Jun 05,2022 09:33

కీర్తి జల్లి ఐఏఎస్‌... ఇప్పుడు ఈ పేరు, ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సివిల్స్‌ ర్యాంకులు వచ్చాయి.. ఆ ర్యాంకులు వచ్చినప్పుడు చెప్పే మాటలను ఆచరణలో పెట్టే అతి కొద్దిమందిలో కీర్తి ఒకరు. నిజమైన ప్రజాసేవకురాలు కీర్తి. ప్రస్తుతం అసోంలో కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారు. గతంలోనూ ఆమె 'కీర్తి' గురించి విన్నాం. ఈమె మన తెలుగమ్మాయి కావడం గర్వకారణం. వివరాల్లోకి వెళితే..
కీర్తి జల్లి స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌. వరంగల్‌ జిల్లాకు చెందిన ఈమె 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు. ఆమె తండ్రి జల్లి కనకయ్య న్యాయవాది కాగా, తల్లి వసంత గృహిణి. 2011లో బీటెక్‌ పూర్తి చేసి, ఢిల్లీలో ఐఏఎస్‌ పరీక్షలకు కోచింగ్‌ తీసుకున్న కీర్తి రెండేళ్లు కష్టపడి చదివాక 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంక్‌, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు... శిక్షణ అనంతరం అసోంలో కలెక్టర్‌గా విధుల్లో చేరారు. వరదల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలిస్తూ, సమీక్షలు జరిపే అధికారులే మనకు ఎక్కువగా తెలుసు. కానీ కీర్తి జల్లి తానే స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకుం టున్నారు. అంతేకాకుండా, వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
మోకాళ్ల లోతు వరదలో..
సాధారణ చీరకట్టులో, మోకాళ్ల లోతు బురద నీటిలో ఆమె ఇంటింటికి తిరుగుతూ వరద బాధితులను పరామర్శిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అంతేకాదు వారి సమస్యలను అడిగి, తెలుసుకుంటున్నారు. నిరాశ్రయులను స్వయంగా పడవపై పునరావాస కేంద్రాలకి తరలించారు. ఓ గ్రామంలో ప్రజలు ఆమె కలెక్టర్‌ అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వరదలు రావడం తమకు కొత్తేమీ కాదని, వరదలు వచ్చినప్పుడు కలెక్టర్‌ రావడమే తమకు కొత్తగా ఉందని అక్కడి ప్రజలు చెప్తున్నారు.
ఓటుపై చైతన్యం..
అసోం అసెంబ్లీ ఎన్నికల సమయం (2016) లో అక్కడి ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునే దిశగా వినూత్నపద్ధతిలో ప్రోత్సహించారు. 'భోని' అనే బొమ్మలను తయారుచేయించి, పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఉంచారు. అసోంలో చిన్న చెల్లెలిని 'భోని' అంటారు. అసోం సంస్కృతిలో చిన్న చెల్లెలికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వారి సెంటిమెంట్‌ను పసిగట్టిన కీర్తి జల్లి 'భోని' బొమ్మల సాయంతో సత్ఫలితాలు రాబట్టారు. ఆమె ప్రయత్నం ఫలించి, మహిళా ఓటర్లు గణనీయ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. కీర్తి ప్రయత్నం ఎన్నికల సంఘాన్నీ ఆకట్టుకుంది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఆమెకు 'బెస్ట్‌ ఎలొక్టరల్‌ ప్రాక్టీసెస్‌' అవార్డు అందించారు.
స్త్రీ-శిశు సంక్షేమం గురించి..
కీర్తి హైలాకండి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో స్త్రీలు, చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించారు. అందుకే వాటిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉసిరి, బెల్లం కలిపిన ఉసిరి మురబ్బా తయారుచేయించి, మహిళలకు పంపిణీ చేశారు. కీర్తి జల్లి ప్రయత్నం ఫలించి, వారి ఆరోగ్యం మెరుగుపడింది. ఇవే కాదు, కీర్తి ఉద్యోగ ప్రస్థానంలో ఇలాంటివి ఎన్నో. ఆమెకు ఉద్యోగం పట్ల గొప్ప నిబద్ధత ఉంది. అది ఎంతగా అంటే.. కనీసం తన పెళ్లి రోజున కూడా ఆమె సెలవు పెట్టలేనంత.