Nov 04,2022 23:38

ప్రజాశక్తి - పెనమలూరు : పెనమలూరు గ్రామం వద్ద నిర్వహిస్తున్న 'మనగ్రామం' సహజ ఉత్పత్తుల కేంద్రాన్ని శుక్రవారం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందర్శించారు. స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో పండించిన ఉత్పత్తులను, తయారైన వంటకాలను అందిస్తున్న మువ్వా రామకృష్ణ, మాధవిలత కుటుంబ సభ్యుల అంకిత భావానికి అభినందనలు తెలిపారు. ప్రకృతి వంటకాలవైపు ఆకర్షితులయ్యేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మనగ్రామం కేంద్రం ద్వారా ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందిస్తున్నారని, కొన్ని పత్రికలలో చదివి తెలుసుకుని ఈ కేంద్రాన్ని సందర్శించాలనే కోరిక కలిగిందని అన్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తుల దిగుబడి తక్కువగా ఉండడం వల్ల సహజసిద్ధ ప్రకృతి ఉత్పత్తుల ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఆరికలు, సాములు, ఊదలు వంటి చిరుధాన్యాలతో తయారైన వంటలపై మక్కువ పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనగ్రామం నిర్వహకులు మువ్వా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.