70 శాతం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయివున్నారు. మనలో చాలామంది ఇంటర్నెట్ తో కనెక్ట్ అయివున్నాం అనుకుంటున్నా, నిజానికి ఎక్కువమంది కనెక్ట్ అయివున్నది గూగుల్ తో గాని ఫేస్‌బుక్ తో గాని మాత్రమే. ఈ రెండు డిజిటల్ సంస్థలే గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి. తన స్వంత ఇంటర్నెట్ తో మన దేశంలో ప్రజలందరినీ అనుసంధానం చేసి పట్టుబిగించాలని ఫేస్‌బుక్ 'ఫ్రీ బేసిక్స్' అనే ఒక మరుగుజ్జు నెట్‌వర్క్‌ను మనకి అంటగట్టడానికి ప్రయత్నించింది. ఐతే, ప్రజల సమిష్టి ప్రతిఘటనతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఐతే వేరే 65 దేశాలలో ఫేస్‌బుక్ తన ఫ్రీ బేసిక్స్ ను ప్రవేశపెట్టడంలో జయప్రదం కాగలిగింది. ఇది విచారకరం. ఆ నెట్‌వర్క్‌ను ఉపయోగించేవారంతా ఫేస్‌బుక్ అంటేనే ఇంటర్నెట్ అనే భ్రమలో ఉన్నారు.
వాడకందారులను ఆకట్టుకుని వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో గూగుల్ కి, ఫేస్‌బుక్‌కి ఉన్న సామర్ధ్యం వల్లనే ఆ రెండు సంస్థలూ వాణిజ్య ప్రకటనల ప్రపంచంలో ఆధిపత్యాన్ని కలిగివున్నాయి. టి.వి, ప్రింట్, రేడియో మాధ్యమాలన్నీ కలుపుకున్నా రానంత యాడ్ ఆదాయం ఒక్క డిజిటల్ రంగమే సంపాదించగలుగుతోంది. ఇందులో గూగుల్, ఫేస్‌బుక్-ఈ రెండే గుత్తాధిపత్యం కలిగివున్నాయి. యాడ్ ఆదాయం మీద ఆధారపడి నడిచే తక్కిన మీడియా ప్రపంచానికి ఇది ప్రమాదకరంగా తయారైంది. అందుకే అమెరికాలో, బ్రిటన్‌లో, యూరోపియన్ యూనియన్ దేశాల్లో గూగుల్, ఫేస్‌బుక్ ల గుత్తాధిపత్యాన్ని బద్దలుచేసేలా నియంత్రణ, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఐతే భారతదేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం ఈ రెండు సంస్థల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి సుముఖంగా లేదు. ఈ మధ్య సోఫీ జాంగ్, ఫ్రాన్సెస్ హాజెన్ అనే ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగులు ఈ రెండు గుత్త సంస్థలూ మనదేశంలో పాలక పార్టీల కొమ్ము కాస్తూ మైనారిటీలకు, ఇతరులకు వ్యతిరేకంగా ప్రమాదకరమైన విద్వేషపూరిత ప్రచారాన్ని సాగించిన వైనాలను బహిర్గతం చేశారు. మన ప్రభుత్వం అమెరికాతో అంటకాగే విధానం పాటిస్తున్నందు వల్లను, ఈ సంస్థలు తమకు అనుకూలంగా పోషిస్తున్న పాత్ర వలన కూడా మోడీ వాటి పట్ల మెతకగా, సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.
దీనితోబాటు, ప్రభుత్వం దేశ పౌరుల నుండి సేకరించిన వ్యక్తిగత డేటాను వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించడానికి దోహదం చేసే వ్యవస్థలను రూపొందించడానికి పూనుకుంటోంది. దేశ పౌరులకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది (జనాభా లెక్కల సేకరణ వంటి చర్యల ద్వారా). ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం పౌరులుగా మన బాధ్యత. దానితోబాటు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి గాను కొంత సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వీలు కల్పించేలా ప్రభుత్వం డేటా రక్షణ చట్టాన్ని రూపొందించింది.
వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచుకునే హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఏ పౌరుని వ్యక్తిగత డేటానైనా తెలుసుకోవాలంటే అందుకు చట్టపరమైన ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా సుప్రీం కోర్టు చెప్పింది. కాని మోడీ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత డిజిటల్ గుర్తింపు (ఆధార్, పాన్ నెంబర్ వంటివి) తప్పనిసరిగా అనుసంధానం చేస్తేనే వివిధ ప్రభుత్వ సేవలు గాని, ప్రభుత్వ రంగ సంస్థల సేవలు కాని అందుతాయని షరతులు విధించింది. ఆ విధంగా పౌరుల నుండి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అందజేసి తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోడానికి తోడ్పడుతోంది. ఇప్పటికే టెలికాం కంపెనీల, బ్యాంకుల సేవలు పొందాలంటే ఆధార్ ఏవిధంగా తప్పనిసరి అయిపోయిందో మనం చూస్తున్నాం. ఆ సమాచారం బడా వ్యాపార సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ప్రయాణాలకు ఆరోగ్యసేతు యాప్‌ను, హెల్త్ ఐ.డి ని తప్పనిసరి చేశారు. ఆ విధంగా వచ్చే సమాచారాన్ని ఇన్సూరెన్స్ సంస్థలు, కార్పొరేట్ వైద్య సంస్థలు తమ వ్యాపారం కోసం వినియోగించుకోగలుగుతాయి. వ్యాక్సినేషన్ కోసం మనం గనుక 'కో-విన్' యాప్ ను వాడివున్నట్టయితే మన ఆమోదంతో నిమిత్తం లేకుండానే మనకొక హెల్త్ ఐ.డి కేటాయించి వుంటారు. ఇప్పటికే దాని ద్వారా మన సమాచారం ఇన్సూరెన్స్ కంపెనీలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు చేరిపోయి వుంటుంది. ఆధార్ కార్డు ఇవ్వడం కోసం మనవద్దనుండి ఏవిధంగా సమాచారం సేకరించారో, అదే విధంగా ఇతర సందర్భాలలోనూ సేకరిస్తూ దానిని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అందజేస్తోంది. ఉదాహరణకు, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు మన ఆనుమతి లేకుండానే మన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాని ఆధారంగా మనకు ఇన్సూరెన్స్ డబ్బుల్ని ఎగనామం పెట్టొచ్చు. అలా ఎగ్గొట్టడానికి ఆ ఇన్సూరెన్స్ పాలసీలో రాసివున్న (మనకు అర్ధంకాని, లేదా మనకు ముందుగా వివరించని) నిబంధనలను సాకుగా చూపుతారు. మన ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపించి మన ఉద్యోగాలకు యజమాని ఎసరు పెట్టవచ్చు.
ఈ విధమైన వ్యాపార ప్రయోజనాలకు మన డేటాను వాడుకోడాన్ని చట్టబద్ధం చేయడమే గాక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నేర పరిశోధనా సంస్థలు కూడా మన వ్యక్తిగత సమాచారాన్ని మనకు తెలియకుండా ఉపయోగించుకోడానికి వీలు కల్పిస్తోంది మోడీ ప్రభుత్వం రూపొందించిన డేటా బిల్లు. అత్యయిక పరిస్థితి విధించిన కాలంలో 'మీసా' చట్టం అమలులో ఉండేది. ఆ చట్టం కింద నిర్బంధించబడినవారి ఉనికిని తెలియజేయాలని కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటికి వ్యతిరేకంగా వాదిస్తూ నిరేన్ డే అనే ప్రభుత్వ లాయరు అత్యయిక పరిస్థితుల్లో పౌరులకు జీవించే హక్కు ఉండదని చెప్పారు. ఇప్పుడు ఆ విషయం గుర్తుకొస్తోంది. పౌరులకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుంది కాని ప్రభుత్వ పరిశోధనా సంస్థల నుండి సమాచారాన్ని గోప్యంగా ఉంచే హక్కు ఉండదన్నమాట.
మన డేటాను ఏవిధంగా దుర్వినియోగం చేయవచ్చో తెలియజేసే ఒక ఉదాహరణ ఇది: సమాచార హక్కు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జమ్ము, కాశ్మీర్ లోని కుల్గాం లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆరోగ్యసేతు లో తన వద్ద ఉన్న పౌరుల సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేశాడు. ఆ పౌరులపై పోలీసుల నిఘా ముమ్మరం చేయడానికి ఆ సమాచారం తోడ్పడింది. ఈ విధంగా మనకు తెలియకుండా మన వ్యక్తిగత జీవితం మీద ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మనం ఇచ్చిన డేటానే వినియోగించడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా ?
