
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి మారుమూల పల్లెకు సైతం ఆర్‌టిసి సర్వీసులు విస్తరించి విశేష సేవలను అందిస్తోంది. ఇటీవల విజయవాడ బస్టాండ్, అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ప్రమాదాల గురించి తెలిసిందే. జిల్లాలోనూ తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. సమయపాలన ఉండదు. వేళకు సరిగ్గా బస్సులు రావు అన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. జిల్లాలో బస్సుల కండీషన్ కూడా ఆందోళనకరంగా ఉంది. గమ్యానికి చేరే వరకూ సందేహమే. పల్లెవెలుగు బస్సుల తీరు మరీ దయనీయంగా మారింది. స్టూడెంట్స్ స్పెషల్ బస్సుల తీరు చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా కాలం చెల్లినవే కనిపిస్తున్నాయి. మరోవైపు పట్టణాలు, పల్లెలు, అంతర్ రాష్ట్ర, జిల్లా రహదారులని తేడా లేకుండా గోతులమయంగా మారాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రశాంతంగా గమ్యానికి చేరుతామా? అనే సందేహం ప్రయాణీకులలో వ్యక్తమవుతోంది.
జిల్లాలో 306 బస్సులు
జిల్లాలో రాజమహేంద్రవరం, నిడదవోలు, గోకవరం, కొవ్వూరు ఆర్‌టిసి డిపోలు ఉన్నాయి. ఈ నాలుగు డిపోల నుంచి అంతర్ రాష్ట్ర, జిల్లా సర్వీసులతోపాటు గ్రామీణ సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 306 బస్సులు సేవలందిస్తున్నాయి. సుమారు 70 గ్రామీణ సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో చాలా వరకూ కాలం చెల్లినవే అనే విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన తరువాత బస్సులను నిలిపివేయాలి. 12 నుంచి 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కాలం చెల్లినవిగా భావించి పక్కన పెట్టాలి. సాధారణంగా సుపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు రెండు రోజులకు సగటున 1,500 కిలోమీటర్లు వరకూ తిరుగుతాయి. విజయవాడ, భద్రాచలం, విశాఖపట్నం సర్వీసు బస్సులు నెలకు 20 వేల కిలోమీటర్లపైగా ప్రయాణిస్తాయి. అలాగే గ్రామీణ సర్వీసులు రోజుకు సగటున 300 కిలోమీటర్ల మేర తిరుగుతాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా వీటి స్థానంలో కొత్తవి రాకపోవడంతో అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. పల్లెవెలుగు సర్వీసులు పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నాయి. గేర్లు పడకపోవడం...గేర్లు వేస్తున్నప్పుడు భారీగా శబ్దాలు రావడం, ప్రయాణికులతో వెళ్తున్నప్పుడు మొరాయించడం వంటివి జరుగుతున్నాయి. చాలా బస్సులకు 'సెల్ఫ్' సమస్య ఉంది. ఎక్కడ మొరాయించినా ప్రయాణికులు నెట్టాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి.
కానరాని నిబంధనలు
ఆర్‌టిసి కొత్త బస్సులను సూపర్ లగ్జరీ, డీలక్స్‌లుగా వినియోగిస్తారు. 7 లక్షల కిలోమీటర్లు తిరిగిన తరువాత ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తారు. అక్కడకు కొద్దిరోజుల తరువాత గ్రామీణ పల్లెవెలుగు సర్వీసుగా మార్చుతారు. 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన తరువాత వాటిని కాలం చెల్లినవిగా పరిగణించి కార్గో, ఇతరత్రా సేవలకు వినియోగిస్తున్నారు. ఏళ్ల తరబడి కొత్త బస్సులు కొనుగోలు లేకపోవడంతో ఉన్న వాటితోనే సిబ్బంది నెట్టుకొస్తున్నారు. బస్సు డిపోలకు చేర్చినప్పుడు స్థితిగతులను లాగ్‌బుక్‌లో రాయాలి. బస్సు సాంకేతిక సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి డిపో మెకానిక్‌లు వాటికి మరమ్మతులు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా రాత్రి పూట జరుగుతుంది. ఆ మరుసటి రోజుకు సమస్యలను పరిష్కరించి బస్సును వేళకు అందుబాటులో ఉంచాలి. కానీ డిపోల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బస్సులు మరమ్మతులకు కూడా వీల్లేని స్థితిలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు డిపో గ్యారేజీల్లో సిబ్బంది కొరత, పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారి నియామకం పూర్తి స్థాయిలో జరగటం లేదు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
బస్ కండిషన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
జిల్లాలో 306 బస్సులు ఉన్నాయి. గతేడాది 100 బస్సులు ఫేజ్ లిఫ్టింగ్ చేశాము. ఆర్‌టిసి గ్యారేజీలో రోజు వారీ పర్యవేక్షణ ఉంటుంది. డ్రైవర్లుకు శిక్షణ ఇస్తున్నాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు విధిగా జరుగుతున్నాయి. జిల్లాకు 7 కొత్త బస్సులు కేటాయించారు. గోకవరం - కాకినాడ 5 బస్సులు, నిడదవోలు- రాజమహేంద్రవరం 2 బస్సులు కేటాయించారు.
కుమారి షర్మిల అశోక, తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణ అధికారి