Dec 21,2022 22:25

మృతిచెందిన చంద్రగిరి చంద్రయ్య ఆచారి

శ్రీకాళహస్తిలో తంత్ర వైద్యుడు దారుణ హత్య
పోలీసుల అదుపులో అనుమానితుడు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి:
మంత్రం తెచ్చిన తంటా ఓ వ్యక్తి నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. మంత్రం ఫలించలేదన్న కారణంగా చంద్రగిరి చంద్రయ్య ఆచారి (56) అనే తంత్ర వైద్యుని బుధవారం పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి అతికిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన శ్రీకాళహస్తలో సంచలనం కలిగించింది. టూ టౌన్‌ పోలీసుల కథనం మేరకు. పట్టణంలోని కైలాసగిరి కాలనీకి చెందిన చంద్రగిరి చంద్రయ్య ఆచారికి భార్య నిర్మల, కూతురు నీలావతి, కుమారుడు రుద్ర ఉన్నారు. పిల్లలకు ఇద్దరికి వివాహమైంది. కుమార్తె నీలావతి తన భర్తతో కలసి కైలాసగిరి కాలనీలో నివాసం ఉంటోంది. చంద్రయ్య ఆచారి ఆరోగ్యం బాగా లేని వారికి మంత్రించడం, తంత్రాలు వేయడం చేస్తుండేవాడు. అదేవిధంగా జ్యోతిష్యం చెప్పేవాడు. ఈయన పల్లెలకు కూడా వెళ్లేవాడు. తన వద్దకు వచ్చే వారికి మంత్రించడం, తంత్రాలు వేయడం, జ్యోతిష్యం చెప్పడం కోసం ఈయన కైలాసగిరి కాలనీ సమీపంలోని ఉపాధ్యాయనగర్‌ వద్ద ఒక గది నిర్మించుకున్నాడు. కొంతకాలం కిందట ఉపాధ్యాయనగర్‌ వద్ద బోర్డు కూడా ఈయన ఏర్పాటు చేశాడు. చంద్రయ్య ఆచారి వద్దకు పలువురు వచ్చి మంత్రించుకోవడం, తంత్రాలు వేయించుకోవడం, జ్యోతిష్యం చెప్పించుకోవడం చేసే వారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం10:30 గంటకు ఉపాధ్యాయ నగర్‌ లోని పూజ గదిలోనే ఆయన్ను పట్టపగలే గొంతుకోసి దారుణంగా హత్య చేయడం చర్చనీయాంశంగా మారింది. వైద్యం కోసం వచ్చినవారే ఇలా చేసి ఉండవచ్చన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట సమీపంలోని పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన నాగార్జునరెడ్డిని అనుమతుడిగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగార్జున రెడ్డి దంపతులకు సంతానం కోసం మూడేళ్లుగా శ్రీకాళహస్తిలోని చంద్రయ్య ఆచారి వద్దకు తిరుగుతున్నారనీ, అయినా వారికి సంతానం కలగకపోవడంతో ఈ పనికి పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.