ప్రస్తుతం ఉన్న డిజిటల్ నిఘా వ్యవస్థ పరిధిలోనే మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వ పరిశోధనా ఏజన్సీలకు అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టెలికాం సర్వైలెన్స్, ఇంటర్నెట్ నిఘా కోసం 'నెట్రా', జాతీయ నిఘా సమాచార వ్యవస్థ గ్రిడ్ (నాట్‌గ్రిడ్), నేషనల్ గ్రిడ్ ఆఫ్ సర్వైలెన్స్ డేటా బేసెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్) - ఇందులో డిఎన్ ఎ, ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్స్, పుట్టుమచ్చలు, తదితర వ్యక్తిగత గుర్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చట్టపరంగానే మన అనుమతి లేకుండా మన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
ఇజ్రాయిల్ దేశపు నిఘా వ్యవస్థ ఎన్‌ఎస్‌వో సైనికావసరాల నిమిత్తం ఉపయోగించే గూఢచర్యపు సాధనాలను రూపొందించింది. దానిని మన ప్రభుత్వం ఉపయోగించి వాటి ద్వారా చట్టవిరుద్ధంగా మన మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తోంది. పాత్రికేయులు, ప్రజా జీవితంలో ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు, ఆఖరుకు న్యాయమూర్తులను సైతం విడిచిపెట్టడం లేదు. ఈ విధంగా హ్యాక్ అయిన ఫోన్ నంబర్ల వివరాలను ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారించే సందర్భంలో సుప్రీం కోర్టుకు నివేదించడం జరిగింది కూడా. ఐతే అందుకు సంబంధించి ఏ వివరాలనూ సుప్రీం కోర్టుకు తెలియజేయడానికి ప్రభుత్వం నిరాకరించింది. అలా నిరాకరించడం ద్వారా నిఘా సంస్థలు పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నాయని ప్రభుత్వమే అంగీకరించినట్టైంది. గతంలో నిరేన్ డే ప్రకటించిన వైఖరినే ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకుంది.
ఉద్యోగుల కార్యకలాపాలను మానిటర్ చేసే యాప్ లను ఆ ఉద్యోగుల ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హర్యానాలో అంగన్వాడీ ఉద్యోగులు ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటారో సూచించే యాప్ ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. పాంచ్‌కులా లో మునిసిపల్ వర్కర్ల ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవలసిన యాప్ వారి కదలికలనే గాక వారి మాటలను సైతం రికార్డు చేస్తుంది. ఇవన్నీ ఆ కార్మికుల, ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతకు భంగకరమే. ఆ విధంగా ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించే అధికారాన్ని ఇవ్వడం ద్వారా మోడీ ప్రభుత్వం కార్మికుల గోప్యతకు భంగం కలిగించడమే గాక వారి భద్రతకు సైతం ముప్పు తెచ్చిపెడుతున్నది.
పుత్తుస్వామి కేసులో సుప్రీం కోర్టు వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చింది. ప్రభుత్వం అతిగా వ్యవహరించి వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించకుండా ఏవిధంగా చట్టబద్ధంగా కట్టడి చేయాలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక విశదం చేసింది. అంతేగాక వ్యక్తుల డేటా పొందిన ప్రైవేటు సంస్థలు ఆ డేటాను ఏ యే పరిమితులకు లోబడి ఉపయోగించాలో ఆ పరిధులను కూడా ఆ కమిషన్ రూపొందించింది.
2019లో ప్రభుత్వం వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లును తెచ్చింది. ఇప్పుడు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తుది రూపు తీసుకుంటోంది. ఈ బిల్లు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా పరిరక్షించే విషయంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఆ సమాచారాన్ని ప్రభుత్వ నిఘా ఏజన్సీలు గాని, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు గాని దుర్వినియోగం చేయడాన్ని కూడా ఈ బిల్లు నిరోధించలేదు. జస్టిస్ శ్రీకృష్ట తో సహా పలువురు న్యాయ నిపుణులు ఈ బిల్లులో ప్రభుత్వానికి కల్పించిన విస్తృత అధికారాలను తప్పు పడుతున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలోని సభ్యులు సైతం ఈ విషయంలో తమ వ్యతిరేకతను ప్రకటించారు. ఇటువంటి అడ్డూ, ఆపూ లేని అధికారాలను కల్పించడం వలన పౌరుల వ్యక్తిగత సమాచారగోప్యత అపహాస్యం పాలౌతుంది.
ప్రభుత్వ సంస్థల నిఘా తీరుతెన్నులను న్యాయ వ్యవస్థ ద్వారా కాని, పార్లమెంటు ద్వారా కాని సమీక్షించే ఏర్పాటు ఏదీ ఈ బిల్లులో ప్రతిపాదించలేదు. తాము ప్రతిపాదించిన నిబంధనలను వేటినీ ఈ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదని జస్టిస్ శ్రీకృష్ణ ప్రకటించారు. ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే మన రాజ్యం ఒక నియంతృత్వ రాజ్యంగా దిగజారుతుందని ఆయన ప్రకటించారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ లోని ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే ఈ బిల్లులోని ప్రతికూల అంశాలపై తమ అభ్యంతరాలను వెల్లడి చేశారు. ఇక అభ్యంతర పెట్టవలసినది ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులే. ఒక నిఘా రాజ్యాన్ని ఏర్పాటు చేసి మన వ్యక్తిగత గోప్యతకు ఎసరు పెడుతున్న ఈ బిల్లును ప్రతిఘటించడానికి అధిక సంఖ్యలో ప్రజాస్వామిక శక్తులన్నీ కదలాలి.
( స్వేచ్ఛానుసరణ )
ప్రబీర్ పురకాయస్థ











