Oct 29,2023 00:44

సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్‌ విజయ, రమాతారక్‌నాధ్‌

ప్రజాశక్తి-గుంటూరు : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, జీవన విధానంలో తగిన మార్పులు చేసుకుంటే పక్షవాతం బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని నగరంలోని పలువురు ప్రముఖ న్యూరాలజిస్టులు పేర్కొన్నారు. ప్రంపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో న్యూరో సైంటిస్ట్‌ అసోసియేషన్‌ సహకారంతో బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం స్ట్రోక్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలో ప్రముఖ న్యూరాలజిస్టులు డాక్టర్‌ రమాతారక్‌నాథ్‌, డాక్టర్‌ పి.విజయ, డాక్టర్‌ అరుణకుమారి, డాక్టర్‌ సిహెచ్‌.శివరామకృష్ణ డాక్టర్‌ వందనపు నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత స్ట్రోక్‌కు దారి తీసే ప్రమాద కారకాలపై ఉచిత ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.
కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలతోపాటు ప్రతి ఒక్కరికీ వారు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై, ఆహారంపై పలు తగిన సూచనలు చేశారు. వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్‌.శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో డాక్టర్‌ రమాతారక్‌నాధ్‌ మాట్లాడుతూ షుగర్‌ను నియంత్రిస్తే 80 శాతం పక్షవాతం రాకుండా నియంత్రించొచ్చని అన్నారు. డాక్టర్‌ పి.విజయ మాట్లాడుతూ ఏడాదికి పది కోట్ల మంది దీని బారిన పడుతున్నారని, అయితే వీటిల్లో 90 శాతం నివారించదగినవేనని చెప్పారు. ముఖ్యంగా పక్షవాతం నివారణకు అవగాహన చాలా ముఖ్యమని చెప్పారు. దీన్ని నియంత్రించలేకపోతే 2050 నాటికి వ్యాధి బారిన పడే వారి సంఖ్య రెట్టింపయ్యే ప్రమాదం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. వైద్యం ఖరీదైన ఈ తరుణంలో నగరంలోని ప్రముఖ న్యూరాలజిస్టులు స్ట్రోక్‌పై అవగాహన కార్యక్రమంలో, పరీక్షలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు. సదస్సుకు హాజరైన ప్రజలు వెలిబుచ్చిన సందేహాలను వైద్యులు సవివరంగా నివృత్తి చేశారు. కారక్రమాన్ని ప్రజారోగ్య వేదిక నాయకులు ఎల్‌.ఎస్‌.భారవి, ప్రజారోగ్య వేదిక జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్యవేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎ.సత్యనారాయణప్రసాద్‌ పర్యవేక్షించారు.